logo

పేటలో ఒకసారి ఓడిన వారికి చోటులేనట్లే!

పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలనేది పెద్దల మాట. ఎన్నికల్లో ఒకసారి ఓడితే రెండోసారి పోటీచేసి విజయం కోసం ప్రయత్నించడం సాధారణం.

Updated : 28 Apr 2024 08:44 IST

గంటెల సుమన, కాకర నూకరాజు, చెంగల వెంకటరావు

పాయకరావుపేట, నక్కపల్లి, న్యూస్‌టుడే: పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలనేది పెద్దల మాట. ఎన్నికల్లో ఒకసారి ఓడితే రెండోసారి పోటీచేసి విజయం కోసం ప్రయత్నించడం సాధారణం. పాయకరావుపేట నియోజకవర్గంలో పోటీచేసి ఒకసారి ఓడితే ఆ తర్వాత ఎన్ని ప్రయత్నాలు చేసినా విజయం అందని ద్రాక్షగా మారుతోంది. ఇక్కడ పలువురు అభ్యర్థుల విషయంలో వచ్చిన ఫలితాలే ఇందుకు నిదర్శనం. ‘పేట’లో ఓసారి ఓడిన వారికి ఇక్కడి ఓటర్లు మరో అవకాశాన్ని మాత్రం కల్పించడంలేదు. ఇది ఆశ్చర్యంగా అనిపిస్తున్నా, పోటీలో నిలిచే అభ్యర్థులకు చావోరేవో అన్నట్లుగా మారింది. తెదేపా ఆవిర్భావం నుంచి పరిశీలిస్తే ఇది ఇక్కడ సెంటిమెంట్‌గా మారింది.

తెదేపా ఆవిర్భావంతో ఎమ్మెల్యేగా గంటెల సుమన తిరుగులేని విజయం సాధించారు. ఏడాదిన్నర తర్వాత జరిగిన పరిణామాలతో నాదెండ్ల భాస్కరరావు వర్గంలోకి చేరారు. 1985లో జరిగిన ఎన్నికల్లో తెదేపా తరఫున నియోజకవర్గానికే చెందిన కాకర నూకరాజు సీటు దక్కించుకోగా, కాంగ్రెస్‌ పార్టీనుంచి జీవీ హర్షకుమార్‌ పోటీ చేశారు. గంటెల సుమన అనూహ్యంగా పోటీలోనే లేకుండాపోవడం విశేషం. ఈ ఎన్నికల్లో కాకర నూకరాజు ఘన విజయం పొందారు. 1989, 1994 ఎన్నికల్లోనూ తెదేపా తరఫున నూకరాజే గెలిచారు. ఈ రెండు ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ తరఫున గంటెల సుమన పరాజయాన్ని చవిచూశారు. 1999లో అసమ్మతి కారణంగా నూకరాజు తెదేపా టికెట్‌ను కోల్పోగా, సమరసింహారెడ్డి సినిమా నిర్మాత చెంగల వెంకటరావు రంగంలో దిగారు. కాంగ్రెస్‌ నుంచి సుమన వరుసగా మూడోసారి పోటీచేసినా తెదేపా ప్రభంజనంలో నిలువలేకపోయారు. 2004 ఎన్నికల్లో తెదేపా తరఫున చెంగల మరోమారు పోటీ చేయగా, కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ ఈ సారి అంబటి విజయారావుకు కేటాయించింది. రెబల్‌గా సుమన పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో చెంగల మరోసారి సుమనపై విజయం సాధించగా, కాంగ్రెస్‌ నుంచి బరిలో ఉన్న విజయారావు మూడోస్థానానికి పరిమితమయారు. 2009 ఎన్నికల్లో చెంగలకు పరాభవం తప్పలేదు. నియోజకవర్గ పునర్విభజన, ప్రజారాజ్యంతో త్రిముఖ పోటీ ఏర్పడగా, కాంగ్రెస్‌ అభ్యర్థి గొల్ల బాబూరావు చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. వైఎస్‌ మరణానంతరం జరిగిన రాజకీయ మార్పుల్లో గొల్ల బాబూరావు వైకాపాలోకి చేరడంతో 2012లో ఉప ఎన్నిక జరిగింది. ఆ ఎన్నికల్లో తెదేపా తరఫున చెంగల, కాంగ్రెస్‌ నుంచి సుమన బరిలో నిలిచారు. బాబూరావు విజయం సాధించారు. దీంతో చెంగల కొన్నాళ్లకే వైకాపాలోకి చేరిపోయారు.  2014 ఎన్నికల్లో తెదేపా అభ్యర్థిని వంగలపూడి అనిత చేతిలో చెంగలకు పరాభవం తప్పలేదు. ఇదే ఎన్నికల్లో అప్పటి తూ.గో.జిల్లా అమలాపురం నుంచి గొల్ల బాబూరావు పోటీలో నిలిచి ఓటమి పాలయ్యారు. తద్వారా సుమన, చెంగల పరాజయాల్లో హ్యాట్రిక్‌ మూటగట్టుకున్నారు. ఇక వర్గపోరుతో 2019లో అనిత కొవ్వూరు నుంచి పోటీ చేయాల్సి వచ్చింది. తిరిగి వైకాపా తరఫున గొల్ల బాబూరావు బరిలో దిగగా, తెదేపా నుంచి డాక్టర్‌ బంగారయ్య పోటీలో నిలిచి పరాజయం పొందారు. ప్రస్తుతం కూటమి అభ్యర్థిగా వంగలపూడి అనిత బరిలో నిలవగా, వైకాపా నుంచి ప్రస్తుత రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు తలపడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని