logo

టోల్‌ తీస్తారు

విజయనగరం జిల్లాలో మూడు ప్రాంతాల్లో టోల్‌ ప్లాజాలు త్వరలో ప్రారంభించనున్నారు.

Published : 28 Apr 2024 04:39 IST

జొన్నాడ సమీపంలో జరుగుతున్న పనులు

ఈనాడు, విజయనగరం: విజయనగరం జిల్లాలో మూడు ప్రాంతాల్లో టోల్‌ ప్లాజాలు త్వరలో ప్రారంభించనున్నారు. వాటి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ మూడింటి వల్ల విజయనగరం, మన్యం జిల్లాల సహా ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల వాహనదారులకు టోల్‌ రుసుము రూపంలో అధికభారం పడనుంది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భగ్గుమంటున్న తరుణంలో వారికి ఈ రూపంలో మరో షాక్‌ తగలనుంది. జిల్లాలో ఇంతవరకు ఎక్కడా టోల్‌ ప్లాజాలు లేవు. జాతీయ రహదారి -16పై భోగాపురం- నాతవలస మధ్య కొన్నేళ్లుగా ఒక్కటే కొనసాగుతోంది. తాజాగా మూడు ప్రాంతాల్లో జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ వీటిని సిద్ధం చేస్తోంది.

విజయనగరం శివారులో చెల్లూరు-గొట్లాం మధ్య నిర్మించిన బైపాస్‌ రోడ్డుపై టోల్‌ ప్లాజా ఏర్పాటుకు గతంలో అధికారులు ప్రతిపాదించారు. అప్పట్లో కేంద్రంలో కీలక పదవిలో ఉన్న జిల్లా తెదేపా నాయకుడొకరు దాన్ని అడ్డుకున్నారు. జిల్లా సరిహద్దులోని రాజాపులోవ కూడలి - విజయనగరం మార్గంలో ఏర్పాటుకు సైతం ఆయన వ్యతిరేకించారు. నూతన రహదారుల నిర్మాణం తర్వాత టోల్‌ ప్లాజాలను మాజీ సైనికులకు టెండర్ల ద్వారా కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ మంజూరు చేస్తోంది. వారి పేరిట చేజిక్కించుకోవాలని కొంత మంది బడాబాబులు డేగకళ్లతో ఎదురుచూస్తుంటారు. అలాంటి వారంతా రింగై టెండర్లు దక్కించుకుంటారు. ఒకరి పేరిట దక్కించుకొని అందరూ భాగస్వాములవుతారు. విజయనగరం బైపాస్‌ రోడ్డులో ప్లాజా ఏర్పాటు వల్ల పెద్దగా ఆదాయం ఉండదని వారు భావించారు. సరకు రవాణా వాహనాలు తప్ప మిగిలిన అన్ని వాహనాలు విజయనగరం మీదుగా రాకపోకలు సాగిస్తాయి. టోల్‌ప్లాజా ఏర్పాటు స్థలం మారిస్తే వేలాది వాహనాల నుంచి నెలకు రూ.కోట్లలో రుసుము వసూలవుతుందని లెక్కలేశారు. జొన్నాడ సమీపంలో టోల్‌ప్లాజా ఏర్పాటుకు సహకరించాలని జిల్లాలో వైకాపాకు చెందిన కీలక నేతను వారు  సంప్రదించారు. దిల్లీలో పాత పరిచయాలతో ఆ నేత చక్రం తిప్పారు. ఫలితంగా జొన్నాడలో టోల్‌ప్లాజా ఏర్పాటుకు అధికారులు అంగీకారం తెలిపారని తెలిసింది. ఈ వ్యవహారంలో సదరు నేతకు సుమారు రూ.8 కోట్లు అందినట్లు సమాచారం.

మరో రెండు ఎక్కడంటే..

విజయనగరం - ఎస్‌.కోట- (వయా బొడ్డవర) జాతీయ రహదారి 516(ఈ)పై గంట్యాడ - కొర్లాం మధ్యలో ఒకటి.. విశాఖపట్నం - రాయపూర్‌ జాతీయ రహదారి- 26లో మానాపురం రైల్వే గేటు దాటిన తర్వాత మరో ప్లాజా ఏర్పాటుకు నిర్మాణాలు చేపడుతున్నారు. జాతీయ రహదారులపై 60 కిలోమీటర్ల పరిధిలో రెండు టోల్‌ప్లాజాలు ఉండకూడదు. ఉంటే ఒక దాన్ని మూసివేయాలి. జొన్నాడ నుంచి మానాపురం వరకు దూరం 60 కిలోమీటర్ల లోపే ఉంటుంది. ఈ రెండు వేర్వేరు రహదారులుగా చూపితే తప్ప ఒకే మార్గంలో ఏర్పాటు చేస్తే చట్టవిరుద్ధమే అవుతుందని.. ఈ కోణంలో వివరాలు సేకరిస్తున్న కొందరు రవాణా రంగ నిపుణులు, ప్రతిపక్ష పార్టీల నాయకులు న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

మానాపురం సమీపంలో టోల్‌ గేట్‌ నిర్మించే ప్రదేశం

ప్రయాణికులపై భారమే

రాష్ట్రంలోని రోడ్ల వినియోగానికి ప్రతి వాహనదారుడు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి రోడ్‌ ట్యాక్స్‌ చెల్లించాలి. ఇది చెల్లించిన తరువాత వివిధ మార్గాల్లో వాహనం నడపాలంటే టోల్‌ పన్ను కట్టాలి. టోల్‌ గేట్ల వద్ద నాలుగు చక్రాల వాహనాల పరిమాణం బట్టి ఏడు రకాలుగా విభజించి రుసుము వసూలు చేస్తారు. ఆర్టీసీ బస్సులు చెల్లించే రుసుమును ప్రభుత్వం ప్రయాణికులపై ఆ భారం మోపుతోంది. ఈ ప్లాజాలు ప్రారంభిస్తే ఆయా మార్గాల్లో రాకపోకలు సాగించే ప్రయాణికుల బస్‌ ఛార్జీలు పెరుగుతాయి. వాహనాల ఫాస్టాగ్‌లో డబ్బులు లేకపోతే రెట్టింపు రుసుము వసూలు చేస్తారు. ఇలా ఒక్కో ప్లాజాలో నెలకు రూ.కోట్లలోనే వసూలవుతుంది. సార్వత్రిక ఎన్నికల తర్వాత వీటిని ప్రారంభించే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని