logo

‘కర్కశ జమా’నా!!

ఆ వృద్ధులు...కర్రదన్నుగా లేకుంటే నడవలేరు అలా పదడుగులు వేసినా  ఆయాసం వచ్చేస్తుంది! చదువురాదు...అక్షరం తెలియదు.. చూపు కనిపించక మరొకరి సాయం తీసుకోవాల్సిందే!!

Updated : 30 Apr 2024 06:12 IST

బ్యాంకుల్లో పింఛన్ల సొమ్ము జమైతే తీసేదెలా
మండుటెండల్లో వృద్ధులకు ఈ పరీక్షేంటి
వైకాపా వ్యూహాలకు అనుగుణంగా మంత్రాంగమా?
ప్రతిపక్షాలే కారణమనేలా కుట్ర పూరిత ప్రచారం
ఈనాడు, విశాఖపట్నం, న్యూస్‌టుడే, వన్‌టౌన్‌

ఆ వృద్ధులు...కర్రదన్నుగా లేకుంటే నడవలేరు అలా పదడుగులు వేసినా  ఆయాసం వచ్చేస్తుంది! చదువురాదు...అక్షరం తెలియదు.. చూపు కనిపించక మరొకరి సాయం తీసుకోవాల్సిందే!! ఏ మాత్రం ఎండ బారిన పడినా అవస్థలు తప్పవు! అలాంటి వారికి  పింఛను సొమ్ములు ఇళ్లకెళ్లి ఇవ్వం!! బ్యాంకులో జమ చేస్తామనే ఉత్తర్వులు రావడం బడుగులపై పిడుగు పడినంతపనయింది!!

మనిషిలో ఏ మాత్రం దయా...దాక్షిణ్యం ఉన్నా వృద్ధుల పట్ల కనికరం చూపుతారు!! అలా మేం చేయలేం అన్నట్లు యంత్రాంగం ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి! పింఛన్ల పంపిణీ ప్రక్రియకు ‘రాజకీయం’తోడై నానాయాతనకు గురిచేసే వ్యూహం అమలు చేస్తున్నారు!!

సచివాలయాల వద్ద పింఛన్ల పంపిణీ సందర్భంగా ఎండ తీవ్రత తట్టుకోలేక ఏప్రిల్‌లో 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అయినా అధికారుల తీరు మారలేదు. బ్యాంకుల్లో సొమ్ములు జమ చేస్తాం తీసుకోండని చెప్పేశారు. మళ్లీ లబ్ధిదారులు ఇబ్బందులకు గురయ్యేలా, బ్యాంకుల చుట్టూ తిరిగే ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయం  మరింత అవస్థలపాలు చేస్తుందని వృద్ధులు గగ్గోలు పెడుతున్నారు. ‘ మే 13న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పింఛనుదారుల ఓట్ల కోసం అధికార వైకాపా రకరకాల ఎత్తుగడలు వేస్తోంది. వీటికి అధికారులు తల ఊపుతుండడంతో పేదలు బలవుతున్నారు. అసలే ఎండలు మండుతున్న వేళ బ్యాంకులకు వృద్ధులు వెళ్లి రావడం ఇబ్బందే’ అని పలువురు వాపోతున్నారు. జిల్లాలో మొత్తం పింఛనుదారుల్లో 74.15శాతం మంది బ్యాంకు ఖాతాలకు పింఛను మొత్తాన్ని మే ఒకటిన జమ చేయనున్నారు. సాధారణంగా తొలివారంలో బ్యాంకుల్లో రద్దీ అధికంగా ఉంటుంది. ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేసే అవకాశం ఉన్నా యంత్రాంగం పట్టించుకోవడంలేదు. రాష్ట్ర ఎన్నికల సంఘం వాలంటీర్లతో పంపిణీ చేయొద్దని మాత్రమే చెబితే ప్రతిపక్షాలు ఇంటింటికీ వెళ్లి ఇవ్వొద్దన్నాయని, ఈ పరిణామాలకు ప్రతిపక్షాలే కారణమనే విష ప్రచారం కూడా వైకాపా నేతలు చేస్తున్నారు

  • నగరంలో కొన్ని వార్డుల పరిధుల్లో బ్యాంకులు లేవు. పాతనగరం ఏరియా, మల్కాపురం, సింధియా, కైలాసుపురం వంటి చోట్ల  మూడు, నాలుగు కి.మీ. వెళ్లాల్సి ఉంటుంది.
  • బయోమెట్రిక్‌ వేసి తీసుకునే పరిస్థితి ఉన్నా చాలామందికి వేలిముద్రలు సక్రమంగా పడవు. అటువంటి వారు పెద్ద సంఖ్యలోనే జిల్లాలో ఉన్నారు. వీరంతా తీవ్రంగా విసిగిపోయే అవకాశం ఉంది.
  • చాలా మంది వృద్ధులకు బ్యాంకుకు వెళ్లి నగదు తీసుకోవడం తెలియదు. సంతకాలు మర్చిపోయారు. సంతకం తేడా వస్తే డబ్బులు ఇచ్చే పరిస్థితి ఉండదు.

  • బ్యాంకు ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్‌ లేక మైనస్‌లోకి వెళ్లిపోయిన లబ్ధిదారులు అధికంగానే ఉన్నారు. వీరి ఖాతాల్లో నగదు జమ చేస్తే కట్‌ అయిపోతాయని ఆందోళన చెందుతున్నారు. పెండింగు ఛార్జీలన్నీ వాటిలోంచే కోత వేసే ప్రమాదం లేకపోలేదు.
  • ఆనందపురం, పెందుర్తి, భీమిలి, మండలాల్లో శివారు గ్రామాలకు చెందిన వృద్ధులు ప్రధాన గ్రామాల్లోని బ్యాంకులకు రావాల్సిందే. ఇక్కడ మరింత ఇబ్బంది పడాల్సి వస్తుంది. సగటున అయిదు నుంచి పది కి.మీ. ప్రయాణించాలి.
  • 80 శాతం బ్యాంకులు ఆయా వార్డుల్లోని స్థానిక సచివాలయాలకన్నా చాలా దూరంలోనే ఉన్నాయి. గాజువాక, పెదగంట్యాడ, పెందుర్తి, ఆనందపురం, పద్మనాభం, భీమిలి, మధురవాడలో ముఖ్య ప్రాంతాలకు వస్తే గాని నగదు చేతికి రాదు.
  • విశాఖ నగరంలో బ్యాంకులు రద్దీగా ఉంటాయి. వాటిల్లో సిబ్బంది పింఛన్ల పంపిణీ కోసమే ఉండరు. లబ్ధిదారులు కోరిన వెంటనే నగదు ఇచ్చే పరిస్థితి ఉండదు.
  • చాలామంది లబ్ధిదారులకు ఆధార్‌కార్డు లింకయిన బ్యాంకుకే నగదు వెళ్తుంది. రెండు, మూడు ఖాతాలున్న వారికి ఏ బ్యాంకులో జమైందో తెలియక గందరగోళానికి గురవుతున్నారు. కొందరు ఆ బ్యాంకు ఖాతాలను నిర్వహించకపోవచ్చు.

  • అక్కయ్యపాలెంలో సీతారామ్‌ అనే 65 ఏళ్ల వృద్ధుడికి నాలుగు ఖాతాలున్నాయి. అన్నింటికీ ఆధార్‌ అనుసంధానం అయింది. ఏ ఖాతాలో డబ్బులు పడతాయోనని ఆందోళనచెందుతున్నాడు. ఎందులో జమయ్యా తెలుసుకునేందుకు మళ్లీ సచివాలయానికి వెళ్లాల్సి ఉంటుంది.
  • 60 ఏళ్లు దాటిన వారు వేలల్లోనే ఉన్నారు. వీరంతా ఒంటరిగా బ్యాంకులకు వెళ్లలేరు. ఎవరినైనా తోడుగా తీసుకువెళ్లాల్సిందే. ఇందుకు అదనపు ఖర్చులు, ఎండలకు అవస్థలు తప్పవు. బ్యాంకుకు వెళ్లాక విత్‌డ్రాఫాం రాయాల్సి ఉంటుంది. కొందరు నడవ లేని పరిస్థితి, మంచానికి పరిమితమైన వారు ఉన్నారు. వారిని బ్యాంకు వద్దకు తీసుకొచ్చి బ్యాంకు మేనేజర్‌కి చెప్పి విత్‌డ్రా చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ ఇబ్బందులేనని లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు.
  • ఒక్కో సచివాలయం పరిధిలో వృద్ధుల ఇళ్లకే వెళ్లి పంపిణీ చేస్తే దాదాపు రెండు రోజుల్లో పూర్తి చేసేయొచ్చు. కేవలం వృద్ధులను ఇబ్బంది పెట్టాలనే ఒకే ఒక లక్ష్యంతోనే బ్యాంకు ఖాతాల్లో జమ చేసే విధానం తీసుకొచ్చారని పలువురు విమర్శిస్తున్నారు.

ఏటీఎం కార్డులు కనిపించక

తాజా పరిణామాల నేపథ్యంలో లబ్ధిదారులు కొందరు ఏటీఎం కార్డులు ఎక్కడున్నాయో వెతుకుతున్నారు. వాటిని ఎక్కడ పెట్టారో తెలియక ఆందోళన చెందుతున్నారు. కొంతమందికి బ్యాంకు ఖాతాలు అనుసంధానమై ఉన్నా ఏటీఎం కార్డులు లేవు. కొందరికి ఉన్నా వాటి పిన్‌ నెంబర్లు మర్చిపోయారు. ఆరిలోవకు చెందిన 70 ఏళ్ల రమణయ్యకు ఏటీఎం కార్డు ఉన్నా దాని నెంబరు మర్చిపోయారు. సీతంపేట సచివాలయంలో వృద్ధాప్య పింఛను తీసుకుంటున్న దుర్గ ఇంట్లో ఏటీఎం కార్డు ఎక్కడుందో కనిపించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. పెదగంట్యాడలోని వృద్ధాప్య  పింఛను తీసుకుంటున్న రామచంద్రమూర్తి ఏటీఎం కార్డును అతని మనవడు వాడుతున్నాడు. అతను పొరుగు రాష్ట్రంలో చదువుతున్నాడు.

40 డిగ్రీల ఎండలున్నా:

ఇప్పటి వరకు ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్ల సొమ్ము ఇస్తున్నారు. ఇప్పుడు 40 డిగ్రీలకు పైన ఉష్ణోగ్రతలు ఉన్నా బ్యాంకులకు వెళ్లాలంటున్నారంటే అధికారులు ఎంత కఠినంగా ఉన్నారో అర్థమవుతుందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

పింఛన్లలో కోత...

ఏప్రిల్‌లో 1,65,891 మందికి రూ.50కోట్లు విడుదలైంది. మే నెలకు సంబంధించి 1,64,899 మందికే అందజేయనున్నారు. 992 మందికి కోత పడింది. ఇందుకు కారణాలు వెల్లడికాలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని