logo

జిల్లాలో సైకిల్‌ జోరు

ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెదేపాలో చేరికలు జోరందుకున్నాయి. వైకాపాకు చెందిన పలువురు నేతలు, అభిమానులు సైకిలెక్కుతున్నారు.

Published : 29 Apr 2024 02:51 IST

తెదేపాలోకి వైకాపా నేతలు

తాళ్లూరు: పార్టీలో చేరిన వారితో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, తనయుడు రాఘవ్‌రెడ్డి

ఒంగోలు గ్రామీణం, తాళ్లూరు, న్యూస్‌టుడే : ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెదేపాలో చేరికలు జోరందుకున్నాయి. వైకాపాకు చెందిన పలువురు నేతలు, అభిమానులు సైకిలెక్కుతున్నారు. తాళ్లూరు మండలం బెల్లంకొండవారిపాలెంలో ఆ పార్టీకి చెందిన సర్పంచి పోశం సుమలత భర్త పోశం శ్రీకాంత్‌రెడ్డి, స్వతంత్ర  ఎంపీటీసీ సభ్యురాలు గూడా సరస్వతి భర్త, వైకాపా నాయకుడు గూడా ప్రభాకరరెడ్డితోపాటు పది కుటుంబాలు  తెదేపాలో చేరాయి. ఒంగోలులోని మాగుంట కార్యాలయంలో ఆదివారం మధ్యాహ్నం వారికి ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన తనయుడు మాగుంట రాఘవ్‌రెడ్డి కలసి తెదేపా కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. బీకేపాలెంతోపాటు దోసకాయలపాడుకు చెందిన పోశం గంగిరెడ్డి, గూడా జయరాంరెడ్డి, డి.ప్రభాకరరెడ్డి, ఎల్‌.సుబ్బారెడ్డి, జి.సాంబిరెడ్డి, తదితరులు చేరారు. ఈ కార్యక్రమంలో ఎంపీˆపీˆ టి.శ్రీనివాసరావు, తెదేపా ప్రధాన నాయకులు కొండలు, రమేష్‌, బడే, సమర, వేణు, చందన, ఇతర నాయకులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే స్వామి సమక్షంలో..

సింగరాయకొండ గ్రామీణం: గ్రామీణ ప్రాంతాల్లో వైకాపా ఖాళీ అవుతోందని, జగన్‌ మోసపూరిత మేనిఫెస్టోతో ఆ పార్టీపై జనం నమ్మకం పూర్తిగా సన్నగిల్లిందని తెదేపా అభ్యర్థి, ఎమ్మెల్యే స్వామి అన్నారు. పాకలలో వైకాపాకు చెందిన 15 కుటుంబాలు, పాతసింగరాయకొండ బాలిరెడ్డినగర్‌కు చెందిన మరో 5 కుటుంబాలు ఆదివారం తూర్పు నాయుడుపాలెంలోని ఎమ్మెల్యే స్వామి నివాసంలో తెదేపాలో చేరాయి. వారిని ఆయన పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ గత మూడు వారాల్లో ఒక్క పాకల గ్రామం నుంచే 500 మంది వైకాపాను వీడారని, ఆ పార్టీలో నైరాశ్యం చోటు చేసుకుందన్నారు. అయిదేళ్ల వైకాపా పాలనలో నకిలీ మద్యం, గంజాయితో లక్షలాది కుటుంబాలు వీధిన పడ్డాయని ఆరోపించారు. కార్యక్రమంలో మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

టంగుటూరులో...

టంగుటూరు, న్యూస్‌టుడే: టంగుటూరు మండలకేంద్రం అరుంధతీనగర్‌కు చెందిన వైకాపా ప్రధాన నాయకురాలు కురుగుంట్ల స్నేహలతతోపాటు 200 కుటుంబాలు వైకాపాను వీడి తెదేపాలో చేరారు. స్నేహలత గత పంచాయతీ ఎన్నికల్లో వైకాపా తరుపున సర్పంచిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇప్పటి వరకు మంత్రి సురేష్‌కు వెన్నంటే నిలిచిన సొంత మాదిగ వర్గం ఇప్పుడు తెదేపాలో చేరడంతో ఆయనకు ఈ విషయం మింగుడుపడేలా లేదు. టంగుటూరు మండల కేంద్రంలో మాదిగ సామాజిక వర్గం ఓట్లు మంత్రి సురేష్‌కు కీలకం. ప్రస్తుతం వారందరు తెదేపాలో చేరడంతో మాదిగ సామాజిక వర్గం దాదాపు తెదేపాకి అనుకూలంగా పని చేయనుంది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఎమ్మెల్యే స్వామి, తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్యనారాయణ, మాగుంట రాఘవ్‌రెడ్డిలు కండువాలు కప్పి వారిని పార్టీలో ఆహ్వానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని