logo

సమయంలోపు పనులు సవాలే..!

మేడారం మహాజాతర.. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర.. కోటికి పైగా భక్తులు తరలివచ్చే తెలంగాణ కుంభమేళా.. వచ్చే ఏడాది ఫిబ్రవరి 21, 22, 23, 24 తేదీల్లో జాతర నిర్వహించనున్నట్లు బుధవారం పూజారులు ప్రకటించారు.

Published : 04 May 2023 04:33 IST

మహాజాతరకు ఇప్పటి నుంచే ప్రణాళికతో కదలాలి

మేడారం వనదేవతల గద్దెల ప్రాంగణంలో భక్తులు (పాత చిత్రం)

ఈనాడు డిజిటల్‌, జయశంకర్‌ భూపాలపల్లి, తాడ్వాయి, న్యూస్‌టుడే: మేడారం మహాజాతర.. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర.. కోటికి పైగా భక్తులు తరలివచ్చే తెలంగాణ కుంభమేళా.. వచ్చే ఏడాది ఫిబ్రవరి 21, 22, 23, 24 తేదీల్లో జాతర నిర్వహించనున్నట్లు బుధవారం పూజారులు ప్రకటించారు. మహాజాతరకు సరిగ్గా 9 నెలల పైగా సమయం ఉంది. జాతర అభివృద్ధి, ఏర్పాట్లకు ప్రతిసారీ సమయం సరిపోవడం లేదు. నిధుల విడుదలలో జాప్యం వల్ల ఆలస్యమవుతోంది. ఈసారైనా గడువులోపు పనులు పూర్తి చేయాలంటే ఇప్పటి నుంచే ప్రణాళిక ప్రకారం ముందుకు కదలాల్సి ఉంది. వెంటనే ప్రతిపాదనలు తయారుచేసి కార్యాచరణ ప్రారంభించాలి.

పోలీస్‌ స్టేషన్‌ను వినియోగంలోకి తేవాలి..

మేడారంలో నూతనంగా నిర్మించిన పోలీస్‌స్టేషన్‌ను అందుబాటులోకి తేవాలి. నిత్యం భక్తులు వస్తున్నారు. ఇక్కడ ఘర్షణలు, దొంగతనాలు జరుగుతున్నాయి. ఇటీవల అక్కడ పూజారి హత్యకు గురయ్యాడు. ఇప్పటికీ నిందితుడు దొరకలేదు. ఠాణా వినియోగంలోకి వస్తే భక్తులకు భద్రత ఉంటుంది.

కొత్తూరు-రెడ్డిగూడెం మధ్యలో గతేడాది వర్షాలకు కొట్టుకుపోయిన రహదారి


శాశ్వత ప్రాతిపదికన..

తాగునీరు, మరుగుదొడ్లు తాత్కాలికంగా నిర్మిస్తున్నారు. కాని జాతర సమయంలో వినియోగం అంతంతే. ప్రతిసారీ ఎక్కువ మొత్తంలో వీటికే కేటాయిస్తున్నారు. శాశ్వత ప్రాతిపదికన చేపట్టాలి. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, నాణ్యతతో కూడినపనులు చేపట్టి భక్తులకు సౌకర్యవంతమైన ఏర్పాట్లు చేయాలి.


ఇలా చేద్దాం..

జాతర సమయంలో ట్రాఫిక్‌ నియంత్రణకు పోలీస్‌ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. తాడ్వాయి-మేడారం, పస్రా-మేడారం, కాటారం-మేడారం, భూపాలపల్లి-మేడారం రహదారులు ఫోర్‌లైన్‌గా విస్తరించే రాకపోకలు అదే దారిలో కొనసాగించవచ్చు. ఇప్పుడున్న వన్‌వేతో భక్తులకు దూరభారం తగ్గుతుంది. ప్రమాదాలు నివారించవచ్చు.

* జంపన్న వాగుపై ఊరట్టం లోలెవల్‌ కాజ్‌వే వద్ద, రెడ్డిగూడెం ప్రాంతాల్లో వంతెనలు నిర్మించాలి. దీని వల్ల రద్దీని నియంత్రించవచ్చు.

* మేడారంలో అంతర్గత రహదారులు సక్రమంగా లేవు. రెడ్డిగూడెం, హరితహోటల్‌, ఆర్టీసీ బస్టాండ్‌, జంపన్నవాగు, సమ్మక్క గుడి తదితర ప్రాంతాల్లో అంతర్గత రహదారులు విస్తరించి సెంట్రల్‌ లైటింగ్‌ను ఏర్పాటు చేయాలి. దీనివల్ల భక్తులకు సౌకర్యవంతంగా ఉంటుంది.

* ట్రాఫిక్‌ ఆంక్షలతో భక్తులను సుదూర ప్రాంతాల్లోనే నిలిపివేస్తున్నారు. అమ్మవారికి సమర్పించే బంగారం, పిల్లలతో కలిసి గద్దెల వద్దకు రావడానికి  ఇబ్బందులు పడుతున్నారు. జాతర పరిసరాల్లో స్థలాలు ఖాళీగా ఉంటున్నాయి. గద్దెల పరిసర ప్రాంతాల్లో భక్తులు విడిది చేసేలా చర్యలు చేపట్టాలి. విరివిగా కాటేజీలు నిర్మించి వచ్చే జాతర కల్లా అందుబాటులో తీసుకురావాలి.

* ఆలయ పరిసరాల్లో దాదాపు 500 మీటర్ల పరిధిలో ఎలాంటి నిర్మాణాలు లేకుండా, భక్తులు ప్రశాంతంగా కాసేపు సేదతీరేలా ఏర్పాట్లు చేయాలి.


ప్రభుత్వం చొరవ చూపాలి
-  జగ్గారావు, మేడారం పూజారుల సంఘం అధ్యక్షుడు

ప్రభుత్వం చొరవ తీసుకుని పనుల ప్రారంభానికి ప్రణాళిక రూపొందించాలి. పరిసరాల్లో ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలి. నిధులు త్వరగా మంజూరు చేసి పనులు నాణ్యతగా చేపట్టేలా చూడాలి. పూజారులకు విడిది గృహం నిర్మించాలి. జాతరను మరింత అభివృద్ధికి ప్రభుత్వం చొరవ చూపాలి.


ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం
-  కృష్ణ ఆదిత్య, పాలనాధికారి, ములుగు జిల్లా

జాతర ఏర్పాట్లు, అభివృద్ధి పనుల నిమిత్తం వారం రోజుల కింద అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించాం. పూజారుల అభిప్రాయాలను కూడా తీసుకున్నాం. ఐదు ఇంజినీరింగ్‌ విభాగాలతో పాటు మరో 16 విభాగాల అధికారులను ప్రతిపాదనలు సిద్ధం చేయమని ఆదేశాలు ఇచ్చాం. శాశ్వత, తాత్కాలిక ప్రాతిపదికన రెండు విభాగాలు విభజించి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని