logo

రామేశ్వరం.. రాముడు నడయాడిన నేల

రామాయణంతో సంబంధం ఉన్న ప్రాంతం పుణ్యభూమి రామేశ్వరం. రాముడు తన పాప పరిహారం చేసుకున్న పవిత్ర ప్రదేశం.

Published : 20 Jan 2024 01:33 IST

రామాయణంలో కీలక ఘట్టాలకు నెలవు
శివలింగం ప్రతిష్ఠించిన శ్రీరాముడు 
విభీషణుడి పట్టాభిషేకమూ ఇక్కడే

  న్యూస్‌టుడే, ప్యారిస్‌ : రామాయణంతో సంబంధం ఉన్న ప్రాంతం పుణ్యభూమి రామేశ్వరం. రాముడు తన పాప పరిహారం చేసుకున్న పవిత్ర ప్రదేశం. శివుడికి ఆలయం నిర్మించిన గొప్ప నేల. అంతేకాకుండా రావణుడి తమ్ముడు విభీషణుడికి పట్టాభిషేకం జరిగిన ప్రాంతంగా ప్రసిద్ధి. అయోధ్యలో రామమందిర కుంభాభిషేకం జరుగుతున్న సమయంలో ప్రధాని నరేంద్రమోదీ రామాయణంతో సంబంధం ఉన్న రామేశ్వరంలోని రామనాథస్వామి ఆలయం, అక్కడి నుంచి ధనుష్కోటికి వెళ్లే మార్గంలో ఉన్న విభీషణుడి ఆలయాలను దర్శించుకోనున్నారు. అంతేకాకుండా రామనాథస్వామి ఆలయంలోని  అగ్నితీర్థంతో సహా 22 తీర్థ బావుల్లోని పుణ్య జలాలను ఆయోద్యకు తీసుకెళ్తున్నారు.

దక్షిణ కాశీగా పేరు

రావణాసురుడిని వధించిన తరువాత రాముడు పాపాన్ని పోగొట్టుకునేందుకు రామనాథపురంలోని సముద్ర తీరంలో మట్టితో శివలింగాన్ని తయారు చేసి పూజించాడు. ఆ ప్రాంతమే నేడు రామేశ్వరంగా బాసిల్లుతోంది. 15వ శతాబ్దం మొదట్లో పాండ్యులు ఏలిన ఈ ప్రాంతం తర్వాత సేతుపతిరాజుల పాలనలోకి వచ్చింది. ఆ తర్వాత భారతదేశానికి వచ్చిన ఆంగ్లేయులు దీనిని రామనాడు అని పిలవడం ప్రారంభించారు. ఈ ప్రాంతానికి రామనాథపురం జిల్లాగా మార్చారు. రామనాథపురం అంటే అందరికీ గుర్తొచ్చే ఆధ్యాత్మిక ప్రాంతం రామేశ్వరం రామనాథస్వామి ఆలయం. ఈ ఆలయానికి ఏడాది పొడవునా లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. 690 అడుగుల పొడవు, 435 అడుగుల వెడల్పు, 1212 స్తంభాలతో కూడిన ప్రకారంతో ఈ ఆలయం ప్రసిద్ధి. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఈ ఆలయంలోని శివలింగం ఒకటి. ఉత్తర భారతదేశంలో ఉన్న కాశీలోని గంగానదిలో పుణ్యస్నానం ఆచరించి విశ్వనాథుడిని ప్రార్థిస్తే ముక్తి లభిస్తుందని అంటారు. ఆ విధంగానే దక్షిణ భారతదేశంలో ఉన్న రామేశ్వరంలోని అగ్ని తీర్థం, ఆలయంలో ఉన్న 22 తీర్థాల్లో స్నానం  ఆచరించి రామనాథస్వామిని ఆరాధిస్తే మోక్షం దక్కుతుందని ప్రతీతి.

పాపాలు హరించే అగ్ని తీర్థం

రావణుడు చెర నుంచి విడిపించి తీసుకొచ్చిన సీతాదేవి తన పాతివ్రత్యం నిరూపించుకునేందుకు రాముడు ఇక్కడ అగ్నిప్రవేశం చేయించాడు. అప్పుడు సీతాదేవి పాతివ్రత్యం తట్టుకోలేని అగ్నిదేవుడు సముద్రంలో మునిగి ఉపశమనం పొందాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే దీనిని అగ్నితీర్థంగా పిలుస్తారు.

కోదండరామాలయం

కడలి మధ్యలో కోదండరామాలయం

రామేశ్వరంలో ఉన్న కోదండరామస్వామి ఆలయం ముఖ్యమైన పుణ్యస్థలం. రామేశ్వరం నుంచి ధనుష్కోటికి వెళ్లే మార్గంలో ఉన్న చిన్న దీవిలో ఈ ఆలయం ఉంది. 1964లో ధనుష్కోటిలో ఏర్పడిన ప్రళయం నుంచి బయటపడిన ఒకేఒక చారిత్రక నిర్మాణం ఇదే. ఈ ఆలయంలో రాముడు, లక్ష్మణుడు, సీత, హనుమాన్‌, విభీషణుడు కొలువుదీరి ఉన్నారు. రాముడు విల్లుతో ఉండటంతో కోదండరాముడిగా పేరు. విభీషణుడు రాముడు, ఆయన వానర సైన్యాన్ని ఆశ్రయించిన ప్రాంతంగా దీనిని భావిస్తారు. రావణాసురుడు సీతను అపహరించిన తరువాత విభీషణుడు ఆమెను తిరిగి పంపాలని రావణుడికి చెప్పినప్పటికీ రావణుడు వినకపోవడంతో విభీషణుడు లంకను వదిలి వచ్చి రాముడు రామేశ్వరంలో ఉన్నట్లు తెలుసుకుని ఇక్కడకు చేరుకున్నాడు. రావణ వధ తరువాత రాముడు ఈ ప్రాంతంలోనే విభూషణుడికి లంకాధిపతిగా పట్టాభిషేకం నిర్వహించినట్లు స్థల పురాణం చెబుతోంది. ఏటా రామనాథస్వామి ఆలయంలో రామలింగ ప్రతిష్ఠ తిరునాల సమయంలో విభీషణుడి పట్టాభిషేకం నిర్వహిస్తారు.

రామనాథస్వామి ఆలయం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని