logo

అన్నను మించిన అన‘కొండ’లు

మృత్యుదూతగా పేరొందాడు నాటి యమకింకరుడు.. కంకరను బొక్కేసే నాయకులను వెనకుండి నడిపిస్తున్నాడు నేటి యమకంకరుడు జగన్‌.. ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అదేపనిగా తవ్వకాలు ప్రారంభించిన కొందరు కేటుగాళ్లు ఈ ఐదేళ్ల కాలంలో పెద్దపెద్ద కొండలనే కరిగించేశారు.

Updated : 29 Apr 2024 07:27 IST

గజపతినగరం మండలం మరుపల్లిలో అక్రమ తవ్వకాలతో రూపుకోల్పోయిన కొండ

మృత్యుదూతగా పేరొందాడు నాటి యమకింకరుడు.. కంకరను బొక్కేసే నాయకులను వెనకుండి నడిపిస్తున్నాడు నేటి యమకంకరుడు జగన్‌.. ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అదేపనిగా తవ్వకాలు ప్రారంభించిన కొందరు కేటుగాళ్లు ఈ ఐదేళ్ల కాలంలో పెద్దపెద్ద కొండలనే కరిగించేశారు. కొన్నింటిని నామరూపాల్లేకుండా చేసేశారు.. ప్రకృతి ప్రేమికులు నిలదీస్తే కేసులు.. అధికారులు అడ్డుకుంటే బెదిరింపులు.. అయినా మన సీఎంకు ఖాతరే లేదు..


గ్రావెల్‌ మాఫియాకు అడ్డా నెల్లిమర్ల

భోగాపురం మండలం రావాడ రెవెన్యూలో రూపుకోల్పోయిన కొండ

నెల్లిమర్ల నియోజకవర్గం గ్రావెల్‌ మాఫియాకు అడ్డాగా మారింది. ఇక్కడున్న ఓ ప్రజాప్రతినిధి ఈ ఐదేళ్లలో సంపాదించిన సొమ్ములో సగం కంకర అమ్మకాలతోనే వచ్చిందని స్వయంగా ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు. ఆయన అనుచరులు గ్రామగ్రామాన వెళ్లి చూడడం.. కొండ కనిపిస్తే అక్కడ వాలిపోవడం.. అదే వారి పని.. ఇప్పటికే కొన్నింటిని దొలిచేశారు. బీ డెంకాడ మండలం గుణుపూరుపేట, పినతాడివాడ, జొన్నాడ, గండిబోయిన కళ్లాలు తదితర ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఉంది. బీ భోగాపురం మండలంలోని లింగాలవలస కొండను ఇప్పటికే సగం మేర చదును చేసేశారు. చెరుకుపల్లి, రావాడ, గంట్లాం ప్రాంతాల్లో నామరూపాల్లేకుండా చేసేశారు.

న్యూస్‌టుడే, భోగాపురం, డెంకాడ


కొండకరకంలో కేటుగాళ్లు..

విజయనగరం మండలం గాజులరేగ శివారులోని కొండకరకం ప్రాంతంలో వందలాది ఎకరాల్లో కొండలు విస్తరించి ఉన్నాయి. స్థానికులతో పాటు సమీప ప్రాంతాల్లోని పశువులకు ఇవే ఆధారమయ్యేవి. ప్రస్తుతం  ఆ పరిస్థితి లేదు. రెండు మూడేళ్లుగా ఇక్కడ పదుల ఎకరాల్లో తవ్వకాలు చేపట్టారు. అధికారపార్టీ నాయకుల అండ చూసుకొని కొందరు అక్రమార్కులు పిండి చేస్తున్నారు. రాత్రి వేళల్లో ట్రాక్టర్లతో కంకరను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. గతంలో ‘ఈనాడు’లో వచ్చిన పలు  కథనాలపై అధికారులు స్పందించి, పరిశీలించారు. అనంతరం పరిస్థితి  మళ్లీ మొదటికొచ్చింది. -న్యూస్‌టుడే, విజయనగరం గ్రామీణం


ఓ కీలక ప్రజాప్రతినిధి నివాసముండే  నెల్లిమర్ల మండలంలోనూ తవ్వకాలకు అడ్డులేకుండా పోతోంది. గ్రామాల్లో ఉన్న గుట్టలను కూడా వదలడం లేదు. గరికిపేట, బొప్పడాం, దన్నానపేట, రామతీర్థం, జగ్గరాజుపేట, కొండవెలగాడ తదితర ప్రాంతాల్లో ఈ పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే కొన్ని మాయం కాగా.. ఎన్నికల నేపథ్యంలో మిగిలిన చోట్లా తవ్వేస్తున్నారు.

న్యూస్‌టుడే, నెల్లిమర్ల


అక్కడ ఇష్టారాజ్యం..

గంట్యాడ మండలంలో అక్రమార్కుల ఆగడాలకు అధికార యంత్రాంగం తోడవడంతో కంకర దోపిడీ ఇష్టారాజ్యంగా సాగుతోంది. బుడతనాపల్లి, కిర్తుబర్తి, కొండతామరాపల్లి, గింజేరు గ్రామాల్లో ఉన్న కొండలను సగం మేర దొలిచేశారు. గనులశాఖ అనుమతులు తీసుకోవాల్సి ఉన్నా పట్టించుకోకుండా రూ.కోట్ల విలువైన గ్రావెల్‌ను తరలించుకు పోతున్నారు. అనుమతులు లేనిచోట కనీసం రాయల్టీ అయినా చెల్లించాలి. ఇవేవీ లేకుండా రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తుల అండదండలతో ఈ తంతు సాగుతోంది. పలుమార్లు రెవెన్యూ అధికారులు అడ్డుకున్నా.. వారిని కూడా లెక్కచేయకుండా ముందుకెళుతున్నారు.


చీపురుపల్లిలోనూ అంతే..

నెల్లిమర్ల నియోజకవర్గానికి దీటుగా చీపురుపల్లి నియోజకవర్గంలోనూ తవ్వకాలు సాగుతున్నాయి. ఇక్కడున్న ఓ ప్రజాప్రతినిధి అనుచరులు చెప్పిందే వేదం.. వారిని అడిగేవారే లేరు.. అడ్డుచెప్పే వారే ఉండరు. దీంతో గడిచిన ఐదేళ్లలో కొండలు, గుట్టలు తేడా లేకుండా తవ్వేశారు. చివరకు తోటపల్లి కాలువ గట్లనూ వదల్లేదు. గరివిడి మండలం కోడూరు కొండ, గుర్ల మండలం పోలాయవలస పరిధిలోని చిల్లంగి మెట్ట ఇప్పటికే వారిబారిన పడ్డాయి. వెంకుపాత్రునిరేగ, రేగటి, దుమ్మేద, వెదుళ్లవలస పరిధిలో కొండలు, గుట్టలు, కొండగండ్రేడు, ఎస్‌ఎస్‌ఆర్‌.పేట, రాగోలు సమీపంలోని కొండలన్నింటికీ వారి నుంచి ముప్పు పొంచి ఉంది. 

న్యూస్‌టుడే, గరివిడి


రుషికొండ గుర్తుకొచ్చేలా..

మెంటాడ మండలం జయతి కొండ చుట్టూ ఇలా కంకర తవ్వి మట్టిని తరలించారు. ఇందులో భాగంగా స్థానికంగా ఉన్న పలువురు నేతలకు భారీగా ముడుపులు అందినట్లు ఆరోపణలున్నాయి. కొండ కింద రిజర్వ్‌ ఫారెస్టు ఉన్నా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు.

న్యూస్‌టుడే, గజపతినగరం, మెంటాడ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని