logo

పనిలేక పస్తులు

జాలర్లు సంద్రంలోకి వెళ్లి చేపలు పట్టడంపై ప్రస్తుతం ప్రభుత్వం నిషేధం విధించింది.

Published : 29 Apr 2024 00:14 IST

రాష్ట్రంలో చేపల వేటపై నిషేధం
ఉపాధి లేక అవస్థలు పడుతున్న జాలర్లు
న్యూస్‌టుడే, వడపళని

కాశిమేడు తీరంలో నిలిపిన పడవలు

జాలర్లు సంద్రంలోకి వెళ్లి చేపలు పట్టడంపై ప్రస్తుతం ప్రభుత్వం నిషేధం విధించింది. ఏటా ఏప్రిల్‌ 13 నుంచి జూన్‌ 14వ తేదీ వరకు అర్ధరాత్రి చేపల సంతానోత్పత్తి జరుగుతుంది. కావున కేంద్రం తిరువళ్లూరు జిల్లాలోని ఆరంబాక్కం నుంచి కన్యాకుమారి వరకు చేపల వేటను నిషేధించింది. 28 హెచ్‌పీ (హార్స్‌ పవర్‌)తో కూడిన మర పడవలతో సముద్రంలోకి వెళ్లి చేపలు పట్టకూడదని పేర్కొంది. ప్రస్తుతం నిషేధం ప్రారంభమైన తరుణంలో కాశిమేడు హార్బరులో 800కు పైగా మర పడవలు ఒడ్డుకు చేరాయి. ఫైబర్‌ పడవలు మాత్రమే ఈ సమయంలో వేటకు వినియోగిస్తున్నారు.

80 వేల మందికి ఉపాధి కరవు

జాలర్ల సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ.. చేపల వేట నిషేధిత కాలంలో రాష్ట్రంలో 80 వేల మందికి పైగా మత్స్యకారులు జీవనోపాధి కోల్పోతారని అంటున్నారు. నిషేధ సమయంలో ప్రభుత్వం రూ.5 వేల రుణ సాయాన్ని అందిస్తోందని, గత ఏడాది దీనిని రూ.8 వేలకు ముఖ్యమంత్రి పెంచినట్లు తెలిపారు. చేపల వేట నిషేధాన్ని అక్టోబరు, నవంబరు, డిసెంబరు నెలల్లో పశ్చిమ తీరం, కర్ణాటక, మహారాష్ట్ర, గోవాల్లో కూడా విధిస్తున్నారు. రాష్ట్రంలో 16 జిల్లాలు, చెన్నై సహా తిరువళ్లూరు, కాంచీపురం, కడలూరు, పుదుచ్చేరి, కారైక్కాల్‌లో వేసవి నెలలైన ఏప్రిల్‌, మే, జూన్‌లో నిషేధం అమల్లో ఉంటోంది. ఈ సమయంలో చేపల సంతానోత్పత్తికి ఆస్కారం లేదని, కనుక ప్రభుత్వం అధ్యయనం చేసి నిషేధ కాలాన్ని మార్చాల్సిందిగా జాలర్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం వేసవి కావడంతో ఫైబర్‌ పడవలు అగ్ని ప్రమాదాలకు గురయ్యే అవకాశాలున్నాయని, కావున రేవుల వద్ద అగ్నిమాపక వాహనాలను సిద్ధంగా ఉంచాల్సిందిగా ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు.

ధరలు రెండింతలు

వారాంతపు రోజుల్లో కాశిమేడు చేపల మార్కెట్టు కొనుగోలుదారులతో రద్దీగా ఉంటుంది. ప్రస్తుతం వేటపై నిషేధం అమల్లో ఉండటంతో మార్కెట్‌కు వచ్చే చేపల సంఖ్య తగ్గిపోయింది. దీంతో చేపలు, పీతలు, రొయ్యల ధరలు రెండింతలయ్యాయి. మరో రెండు నెలల వరకు ధరలు ఇలాగే ఉంటాయని జాలర్లు చెబుతున్నారు. అదేసమయంలో పలువురు తమ పడవలకు మరమ్మతులు చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. మరికొందరు కొత్త పడవలు సిద్ధం చేసుకుంటున్నారు. చెంగల్పట్టు జిల్లాలో కానాత్తూరు రెడ్డికుప్పం నుంచి ఇడైక్కళినాడు ఆలంబరై కుప్పం వరకు 30 కుగ్రామాలున్నాయి. ఇందులో 7,500 మందికి పైగా జాలర్లు ఉంటున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని