logo

చికిత్స పొందుతూ వివాహిత మృతి

మండలంలోని రాజాపులోవ గ్రామానికి చెందిన వివాహిత చందక పుష్ప బలవన్మరణానికి పాల్పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందింది.

Published : 30 Apr 2024 03:59 IST

చందక పుష్ప
(పాతచిత్రం)

భోగాపురం, న్యూస్‌టుడే: మండలంలోని రాజాపులోవ గ్రామానికి చెందిన వివాహిత చందక పుష్ప బలవన్మరణానికి పాల్పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందింది. పోలీసుల వివరాల మేరకు.. మూడేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన కిలారి శ్రీనుతో పుష్పకు వివాహం జరిగింది. ఇద్దరి మధ్య మనస్పర్థల కారణంగా ఏడాది క్రితం పెద్దల సమక్షంలో విడిపోయారు. తల్లి ముత్యాలమ్మ కుమార్తెకు భర్తతోనే జీవితం కొనసాగించాలని నచ్చజెప్పింది. తనకు ఇష్టం లేని వ్యక్తితో ఉండకూడదని 23న ఇంట్లో చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్యకు యత్నించింది. కుటుంబ సభ్యులు ఆమెను కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందింది. పదేళ్ల క్రితం  భర్తను కోల్పోయిన ముత్యాలమ్మకు ఇటు కుమార్తె కూడా దూరమవడంతో కన్నీరు మున్నీరుగా విలపించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై సూర్యకుమారి తెలిపారు.


రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

అజయ్‌ (పాత చిత్రం)

మండవల్లి, సాలూరు గ్రామీణం, న్యూస్‌టుడే: పొట్టచేత పట్టుకుని జిల్లాలు దాటి వచ్చిన యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన ఏలూరు జిల్లా మండవల్లి మండలం దెయ్యంపాడులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సాలూరు మండలం కోట్లుపరుగు గ్రామానికి చెందిన చింతాడ అజయ్‌(29) చేపల చెరువుపై కూలీ పనుల నిమిత్తం కొంతకాలం క్రితం ఏలూరు జిల్లా ఏలూరు రూరల్‌ మండలం యాగనమిల్లు వచ్చారు. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం కైకలూరులో కూరగాయలు కొనుగోలు చేసి ద్విచక్ర వాహనంపై యాగనమిల్లు వెళ్తున్నారు. ఈ క్రమంలో మండవల్లి మండలం దెయ్యంపాడు వద్దకు వచ్చేసరికి ఏలూరు వైపు నుంచి అతివేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి ఇంకా పెళ్లి కాలేదు. మృతుడి తండ్రి ప్రకాశ్‌ ఇచ్చిన ఫిర్యాదుపై ఎస్సై రామచంద్రరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


పట్టపగలే బంగారు గొలుసు చోరీ

వంగర, న్యూస్‌టుడే: వంగర మండలం మగ్గూరు, మడ్డువలస గ్రామాల మధ్య సోమవారం మధ్యాహ్నం 4 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు బంగారు గొలుసు చోరీకి పాల్పడ్డారు. మగ్గూరు గ్రామానికి చెందిన చింత అమ్మడమ్మ పశువులను మేపుతుండగా రహదారిపై గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి ఆమె మెడలో ఉన్న రెండు తులాల బంగారు పుస్తెల తాడును లాక్కొని పరారయ్యారు. ఈ విషయంపై వంగర పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వై.వి.జనార్దన్‌ తెలిపారు.


చెక్‌పోస్టు వద్ద నగదు స్వాధీనం

వంగర, న్యూస్‌టుడే: మండలంలోని బంగారువలస వద్ద ఏర్పాటు చేసిన అంతర జిల్లాల చెక్‌పోస్టు వద్ద ఎస్‌.ఎస్‌.టి. బృందం చేపట్టిన తనిఖీల్లో సోమవారం రూ.2,59,300 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై వై.వి.జనార్దన్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని