logo

పేదల ప్రాణం.. గాల్లో దీపం..

వైద్యరంగానికి పెద్దపీట వేశానని ముఖ్యమంత్రి ఆర్భాటంగా చెబుతుంటారు. అయితే ఇటు పీహెచ్‌సీలు, అటు ప్రధాన ఆసుపత్రుల్లో పరిస్థితి చూస్తే దుర్భరంగా ఉంది. కానరాని వైద్య నిపుణులు..నామమాత్రంగా మందులు..మెరుగుపడని వసతులతో రోగులు నరకయాతన అనుభవిస్తున్నారు.

Updated : 28 Apr 2024 05:34 IST

మందుల్లో భారీ కోత.. పీహెచ్‌సీలతో జగనన్న ఆటలు
సురక్ష.. అడుగడుగునా అభాసుపాలు
రిమ్స్‌లో 50 శాతం కూడా లేని నిపుణులు

వైద్యరంగానికి పెద్దపీట వేశానని ముఖ్యమంత్రి ఆర్భాటంగా చెబుతుంటారు. అయితే ఇటు పీహెచ్‌సీలు, అటు ప్రధాన ఆసుపత్రుల్లో పరిస్థితి చూస్తే దుర్భరంగా ఉంది. కానరాని వైద్య నిపుణులు..నామమాత్రంగా మందులు..మెరుగుపడని వసతులతో రోగులు నరకయాతన అనుభవిస్తున్నారు. అయిదేళ్లలో ప్రభుత్వం వైద్య రంగాన్ని పూర్తిగా విస్మరించడంతో పేదల ప్రాణం గాల్లో దీపమన్న చందంగా ఉంది.

న్యూస్‌టుడే, ఒంగోలు నగరం

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైద్య రంగం పూర్తిగా నీరుగారిపోయింది. బడ్జెట్‌ కేటాయింపులు లేకపోవడంతో పీహెచ్‌సీలు కుదేలయ్యాయి. అయితే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి జగన్‌ ఆర్భాటం చేయడం మొదలుపెట్టారు. హడావుడిగా ఆరోగ్య సురక్ష పథకాన్ని ప్రారంభించారు. వైద్య పరీక్షల నిర్వహణ, మందుల పంపిణీ సరిగ్గా చేపట్టకపోవడంతో రోగులు ముఖం చాటేయడంతో ఇది కాస్తా అభాసుపాలైంది. ప్రతి శిబిరానికి స్పెషలిస్టు వైద్యులు వచ్చి పరీక్షలు చేస్తారని ప్రకటించారు. వాస్తవానికి మొదటి దఫా నిర్వహించిన శిబిరంలో అడపా దడపా వారు కనిపించినా, ఆ తర్వాత జాడే లేదు. ప్రతి ఆరు నెలలకు ఓసారి ప్రతి గ్రామంలో శిబిరాలు నిర్వహించాలనేది లక్ష్యం. ప్రతి ఒక్కరికీ ఆరోగ్య పరీక్షలు చేసి సమస్యాత్మక వ్యాధులుంటే జిల్లా ఆసుపత్రికి రిఫర్‌ చేయాలి. ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమంలో రిఫరల్‌ కేసులను వేళ్ల మీద లెక్కించవచ్చు. మొదట జరిగిన శిబిరాలకు ప్రజా ప్రతినిధులు హాజరై హడావిడి చేసి ప్రచారం కల్పించారు. తరువాత పట్టించుకున్న నాథుడే లేడు.

అద్దె భవనాల్లోనే వెల్‌నెస్‌ సెంటర్లు:  జిల్లాలోని అన్ని గ్రామాల్లో హెల్త్‌ వెల్‌నెస్‌ సెంటర్లు ప్రారంభించారు. రెండేళ్లలో అన్నింటికీ సొంత భవనాలు నిర్మిస్తామని ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటించారు. ఇప్పటివరకు 30 శాతం భవనాలు మాత్రమే పూర్తయ్యాయి. మిగిలినచోట్ల అద్దె ఇళ్లలో నిర్వహిస్తున్నారు. అద్దె డబ్బులు కూడా సక్రమంగా రాకపోవడంతో కమ్యూనిటి హెల్త్‌ ఆఫీసర్లే సొంత డబ్బులు చెల్లిస్తున్న పరిస్థితి నెలకొంది.

వైద్యకేంద్రాల  నిధుల్లో కోత ?

జిల్లాలో 66 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 18 సామాజిక ఆసుపత్రులున్నాయి. వాటి ద్వారానే గ్రామాల్లో శిబిరాలు, ఫ్యామిలీ డాక్టర్‌ విధానం అమలు జరుగుతోంది. నూతన ఆర్థిక సంవత్సరంలో మందుల బడ్జెట్‌లో కోత పెట్టడంతో రోగులకు అందని పరిస్థితి నెలకొంది. క్వార్టర్లీ విధానంలో  ఏడాదిలో నాలుగుసార్లు పీహెచ్‌సీ, సీహెచ్‌సీలకు ఈ బడ్జెట్‌ కేటాయిస్తారు. ఆసుపత్రికి వచ్చే ఓపీలను బట్టి ఒక్కో క్వార్టర్‌కు రూ.40 వేల నుంచి రూ.80 వేలు వరకు విలువైన ఔషధాలు  అందజేస్తారు. కాగా మొదటి క్వార్టర్‌లో రావాల్సిన మందుల్లో సగం కోతపెట్టారు. దీనివల్ల మూడునెలలపాటు రావాల్సినవి మందులు ఒక నెలలోనే అయిపోయాయని చెబుతున్నారు.

మధుమేహం, రక్తపోటు మాత్రల ఊసేలేదు

పీహెచ్‌సీ ప్రతి కేంద్రంలో మధుమేహం, రక్తపోటు, కొలెస్ట్రాల్‌, జ్వరానికి సంబంధించిన వాటితో పాటు ఐరన్‌ మాత్రలు ఎక్కువగా అవసరమవుతాయి. ప్రస్తుతం అవి పూర్తిస్థాయిలో అందుబాటులోలేవు. దీంతో రోగులకు 15 రోజులకు బదులు 5 రోజులకు సరిపోయే మాత్రలిచ్చి సరిపెడుతున్నారు.

‘ఈనాడు’ కథనంతో కుక్కకాటు వ్యాక్సిన్‌

కుక్కకాటుకు వినియోగించే రాబిస్‌ వ్యాక్సిన్‌కు కొరత ఏర్పడింది. ఒక్కో పీహెచ్‌సీకి క్వార్టర్‌కు 200 డోసులు అవసరమవుతాయి. మొదటి క్వార్టర్‌లో సగం మాత్రమే ఇచ్చారని వైద్యులు చెబుతున్నారు. ఇటీవల ‘ఈనాడు’లో కథనం వచ్చాక పెంటావాలంట్‌, డీపీటీ వ్యాక్సిన్లు రెండు వారాలకు సరిపోయేవి అందజేశారు. వచ్చేవారం మళ్లీ వ్యాక్సిన్‌ కోసం ఎదురుచూడక తప్పదంటున్నారు.

బీ కాంప్లెక్స్‌  మాత్రలతో సరి..

మార్కాపురం : పశ్చిమ ప్రకాశంలోని నిర్వహించిన ఆరోగ్య సురక్ష మొక్కుబడిగా సాగింది. ఇటీవల రెండో దఫాలో 250 క్యాంపులు నిర్వహించామని లెక్కలు చూపారు. ఆపసోపాలు పడి అక్కడికి వెళితే బీపీ, మధుమేహం, రక్త పరీక్ష గ్రూప్‌ పరీక్షలు వంటివి చేస్తే ప్రయోజనం ఏమిటని వారంటున్నారు. రూ.50 చెల్లిస్తే ఏ ఆసుపత్రులో అయినా చేస్తారని, ఛార్జీలు పెట్టుకుని సురక్ష శిబిరం వరకూ వెళ్లడం ఎందుకని పలువురు ప్రశ్నిస్తున్నారు. రోగులకు బీ కాంప్లెక్స్‌, నొప్పుల మాత్రలిచ్చేసి పంపుతున్నారు. ప్రతి క్యాంపులో తప్పనిసరిగా ఓపీ 400 ఉండాలని నిబంధన పెట్టడంతో వైద్య సిబ్బందే ఆన్‌లైన్‌లో కాకిలెక్కలు నమోదు చేస్తున్నారన్న విమర్శలున్నాయి.

స్పెషలిస్టులు, డాక్టర్లు లేక..

ఎంతో కీలకమైన ఒంగోలు రిమ్స్‌లోనూ నిపుణుల కొరత వేధిస్తోంది. ఇక్కడ అన్ని విభాగాలకు సంబంధించి 80మంది స్పెషలిస్టులు అవసరం కాగా, కేవలం సగంమంది మాత్రమే ఉన్నారు. మిగిలిన వైద్యుల కొరత కూడా ఉంది. దీంతో వివిధ రుగ్మతలతో ఆసుపత్రులకు వచ్చే వారికి వైద్యసేవలందక వారు నిరాశగా వెనుదిరుగుతున్నారు.

పశ్చిమంలో సూదీ లేదు.. మందూ లేదు

మార్కాపురం : జిల్లా పశ్చిమ ప్రాంతంలో ప్రభుత్వ వైద్యం అందని దాక్షగానే మిగిలింది. పేరుకు గ్రామీణ వైద్యశాలలున్నా అక్కడ సూదికి..మందుకీ దిక్కు లేదు. చిన్నపాటి దగ్గు, జలుబు ఉన్నా ప్రైవేటు వైద్యశాలలకు పరిగెత్తాల్సిందే. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ప్రతి బుధ, శనివారాల్లో చిన్న పిల్లలకు టీకాలు వేయడానికి మాత్రమే పని చేస్తున్నాయి. జ్వరం, డయేరియా బారినపడితే మార్కాపురం ప్రభుత్వ జిల్లా వైద్యశాల, ప్రైవేటు వైద్యశాలలను ఆశ్రయిస్తున్నారు. మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, దర్శి నియోజకవర్గాలకు చెందిన వారు కూడా కాన్పుల కోసం మార్కాపురంలోని జిల్లా వైద్యశాలకు వస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని పీహెచ్‌సీలు నిర్వీర్యం కావడంతో ఈ దుస్థితి నెలకొంది. పశ్చిమ ప్రాంతంలోని 13 మండలాల్లో 27 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. మార్కాపురం పట్టణంలో మూడు అర్బన్‌ హెల్త్‌ కేంద్రాలు, గిద్దలూరు పట్టణంలో రెండు అర్బన్‌ హెల్త్‌ కేంద్రాలున్నాయి. ఈ కేంద్రాల్లో రోజుకు ఓపీ 25 నుంచి 30 లోపే ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వైద్యశాలల పరిధిలో విష జ్వరం వచ్చినా, డయేరియా బారిన పడినా మందులు ఉండటం లేదు.

జిల్లా ఆసుపత్రిలో ఒకే ఒక్క నిపుణుడు

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అయిదేళ్లు పూర్తయినా మార్కాపురంలోని జిల్లా ఆసుపత్రి నిర్మాణం ఇప్పటికీ పూర్తి కాలేదు. నిపుణులు మొత్తం ఎనిమిది మంది ఉండాల్సి ఉండగా, కేవలం గైనకాలజిస్టు మాత్రమే ఉన్నారు. ఇంకా న్యూరో, కార్డియో, యురాలజీ, నెఫ్రాలజీ, పల్మనాలజిస్టు, డెర్మటాలజిస్టులను ప్రభుత్వం కేటాయించలేదు.  ఇక్కడ నిత్యం ఓపీ 450 నుంచి అయిదొందల వరకూ ఉంటుంది. ఇంత మంది రోగుల తాకిడి ఉన్నా నిపుణులు లేకపోవడం ప్రతికూలంగా మారింది. జిల్లావాసులే కాక కర్నూలు, నంద్యాల, ఆత్మకూరు ప్రాంతాల నుంచి కూడా పెద్దఎత్తున వస్తున్న రోగులకు నిపుణుల సేవలు అందడం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని