logo

ఉత్తర తమిళనాడులో 1న తీవ్రమైన వేడి గాలులు

ఉత్తర తమిళనాడులో బుధవారం అత్యంత తీవ్రమైన వేడి గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ పరిశోధన కేంద్రం హెచ్చరించింది.

Published : 30 Apr 2024 01:12 IST

 రాష్ట్రవ్యాప్తంగా పెరగనున్న ఉష్ణోగ్రతలు

ప్యారిస్‌, న్యూస్‌టుడే: ఉత్తర తమిళనాడులో బుధవారం అత్యంత తీవ్రమైన వేడి గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ పరిశోధన కేంద్రం హెచ్చరించింది. రాష్ట్రవ్యాప్తంగా నెల రోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉన్నాయి. అగ్నినక్షత్రం ప్రారంభం కాకముందే పగటిపూట ప్రజలు బయటకు వెళ్లలేకపోతున్నారు. కొద్ది రోజులుగా చెన్నైలో 35 నుంచి 38 డిగ్రీల సెల్సియస్‌ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సముద్రపు గాలి కారణంగా గాలిలో తేమ 70 శాతం వరకు ఉంది. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉందని వాతావరణ పరిశోధన కేంద్రం తెలిపింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు 27-28 డిగ్రీల సెల్సియస్‌ వరకు, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 36-37 డిగ్రీల సెల్సియస్‌ వరకు ఉంటాయని పేర్కొంది. సముద్రతీర జిల్లాల్లో గాలిలో తేమ 50-80 శాతం వరకు ఉంటుందని తెలిపింది. సోమవారం నుంచి మే 2వ తేదీ వరకు ఉత్తర తమిళనాడులో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 5 డిగ్రీల వరకు, మిగిలిన జిల్లాల్లో 3 డిగ్రీల వరకు పెరుగుతాయని హెచ్చరించింది. ఉత్తర తమిళనాడులోని లోతట్టు జిల్లాల్లో కొన్నిచోట్ల వేడి గాలులు వీస్తాయని పేర్కొంది. మంగళవారం నుంచి మూడు రోజుల పాటు ఉత్తర తమిళనాడులో తీవ్రమైన వడగాలులు వీస్తాయని హెచ్చరించింది. ముఖ్యంగా బుధవారం అత్యంత తీవ్రంగా ఉంటాయని పసుపు రంగు హెచ్చరిక జారీచేసింది. గల్ఫ్‌ ఆఫ్‌ మన్నార్‌, చుట్టుపక్కల ప్రాంతాల్లో అల్పపీడనం నెలకొంటుందని, ఆ కారణంగా కన్నియాకుమరి జిల్లాలో ఒకటి, రెండు చోట్ల తేలికపాటి వర్షం కురుస్తుందని తెలిపింది.

మే 1-4 వరకు...: రాష్ట్రంలో మే 1 నుంచి 4వ తేదీ వరకు వేడిగాలుల తీవ్రత మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందని తమిళనాడు వెదర్‌మెన్‌ ప్రదీప్‌జాన్‌ తెలిపారు. ఆయన తన ఎక్స్‌ పేజీలో.. మే 1 నుంచి 4వ తేదీ వరకు వేలూర్‌, రాణిపేట, తిరువళ్లూర్‌, కాంచీపురం, ఈరోడు, సేలం, నామక్కల్‌, తిరుచ్చి, కరూర్‌ తదితర జిల్లాల్లో వేడిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. లోతట్టు జిల్లాల్లో 5 తేదీ తర్వాత వర్షాలు కురుస్తాయన్నారు. ఎండ వేడి నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం తరఫున, రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థల తరఫున చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ అందుకు తగ్గట్టుగా ప్రజలకు అవగాహన కల్పించాలని పర్యావరణ నిపుణులు కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని