logo

కేకులు.. కేకలు.. జనాలకు చుక్కలు..: పుట్టిన రోజంటూ వైకాపా సర్పంచి హడావుడి

ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు చిన్నపాటి నిరసన ప్రదర్శన చేపట్టేందుకు కూడా అనుమతులు లేవంటూ పోలీసులు అడ్డుకుంటుంటారు. అటువంటిది అధికార పార్టీ సర్పంచి నిర్వాకానికి జనం మండుటెండలో తీవ్ర ఇబ్బందులు పడినప్పటికీ మిన్నకుండిపోయారు.

Updated : 02 Jul 2023 10:18 IST

నిలిచిన వాహనాలు.. చేష్టలుడిగిన పోలీసులు

రహదారి మధ్య బాణసంచా కాల్పులు..రంగులు చల్లుకుంటున్న అనుచరులు

ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు చిన్నపాటి నిరసన ప్రదర్శన చేపట్టేందుకు కూడా అనుమతులు లేవంటూ పోలీసులు అడ్డుకుంటుంటారు. అటువంటిది అధికార పార్టీ సర్పంచి నిర్వాకానికి జనం మండుటెండలో తీవ్ర ఇబ్బందులు పడినప్పటికీ మిన్నకుండిపోయారు. ఈ ఉదంతం ప్రకాశం జిల్లా దర్శిలో శనివారం చోటుచేసుకుంది. పుట్టిన రోజు వేడుకల పేరుతో జముకులదిన్నె వైకాపా సర్పంచి మర్రి సత్యనారాయణ పట్టణంలో హడావుడి చేశారు. అనుచరులంటూ ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన వారితో వాహనాల్లో ప్రదర్శన నిర్వహించారు. గడియారస్తంభం కూడలిలో కేకు కోసి, బాణసంచా కాల్చారు. దీంతో మధ్యాహ్న సమయంలో దాదాపు గంట పాటు ట్రాఫిక్‌ నిలిచిపోయి వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. పట్టణ నడిబొడ్డున అనుమతులు లేకుండా ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర వహించడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. వేడుకలైతే జముకులదిన్నెలో నిర్వహించుకుంటే సరిపోయేదని.. పది కిలోమీటర్ల దూరంలోని దర్శి పట్టణానికి వచ్చి ఇబ్బందులకు గురిచేయడం ఏంటని ఈ సందర్భంగా పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌, ఆయన సోదరుడు శ్రీధర్‌, వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం గమనార్హం.

న్యూస్‌టుడే, దర్శి

గడియార స్తంభం కూడలిలో పెద్ద సంఖ్యలో నిలిచిన వాహనాలు 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని