logo

‘కొర్రీల’మస్తు.. ‘ఆంక్షల’ తోఫా

పేదింటి ఆడపిల్లల వివాహం భారం కాకూడదన్న ఉద్దేశంతో గత తెదేపా ప్రభుత్వం తీసుకొచ్చిన పెళ్లి కానుక పథకాలనే వైకాపా ప్రభుత్వం వైఎస్సార్‌ కల్యాణమస్తు పేరుతో అమలు చేస్తోంది.

Published : 28 Apr 2024 04:03 IST

జగన్‌ తీరుతో ‘వైఎస్సార్‌  కల్యాణమస్తు’ పథకానికి లబ్ధిదారులు దూరం

పేదింటి ఆడపిల్లల వివాహం భారం కాకూడదన్న ఉద్దేశంతో గత తెదేపా ప్రభుత్వం తీసుకొచ్చిన పెళ్లి కానుక పథకాలనే వైకాపా ప్రభుత్వం వైఎస్సార్‌ కల్యాణమస్తు పేరుతో అమలు చేస్తోంది. అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో ఈ పథకాన్ని వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. అనంతరం అమలులోకి తీసుకొచ్చినా మంజూరు విషయంలో విధానాలను కఠినతరం చేయడంతో లబ్ధిదారులకు అవస్థలే మిగిలాయి. తెదేపా హయాంలో ఈ పథకాన్ని అమలు చేయడానికి ఒక ప్రత్యేకమైన వ్యవస్థను ఏర్పాటు చేసి రోజుల వ్యవధిలోనే కానుక అందేలా చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు వైకాపా ప్రభుత్వం వివాహ రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలన్న నిబంధన తీసుకురావడంతో చాలామంది ఈ పథకానికి అనర్హులుగా మారుతున్నారు.

పెందుర్తి, వేపగుంట, సబ్బవరం, పరవాడ, న్యూస్‌టుడే


ధ్రువీకరణ కోసం తిప్పలు

నా పెళ్లి ఆగస్టు 2020లో జరిగింది. వైఎస్సార్‌ కల్యాణ మస్తు కోసం దరఖాస్తు చేసుకున్నాం. సచివాలయంలో సంప్రదిస్తే పెళ్లి ధ్రువీకరణ పత్రం కావాలన్నారు. ఈ ధ్రువీకరణ కోసం పలు కార్యాలయాలకు తిరగాల్సి వచ్చింది. పెళ్లి కానుక అమలులో నిబంధనలను సరళతరం చేయాల్సిన అవసరం ఉంది. రిజిస్ట్రేషన్‌ ధ్రువీకరణ కావాలంటే అక్కడ కూడా అధికంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి.

ఎ.రఘు

ప్రయోజనం శూన్యం

తెదేపా హయాంలో కంటే కల్యాణమస్తు నిధులు పెంచామని వైకాపా నాయకులు చెప్పడం తప్ప దాన్ని సకాలంలో లబ్ధిదారులకు అందించిన దాఖలాలు లేవు. దీనివల్ల లబ్ధిదారులకు ఏమి ఉపయోగమో వైకాపా నాయకులే చెప్పాలి.

గుణ, మహిళ

కొందరికే ఇస్తున్నారు..

కల్యాణమస్తు పథకం అందరిదీ అని ప్రకటించినప్పటికీ కొందరు మాత్రమే ప్రయోజనం పొందారు. ఆశ్రిత పక్షపాతంతో నేతలు వ్యవహరించారు. అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి వైకాపా నాయకులకు అనుకూలమైన వారికి మాత్రమే వచ్చేలా చేశారు. మిగిలిన వారికి ఏవో కుంటి సాకులు చెప్పి ప్రయోజనం పొందకుండా చేశారు.

బి.అప్పల రామలింగేశ్వరరావు, గుల్లేపల్లి

నెలలు తరబడి ఎదురు చూడాల్సిందే..

కల్యాణమస్తు పథకానికి దరఖాస్తు చేస్తే నగదు కోసం నెలలు తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. ప్రతీ పథకాన్ని నిమిషాల్లో లబ్ధిదారులకు అందించడం కోసమే సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశామని చెప్పే వైకాపా ప్రభుత్వం కల్యాణమస్తును మాత్రం సక్రమంగా అందించడం లేదు.

గౌరీ, మహిళ

గతంలో వారం రోజుల్లో..

గతంలో పెళ్లయిన వారం రోజుల్లో ఖాతాలకు నిధులు జమయ్యేవి. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్నాళ్ల పాటు ఈ పథకాన్ని నిలిపేయడంతో పేద కుటుంబాల వివాహాల నిమిత్తం ఇబ్బందులు పడేవారు. ప్రస్తుతం చాలామంది లబ్ధిదారులకు సొమ్ము జమకాలేదు. అధికారులను అడిగినా సరైన సమాధానం రావడం లేదు.

ఈ.సోమునాయుడు

నిబంధనల పేరుతో కోత..

నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీలని చెప్పిన జగన్‌ కల్యాణమస్తు పథకం అందరికీ అందకుండా చేశారు. చిరుద్యోగం ఉందని, విద్యుత్‌ బిల్లు పెరిగిపోయిందని కుంటి సాకులు చెప్పి లబ్ధిదారులకు నిధులు అందకుండా చేస్తున్నారు. ఎవరైతే వైకాపా పార్టీకి చెందిన వారు ఉన్నారో వారికి మాత్రమే ఇస్తున్నారు.

ఆర్‌.శ్రీనివాసరావు, బల్జిపాలెం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని