logo

ఆదుకుంటానన్నావ్‌.. పీల్చి పిప్పి చేశావ్‌!!

వైకాపా అధికారంలోకి వచ్చాక ఉమ్మడి జిల్లాలో ఉన్న రెండు పరిశ్రమలను సైతం మూసేసి చెరకు రైతుల నోట్లో మట్టికొట్టారు. పనిచేస్తున్న కార్మికులను పస్తుల్లో ఉంచారు. చెరకు పంట సాగు ప్రశ్నార్థకంగా మారేలా చేశారు.

Updated : 28 Apr 2024 09:50 IST

జగన్‌పాలనలో చెరకు రైతుకు అన్యాయం

‘‘ చెరకు రైతులకు పూర్వవైభవం తీసుకువస్తాం.. పరిశ్రమలు మూతపడకుండా నడిపిస్తాం. యాజమాన్యాల ముక్కుపిండైనా అన్ని రకాల బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకుంటాం’ అని ప్రతిపక్ష నేతగా జిల్లాకు వచ్చిన సమయంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలివి.

వైకాపా అధికారంలోకి వచ్చాక ఉమ్మడి జిల్లాలో ఉన్న రెండు పరిశ్రమలను సైతం మూసేసి చెరకు రైతుల నోట్లో మట్టికొట్టారు. పనిచేస్తున్న కార్మికులను పస్తుల్లో ఉంచారు. చెరకు పంట సాగు ప్రశ్నార్థకంగా మారేలా చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని లచ్చయ్యపేట చక్కెర కర్మాగారం, విజయనగరం జిల్లాలోని జామి మండలంలో ఉన్న భీమసింగి సహకార చక్కెర కర్మాగారాలు మూతపడడంతో వేలాది మందికి చేదు అనుభవాలు మిగిలాయి.

ఈనాడు, విజయనగరం, న్యూస్‌టుడే, బొబ్బిలి, జామి, ఎస్‌.కోట

ఆధునికీకరణ పేరుతో మూసివేత

ఎస్‌.కోట నియోజకవర్గంలోని భీమసింగి సహకార చక్కెర కర్మాగారాన్ని ఆధునికీకరణ పేరుతో మూడేళ్ల కిందట మూసేశారు. ఈ కర్మాగారం పరిధిలో 14 మండలాలకు చెందిన సుమారు 20,000 మంది రైతులు ఉన్నారు. సుమారు రూ.5 కోట్ల బకాయిలు ఉండేవి. ఎన్నో ఆందోళనల తరువాత వారివైపు చూశారు. కానీ కార్మికులను పట్టించుకోలేదు. వారికి రూ.10 కోట్ల మేర బకాయిలు ఉండగా నేటి వరకు రూపాయి కూడా ఇవ్వలేదు. దీంతో వారంతా రోడ్డెక్కుతున్నారు. మిల్లును తెరవాలని ఆందోళన చేస్తున్నా యంత్రాంగం పట్టించుకోవడంలేదు. పంట లేదని, అందుకే తెరవడం లేదని నేతలు సాకులు చెబుతున్నారు.

మూతపడ్డ భీమసింగి చక్కెర కర్మాగారం

ఏకంగా అమ్మకం..

పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం లచ్చయ్యపేట ఎన్‌సీఎస్‌ చక్కెర కర్మాగారం మూడేళ్లుగా మూతపడటంతో చెరకు రైతులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2002-03 సీజనులో గానుగ ప్రారంభించిన ఈ కర్మాగారం చక్కగా సాగేది. చెరకు పంట సాగు విస్తీర్ణం పెంచేందుకు రైతులకు ప్రోత్సాహకాలను అందిస్తూ, ప్రతి 15 రోజులకోసారి చెల్లింపులు చేపట్టేవారు. వైకాపా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చెల్లింపుల్లో జాప్యం పెరిగింది. 2018లో పాదయాత్ర చేసిన జగన్‌మోహన్‌రెడ్డి చెరకు రైతులు, కార్మికులను ఆదుకుంటానని హామీ ఇచ్చారు. 2019-20 సీజన్‌ నాటికి బకాయిలు రూ.24 కోట్లకు చేరాయి. అప్పట్లో పెద్దఎత్తున ఆందోళనలు జరిగాయి. దీంతో రెవెన్యూ రికవరీ చట్టాన్ని అమలు చేసి కర్మాగారానికి అనుబంధంగా ఉన్న 64 ఎకరాల భూమిని అమ్మి, చెల్లింపులు చేపట్టారు. ప్రజా ప్రతినిధుల పర్యవేక్షణలో ప్రత్యేక కమిటీని వేసి యాజమాన్య వ్యాపార లావాదేవీలపై అధికారం కల్పించారు. ఆపై కమిటీ సభ్యులు పర్యవేక్షణ చేపట్టినా అప్పటి నుంచి చెల్లింపుల్లో జాప్యం జరుగుతూనే వచ్చింది. అలా రెండు సీజన్‌ల బకాయిలు రూ.16.33 కోట్లకు చేరడంతో పాటు కార్మికులకు రూ.6 కోట్లు చెల్లించాల్సి వచ్చింది. దీంతో మరోసారి ఆర్‌ఆర్‌ చట్టాన్ని అమలు చేస్తూ సీతానగరం, బొబ్బిలి రెవెన్యూలోని 27 ఎకరాల భూమిని వేలం వేశారు. 2022 ఫిబ్రవరి 9న నిర్వహించిన వేలంలో 27 ఎకరాల భూమిని రూ.20.05 కోట్లకు ఓ రియల్‌ ఎస్టేట్ సంస్థ దక్కించుకుంది. ఆ మొత్తాన్ని చెల్లించేందుకు సంస్థకు దాదాపు ఏడాది సమయం పట్టింది. మరోపక్క గానుగ నిర్వహణకు యాజమాన్యం సిద్ధం కాకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గంగా సంకిలి కర్మాగారానికి చెరకు తరలించాలని ప్రకటించారు. మొదటి సీజన్‌లో తరలింపునకు రైతులు అవస్థలు పడ్డారు. రెండో సీజన్‌తో పాటు మధ్యవర్తుల ప్రమేయంతో మెట్రిక్‌ టన్నుకు రూ.300 వరకు నష్టపోయారు. విసుగు చెందిన కొందరు చెరకును తొలగించి ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లారు. ఆపై మిల్లు పూర్తిగా మూతపడింది.

చర్యలు లేవీ?

ఉమ్మడి జిల్లాలో మూతపడ్డ కర్మాగారాలను తెరిపించేందుకు వైకాపా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. సుమారు 60 వేల మంది వీటి పరిధిలో ఉన్నా ప్రజాప్రతినిధులకు పట్టడం లేదు. చిన్న, సన్నకారు రైతులు గత 50 ఏళ్లుగా చెరకు పంటనే సాగు చేసేవారు. ఇప్పుడు వీరంతా సాగుకు దూరమయ్యారు. ప్రతిపక్ష నేతగా రైతులకు, కార్మికులకు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి జగన్‌ పెడచెవిన పెట్టారు. రైతు పక్షపాతిగా చెప్పుకొనే ప్రభుత్వం అన్నదాతల బాధలు గుర్తించడం లేదని ఆవేదన చెందుతున్నారు.

భర్తాపురంలో చెరకు స్థానంలో కొబ్బరిసాగు

పడిపోయిన విస్తీర్ణం : ఉమ్మడి జిల్లాలో నాలుగేళ్ల కిందట చెరకు సాగు విస్తీర్ణం లక్ష హెక్టార్లలో ఉండేది.. నేడు 13,218 వేల ఎకరాలకు తగ్గిపోయింది. కర్మాగారాలు సకాలంలో చెల్లింపులు చేయకపోవడం, ఆపై మూతపడడంతో రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గుచూపుతున్నారు. మూతపడ్డ కర్మాగారాల పరిధిలో రూ.లక్ష టన్నుల్లో ఉండే గానుగ గత రెండేళ్లలో వేల సంఖ్యకు పడిపోయింది.

భీమసింగి పరిధిలో..

భీమసింగి కర్మాగారం పరిధిలోని 14 మండలాల్లో సుమారు 2 లక్షల టన్నుల వరకు చెరకు సరఫరా అయ్యేది. 11 వరకు తూనిక యంత్రాలుండేవి. ప్రస్తుతం రెండు మాత్రమే నడుస్తున్నాయి. మరోవైపు బెల్లం తయారుదారులకు కూడా ఇబ్బందులు తప్పడం లేదు.

ఆర్థికంగా ఇబ్బందులు.. భీమసింగి కర్మాగారంలో ఉద్యోగ విరమణ చేసిన కార్మికులకు నేటికీ గ్రాట్యుటీ బకాయిలు చెల్లించలేదు. దీంతో ఆకలి కేకలు పెడుతున్నారు. చాలా మంది అనారోగ్యానికి గురయ్యారు. వారు మందులకు డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి, మంత్రి బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్యకు వినతులు ఇచ్చినా స్పందించలేదని వాపోతున్నారు.


ఐదేళ్లుగా గ్రాట్యుటీ లేదు

నేను భీమసింగి కర్మాగారంలో ఫీల్డుమ్యాన్‌గా పనిచేసి అయిదేళ్ల కిందట ఉద్యోగ విరమణ పొందా. నాకు గ్రాట్యుటీ రూ.లక్ష వరకు రావాలి. ఇప్పటికీ ఇవ్వలేదు. గుండె జబ్బుతో బాధపడుతున్నా. మందులు కొనేందుకూ డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నా. నాలాగే చాలా మంది అప్పులు పాలయ్యారు. అయినా ఎవరూ స్పందించలేదు.  

ఎర్నాయుడు, విశ్రాంత కార్మికుడు


చెప్పులు కుట్టుకుంటున్నా

భీమసింగి చక్కెర కర్మాగారంలో సీజనల్‌ కార్మికుడిగా ఉద్యోగ విరమణ చేశాను. గ్రాట్యుటీ బకాయిలు ఏళ్లుగా రాకపోవడంతో కుటుంబ పోషణ కష్టంగా మారింది. దీంతో నా కుల వృత్తి అయిన చెప్పులు కుట్టుకుని జీవనం సాగిస్తున్నా. రోజంతా కష్టపడినా రూ.100 రావడం కష్టంగా ఉంది.

పోలయ్య, సీజనల్‌  కార్మికుడు, భీమసింగి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు