logo

మీరేం అభివృద్ధి చేశారు..?

సంతబొమ్మాళి మండలం కూర్మనాథపురంలో గ్రామాభివృద్ధిపై ప్రశ్నించిన యువకులపై వైకాపా కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. వైకాపా టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ శనివారం సాయంత్రం కూర్మనాథపురంలో ఎన్నికల ప్రచారానికి వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.

Updated : 28 Apr 2024 04:54 IST

ప్రశ్నించిన యువకులపై వైకాపా శ్రేణుల దాడి

నౌపడ ఎస్సై కిశోర్‌వర్మతో మాట్లాడుతున్న టెక్కలి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌

సంతబొమ్మాళి, న్యూస్‌టుడే: సంతబొమ్మాళి మండలం కూర్మనాథపురంలో గ్రామాభివృద్ధిపై ప్రశ్నించిన యువకులపై వైకాపా కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. వైకాపా టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ శనివారం సాయంత్రం కూర్మనాథపురంలో ఎన్నికల ప్రచారానికి వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన తెదేపా సానుభూతి పరులైన కె.సింహాచలం, కె.సాయికుమార్‌ను ప్రచారానికి రావాలని వైకాపా కార్యకర్తలు నరసింహులు, ధర్మారావు కోరారు. గతంలో మా గ్రామానికి అచ్చెన్నాయుడు రోడ్డు వేశారని, ఇప్పుడు మీరేం అభివృద్ధి చేశారని, ఎందుకు ప్రచారానికి వస్తున్నారని ప్రశ్నించారు. దీంతో ఆగ్రహించిన వైకాపా కార్యకర్తలు ఆ యువకులపై దాడికి దిగారు. అనంతరం ఇరువర్గాల మధ్య పరస్పరం ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో వైకాపా కార్యకర్త నరసింగరావు ముఖంపై గాయమైంది.

విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌, అనుచరులు ఘటనా స్థలానికి చేరుకుని దాడికి పాల్పడిన యువకులపై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. నౌపడ ఎస్సై కిశోర్‌వర్మ, ఏఎస్సై నరసింగరావు సిబ్బందితో గ్రామానికి వచ్చి.. తెదేపా సానుభూతి పరులైన యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయమై ఎస్సై కిశోర్‌వర్మ మాట్లాడుతూ సింహాచలం, సాయికుమార్‌లపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ద్విచక్ర వాహనంపై ఉన్న వైకాపా జెండాను వారిద్దరూ తీసేయడంతో గొడవ మొదలైందని చెప్పారు. వైకాపా శ్రేణులు దాడికి పాల్పడి తిరిగి తమపైనే కేసు నమోదు చేయడం అన్యాయమని కె.సింహాచలం, కె.సాయికుమార్‌ వాపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని