logo

క్వార్టర్‌ మద్యం కోసం మట్టుబెట్టాడు

క్వార్టర్‌ మద్యం కోసం ఒక వ్యక్తిని దారుణంగా హత్య చేసిన సంఘటన యర్రగొండపాలెంలో శుక్రవారం చోటు చేసుకుంది. 24 గంటల్లో పోలీసులు ఈ కేసులు ఛేదించారు.

Published : 28 Apr 2024 04:39 IST

యర్రగొండపాలెం పట్టణం, న్యూస్‌టుడే : క్వార్టర్‌ మద్యం కోసం ఒక వ్యక్తిని దారుణంగా హత్య చేసిన సంఘటన యర్రగొండపాలెంలో శుక్రవారం చోటు చేసుకుంది. 24 గంటల్లో పోలీసులు ఈ కేసులు ఛేదించారు. శనివారం రాత్రి విలేకరుల సమావేశంలో సీఐ రాములు నాయక్‌ హత్య వివరాలను వెల్లడించారు. యర్రగొండపాలెం పట్టణానికి చెందిన యలగాల శ్రీనివాసులు (37) అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో దర్యాప్తు చేపట్టి హత్య జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరాల ఆధారంగా ముద్దాయిని అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితుడు పట్టణంలోని చెంచుపాముల కాలనీకి చెందిన ఓరుగంటి రాజేష్‌ కొలిమి పనిచేస్తుంటాడని,  వ్యసనాలకు లోనై నిత్యం మద్యం తాగుతుంటాడని పేర్కొన్నారు. ఇటీవల మద్యం తాగే సమయంలో శ్రీనివాసులతో పరిచయమై ఇద్దరూ స్నేహితులుగా మారారు. గురువారం సాయంత్రం వినుకొండ రోడ్డులోని ప్రభుత్వ మద్యం దుకాణంలో వీరిద్దరూ చెరో మూడు మద్యం బాటిళ్ల కొనుగోలు చేశారు. రాజేష్‌ కొనుగోలు చేసిన మూడు మద్యం బాటిళ్లలో రెండు అమ్మేశాడు. ఒకటి తాగేశాడు. శ్రీనివాసులు తాను కొనుగోలు చేసిన మూడు మద్యం బాటిళ్లలో ఒక బాటిళ్లను తాగేసి రెండు తన ప్యాంటు జేబులో ఉంచుకున్నాడు. ఇది గమనించిన రాజేష్‌ శ్రీనివాసులను నీ దగ్గర ఉన్న రెండు బాటిళ్లలో ఒకటి తనకు ఇవ్వమని అడిగాడు. అందుకు అతను ఒప్పుకోలేదు. దీంతో ఇద్దరి మధ్య గొడవ చోటుచేసుకుంది. అనంతరం శ్రీనివాసులు స్థానిక ఒక ప్రైవేటు వైద్యశాల వెనకాల కొత్తగా నిర్మించే భవనంలోకి వెళ్లి పడుకున్నాడు. తనకు మద్యం బాటిల్‌ ఇవ్వలేదని అక్కసుతో శ్రీనివాసులపై పగ పట్టిన రాజేష్‌  ఇంటికి వెళ్లి ఒక ఇనుప రాడ్డును తీసుకొచ్చి పడుకుని ఉన్న శ్రీనివాసుల ముఖం మీద కసితీరా కొట్టాడు. అతను కొన ఊపిరితో దాహం అని అరిచినా పట్టించుకోకుండా చంపి అక్కడ నుంచి పారిపోయాడు. శ్రీనివాసుల సోదరుడు వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు హత్య జరిగిన ప్రదేశంలో వైద్యశాలకు చెందిన  సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడు రాజేష్‌ను శనివారం అరెస్టు చేసినట్లు సీఐ రాములునాయక్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని