logo

కంకర గుటకాయ స్వాహా

కొండలు.. గుట్టలు.. అనే తేడా లేదు.. ఎక్కడ మట్టి కనిపిస్తే అక్కడ తవ్వేస్తాం.. ఎర్రమట్టిని అమ్మేస్తాం.. అడిగితే దౌర్జన్యానికి దిగుతాం.. అన్న రీతిలో నడుస్తోంది గరివిడి, గజపతినగరం నియోజకవర్గాల్లో అక్రమ తవ్వకాల పరిస్థితి.

Published : 29 Apr 2024 05:11 IST

న్యూస్‌టుడే, గరివిడి, గంట్యాడ గ్రామీణం, మెంటాడ, గజపతినగరం, బాడంగి

గుర్ల మండలం పోలాయవలసలో కొండను తవ్వేసిన దృశ్యం

కొండలు.. గుట్టలు.. అనే తేడా లేదు.. ఎక్కడ మట్టి కనిపిస్తే అక్కడ తవ్వేస్తాం.. ఎర్రమట్టిని అమ్మేస్తాం.. అడిగితే దౌర్జన్యానికి దిగుతాం.. అన్న రీతిలో నడుస్తోంది గరివిడి, గజపతినగరం నియోజకవర్గాల్లో అక్రమ తవ్వకాల పరిస్థితి. వైకాపా పెద్దల అండతో అడ్డూ అదుపూ లేకుండా గుట్టల్ని మాయం చేస్తున్నారు. పగలు, రాత్రి తేడాలేకుండా యథేచ్ఛగా ఈ తతంగం సాగిపోతున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.

రూ.లక్షల్లో వ్యాపారం

గరివిడి, చీపురుపల్లి పట్టణాల పరిధిలో ఎక్కడ లేఅవుట్‌ వేసినా భూముల చదునుకు అవసరమైన ఎర్రమట్టి కోసం కొండల్ని తవ్వేస్తున్నారు. రాత్రి వేళల్లో ట్రాక్టర్ల ద్వారా మట్టిని తరలించుకుపోతున్నారు. ఒక్కో ట్రాక్టర్‌ మట్టిని రూ.వెయ్యి చొప్పున విక్రయిస్తూ జేబులు నింపుకుంటున్నారు. గుర్లలో కొన్ని చోట్ల తవ్వకాల అనంతరం ఆ భూములను చదును చేసి జీడి, మామిడి తోటల సాగుకు అనువుగా సిద్ధం చేసుకుని ఆక్రమించేస్తున్నారు. చెరువులు, కాలువ కట్టలనూ వదల్లేదు. ఇటుకల పరిశ్రమల్లో ఇటుకలు తయారీకి అవసరమైన మట్టిని చెరువు గర్భాల్లో ఇష్టానుసారం తవ్వేశారు. వెదుళ్లవలస, కోనూరు, కోటగండ్రేడు, పెదబంటుపల్లి, చుక్కవలస తదితర గ్రామాల్లో చెరువుల మట్టిని దోపిడీ చేశారు. గరివిడి, చీపురుపల్లి మండలాల్లో తోటపల్లి కుడి కాలువ కట్టలను మట్టి కోసం ఎక్కడికక్కడే తవ్వేస్తున్నారు. గజపతినగరం, మెంటాడ, గంట్యాడలోని అనేక కొండల్ని అక్రమార్కులు కరిగించేస్తున్నారు.


బాడంగి మండలంలో కంకర అక్రమ తవ్వకాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. తహసీల్దారు కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న బందలో అక్రమంగా గ్రావెల్‌ తవ్వకాలు చేపట్టారు. రామచంద్రపురం సమీపంలోని చెరువునూ తవ్వేస్తున్నారు.


ఇది మెంటాడ సమీప కొండ. చుట్టూ ఇలా కంకర తవ్వారు. తవ్వకాలకు అనుమతులు ఒకచోట పొంది వేరొక చోట మట్టిని తీసి, దిగువన ఉన్న రైతుల పొలాలను ధ్వంసం చేశారు. గుత్తేదారులకు అప్పగించి, నేతలు కాసులు దండుకున్నారు. జయతి ప్రాంతంలో డి.పట్టా రైతుల భూముల్లో తవ్వకాలు జరిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని