logo

విపణిలో ధర లేదు.. గిడ్డంగిలో జాగ లేదు!

ఉమ్మడి వరంగల్‌వ్యాప్తంగా ఎర్ర బంగారం పండించిన రైతులు ఈసారి నష్టాల ఘాటులో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

Published : 29 Apr 2024 04:42 IST

దగా చేస్తున్న దళారులు.. కుదేలవుతున్న మిర్చి రైతులు

ఉమ్మడి వరంగల్‌వ్యాప్తంగా ఎర్ర బంగారం పండించిన రైతులు ఈసారి నష్టాల ఘాటులో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. విపణిలో రోజురోజుకు పడిపోతున్న ధరలతో దగాపడుతున్నారు. కొన్నాళ్లు వేచి చూద్దామని సరకును శీతల గిడ్డంగుల్లో దాచుకుందామంటే అక్కడా వ్యాపారులు కుమ్మక్కై అన్నదాతలకు నేరుగా కోల్డ్‌స్టోరేజీలో స్థలం ఇవ్వడం లేదు. ఒకవేళ బస్తాలను నిల్వ చేసుకోనిచ్చినా అధిక ధరలతో భారం వేస్తున్నారు. దీంతో మిర్చి రైతులు ముప్పెట దాడి తట్టుకోలేక కుదేలవుతున్నారు.  

ఈనాడు, వరంగల్‌, ఎనుమాముల మార్కెట్, న్యూస్‌టుడే

ఇదీ పరిస్థితి.. 

తేజ రకం వారం పదిరోజుల కిందట క్వింటా రూ.18 వేల నుంచి రూ.19 వేలకుపైగా పలికింది. ఇప్పుడు వరంగల్‌ ఎనుమాముల మార్కెట్‌లో వ్యాపారులు కుమ్మక్కై ధరలు తగ్గించారు.. అంతర్జాతీయ మార్కెట్‌లో గిరాకీ లేదనే కారణాలు చెబుతూ సరకును శీతలగిడ్డంగికి తరలిస్తున్నారు. గత గురువారం జెండా పాట రూ.18 వేలు పలకగా కొన్ని బస్తాలకు మాత్రమే ఈ ధర చెల్లించి మిగతా సరకుకు రూ.3 వేల నుంచి రూ.4 వేలు తగ్గించి కొనుగోలు చేశారు. అధిక ధర వస్తుందనుకున్న చపాటా రకం క్వింటా రూ.21 వేల వరకే పలుకుతోంది. గతేడాది ఇదే రకం క్వింటా రూ.80 వేల వరకు వెళ్లింది. ఇప్పటికే అధిగ ఉష్ణోగ్రతల వల్ల తేమ లేకుండా మిర్చి పూర్తిగా ఆరిపోయినా దళారులు నాణ్యత, తాలు పేరుతో ధరలు తగ్గిస్తున్నారు.  ధరలు బాగా వచ్చినప్పుడు విక్రయిద్దామని శీతల గిడ్డంగుల్లో మిర్చిని భద్రపరుద్దామన్నా స్థలం దొరకడం లేదు. కోల్డ్‌ స్టోరేజీ వ్యాపారులు నేరుగా రైతుల వద్ద తీసుకోకుండా వ్యాపారులు తెచ్చిన సరకును మాత్రమే భద్రపరచుకుంటున్నారు. వ్యాపారులు మార్కెట్‌లో తక్కువ ధరకు రైతుల నుంచి కొనుగోలు చేసి అధిక లాభాల కోసం శీతల గిడ్డంగుల్లో భద్రపరుస్తున్నారు.

వరంగల్‌ ఎనుమాముల మార్కెట్‌లో మిర్చీతో ఎరుపెక్కిన యార్డు

వ్యాపారుల కనుసన్నల్లోనే..

ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌ పరిధిలో మొత్తం 25 శీతల గిడ్డంగులున్నాయి. ఒక్కొక్కటి 80 వేల నుంచి    1.20 లక్షల బస్తాల నిల్వ సామర్థ్యం కలిగి ఉంది. ప్రస్తుతం శీతల గిడ్డంగుల్లో 22,02,422 బస్తాల మిర్చి, 2,70,724 పసుపు బస్తాలు, 91,819 ఇతర సరకులున్నాయి. మార్కెట్‌ పరిధిలోని శీతలగిడ్డంగుల నిర్వహణ చాలావరకు వ్యాపారుల కనుసన్నల్లోనే నడుస్తోంది.    సామాన్య రైతులకు స్థలం కొరత ఏర్పడుతోంది. ఒక్కో బస్తా నిల్వకు బీమాతో కలిపి రూ.168 తీసుకోవాల్సి ఉండగా.. కొన్ని శీతలగిడ్డంగుల నిర్వాహకులు రూ.200 నుంచి రూ.300 వరకు వసూలు చేస్తున్నారు. మార్కెటింగ్‌శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ రాయితీతో నిర్మించిన శీతలగిడ్డంగులు ప్రభుత్వ నిబంధల మేరకు మొత్తం నిల్వ సామర్థ్యంలో 50శాతం రైతుల సరకు నిల్వకు కేటాయించాల్సి ఉన్నా.. అధికారులు పర్యవేక్షణ లోపంతో నిర్వాహకులు నిబంధనలను పాటించడంలేదు. మొత్తం 25 శీతలగిడ్డంగుల్లో 9 మాత్రమే ప్రభుత్వ రాయితీని పొందాయని అధికారులు తెలిపారు.

కోల్డ్‌ స్టోరేజీలో స్థలం లేదని రాసిన బోర్డు

వరంగల్‌ జిల్లా నల్లబెల్లి మండలం రుద్రగూడెంకు చెందిన రైతు సండేసారి బాలరాజు రెండెకరాల్లో మిర్చి పంట వేశారు. 10 క్వింటాళ్ల మిర్చి అమ్మకానికి వరంగల్‌ మార్కెట్కు తీసుకెళ్లగా తక్కువ ధరకు అడగడంతో 18 బస్తాలను శీతల గిడ్డంగిలో నిల్వ చేయగా బస్తాకు రూ.200  అద్దె ఉంటుందని చెప్పారు. మహబూబాబాద్‌ కేసముద్రం మార్కెట్‌లో గిడ్డంగిలో బస్తాకు నిబంధనల ప్రకారమే వసూలు చేస్తున్నారు.

మిర్చి బస్తాలతో ఉన్న ఓ శీతల గిడ్డంగి

ఎకరం పొలంలో మిర్చి సాగు చేశా. నెలన్నర కిందట సరకు తెస్తే క్వింటా రూ.20 వేలు పలికింది. ఇప్పుడు మరో 14 బస్తాలు తీసుకొచ్చా. ధర రూ.15,500 మాత్రమే చెల్లించారు. శీతలగిడ్డంగిలో స్థలం లేక అమ్మేసుకున్నా. రూ. 500 నుంచి రూ.1000 వరకు ధరలో వ్యత్యాసం ఉండాలి.. ఇంతలా తగ్గించడంతో నష్టపోతున్నాం.

మామిండ్ల వెంకట్‌రెడ్డి, పోనుగండ్ల వీరయ్యపల్లి, నల్లబెల్లి మండలం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని