logo

జిల్లా ఓటర్లు 7,83,440

సార్వత్రిక ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకునే ఓటర్ల తుది జాబితా సిద్ధమైంది.

Published : 28 Apr 2024 04:41 IST

మహిళలే అధికం
జిల్లా కేంద్రంలో తక్కువే

పార్వతీపురం, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకునే ఓటర్ల తుది జాబితా సిద్ధమైంది. జనవరి 22న ప్రకటించిన జాబితా ప్రకారం జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో 7,75,598 మంది ఓటర్లుండగా, తుది జాబితాలో ఆ సంఖ్య 7,83,440కి చేరింది. మొత్తం 7,842 మంది పెరిగినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. 

పురుషులు తక్కువే..

జిల్లాలో ఈ సారి అన్ని నియోజకవర్గాల్లో మహిళా ఓటర్ల ఆధిపత్యం కనిపిస్తోంది. పురుషుల కంటే వీరి సంఖ్య 18,190 ఎక్కువగా ఉంది. అత్యధికంగా కురుపాంలో 5,400, పాలకొండలో 5,067, సాలూరులో 4,945, పార్వతీపురంలో 2,778గా ఉన్నారు. అన్ని వర్గాల ఓటర్ల వివరాలకు సంబంధించి సాలూరులో రెండు లక్షలకు పైగా నమోదయ్యారు. జిల్లా కేంద్రం పార్వతీపురంలో మిగిలిన నియోజకవర్గాల కంటే తక్కువగా 1,89,817 మంది ఉన్నారు.

పెరిగిన యువత  

తుది జాబితాలో యువ ఓటర్ల సంఖ్య భారీగా పెరిగింది. జిల్లాలో వీరు దాదాపు 22 వేల మంది ఉన్నారు. జనవరిలో ప్రకటించిన జాబితాలో ఈ సంఖ్య కేవలం 13,017. తాజా జాబితాలో 15,568గా నమోదైంది. ఇటీవల 18, 19 ఏళ్ల మధ్యనున్న విద్యార్థులు ఎక్కువగా దరఖాస్తులు చేసుకోవడంతో వారు పేర్లు జాబితాల్లో చేరాయి. ఈమేరకు జిల్లా వ్యాప్తంగా అదనంగా 7,842 మంది కొత్తగా చేరారు.  

ఎన్‌ఆర్‌ఐలు 18 మంది..

ఈసారి విదేశాల్లో ఉన్న భారతీయులకు ఓటుహక్కు వినియోగించుకొనే అవకాశం కల్పించారు. జిల్లాలో ప్రవాస భారతీయ ఓటర్లను గుర్తించి ఓటు కల్పించారు. జిల్లాలో 18 మంది ఎన్‌ఆర్‌ఐలకు ఓటు హక్కు ఉంది. వీరిలో 16 మంది పురుషులు, ఇద్దరు మహిళలు. వీరితో పాటు వివిధ ప్రాంతాల్లో ఉన్న 2,235 మంది సర్వీసు ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 2,123 మంది, మహిళలు 112 మందిగా నమోదయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని