logo

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నెట్ సౌకర్యం

విద్యాశాఖ ఆధ్వర్యంలోని సమగ్ర శిక్ష సమీకృత పథకం (ఇంటిగ్రేటడ్‌ స్కీం) కింద చెన్నై నగరంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నెట్ సౌకర్యం కల్పించనున్నారు

Updated : 30 Apr 2024 01:25 IST

చెన్నైలోని 200 బడుల్లో ఏర్పాటుకు సన్నాహాలు

న్యూస్‌టుడే, వడపళని: విద్యాశాఖ ఆధ్వర్యంలోని సమగ్ర శిక్ష సమీకృత పథకం (ఇంటిగ్రేటడ్‌ స్కీం) కింద చెన్నై నగరంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నెట్ సౌకర్యం కల్పించనున్నారు. నగర వ్యాప్తంగా ఉన్న 200 ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలల్లో నెలకు రూ.1,500 ఖర్చు చేసే విధంగా, 30 ఎంబీపీఎస్‌ కనీస స్పీడుతో బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్షన్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది.  

స్మార్ట్‌ తరగతి గదులు

రాష్ట్ర విద్యాశాఖ తరగతి గదులను డిజిటలైజ్‌ చేసి స్మార్ట్‌ గదులుగా తీర్చిదిద్దాలనే ఆలోచనలో ఉంది. మరి కొద్ది నెలల్లో 25 వేల ప్రాథమిక పాఠశాలలు, 7,904 మాధ్యమిక పాఠశాలల్లో హైటెక్‌ ల్యాబ్‌లను రూ.700 కోట్లతో ఏర్పాటు చేయనుంది. ఇంటర్నెట్ కనెక్షన్లు లేకుండా ఇవన్నీ ఉన్నా ఉపయోగం ఉండదని భావించి ముందుగా ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 8 వేల పాఠశాలల్లో ఇప్పటికే బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్షన్లు ఉన్నాయి. చెన్నై నగరంలో కొన్ని పాఠశాలల్లో ఇంకా పూర్తిగా అందుబాటులో లేవు. జూన్‌లో పాఠశాలలు తెరుస్తున్న నేపథ్యంలో మే నెలలోగా కనెక్షన్ల పనులు పూర్తి చేయనున్నారు.


పలు పనులకు ఉపయోగంగా కనెక్షను

2022లో సాంకేతికతతో కూడిన విద్యకు మంచి ప్రాముఖ్యత ఏర్పడటంతో ప్రభుత్వం కూడా తరగతి గదుల్లో డిజిటల్‌ సేవలు అందుబాటులోకి తేవాలని సంకల్పించింది. 2022లో ‘యూనిఫైడ్‌ డిస్ట్రిక్ట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌’ (యూడీఐఎస్‌ఈ+) సమర్పించిన నివేదికలో రాష్ట్రంలోని 18 శాతం పాఠశాలల్లో మాత్రమే బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్షన్లు ఉన్నట్టు పేర్కొంది. దీంతో అన్ని పాఠశాలల్లో విస్తరించాలని ప్రభుత్వం కృషి చేస్తోంది. కొన్ని పాఠశాలల్లో కంప్యూటర్లు ఏర్పాటు చేసినా ఇంటర్నెట్‌ కనెక్షను లేదు. బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్షను లేకపోవడంతో విద్యార్థుల అభివృద్ధి, పరిపాలనాపరమైన పనులకు ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎడ్యుకేషనల్‌ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ (ఈఎంఐఎస్‌)కు సంబంధించిన సమాచారం, విద్యార్థుల హాజరు, పరీక్షల రికార్డు, తాజా పాఠ్యాంశాల గురించి తెలుసుకోవడానికి ఇంటర్నెట్ కనెక్షను అవసరమని ఉపాధ్యాయులు తెలుపుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని