logo

‘బాలరాముడి పేరుతో భాజపా రాజకీయం’

అయోధ్యలో రామాలయం పేరుతో ప్రధాని మోదీ, భాజపా నేతలు రాజకీయం చేస్తున్నారని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. వరంగల్‌ జిల్లా ఓసిటీ(ఓరుగల్లు సిటీ)లోని క్యాంపు కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి సురేఖ మాట్లాడారు.

Published : 02 May 2024 06:11 IST

సమావేశంలో ప్రసంగిస్తున్న మంత్రి కొండా సురేఖ, చిత్రంలో ఎంపీ అభ్యర్థి కడియం కావ్య

కాశీబుగ్గ, న్యూస్‌టుడే: అయోధ్యలో రామాలయం పేరుతో ప్రధాని మోదీ, భాజపా నేతలు రాజకీయం చేస్తున్నారని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. వరంగల్‌ జిల్లా ఓసిటీ(ఓరుగల్లు సిటీ)లోని క్యాంపు కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి సురేఖ మాట్లాడారు. మతతత్వ పార్టీగా ముద్రవేసుకున్న భాజపా కులాలు, మతాల పేరుతో రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. దేశంలో రిజర్వేషన్లు రద్దు చేస్తామని ప్రధాని మోదీ, అమిత్‌షా తదితర ముఖ్య నేతలు మాట్లాడటం సరికాదన్నారు. రాజీవ్‌గాంధీ రిజర్వేషన్లు తేవడం వల్లే తనలాంటి మహిళలు ఎందరో ప్రజాప్రతినిధులుగా ఎన్నికై రాజకీయాల్లో ముందుకు సాగుతున్న విషయాన్ని గుర్తించాలన్నారు. వరంగల్‌ తూర్పులో రెండు రోజుల్లో కడియం కావ్య రోడ్‌షో ఉంటుందని సురేఖ వివరించారు. భారాస కార్పొరేటర్‌పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసిన విషయంపై ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు మంత్రి స్పందిస్తూ.. భారాస వారికి మాట్లాడే అర్హత లేదన్నారు. వరంగల్‌ మేయర్‌గా గుండు సుధారాణి ఉంటారని ఓ ప్రశ్నకు మంత్రి సురేఖ బదులిచ్చారు.

ముఖ్యనేతలు, డివిజన్‌ అధ్యక్షులతో సమీక్ష

అంతకుముందు క్యాంపు కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలు, డివిజన్‌ అధ్యక్షులు, పార్టీ బాధ్యులతో సమీక్ష నిర్వహించారు. ఎంపీ అభ్యర్థి కడియం కావ్య సైతం సమీక్షకు హాజరయ్యారు. ఒక్కో బూత్‌కు 10 మందిని నియమిస్తూ ఓ జాబితా సిద్ధం చేశారు. బూత్‌ కమిటీలో కీలకంగా వ్యవహరించే వారికే ఎంపీ ఎన్నికల అనంతరం ఇందిరమ్మ కమిటీల్లోనూ అవకాశం దక్కనున్న నేపథ్యంలో తమ పేర్లు రాయాలని పార్టీ శ్రేణులు పోటీపడ్డారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ 26వ డివిజన్‌ అధ్యక్షుడు జన్ను భాస్కర్‌, మాజీ కార్పొరేటర్‌ తత్తరి లక్ష్మణ్‌ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మంత్రి ఎదుటే ఇద్దరు దుర్భాషలాడుకున్నారు. మంత్రి సురేఖ వారించడంతో గొడవ సద్దుమణిగింది. సమీక్ష జరుగుతున్న క్రమంలో పార్టీ సీనియర్‌ నాయకుడు కరాటే ప్రభాకర్‌ క్యాంపు కార్యాలయానికి వచ్చారు. అప్పటికే కార్యాలయం కాంగ్రెస్‌ శ్రేణులతో కిక్కిరిసిపోయింది. దీంతో సెక్యూరిటీ సిబ్బంది కార్యాలయం ముఖద్వారం మూసేశారు. అయినా ప్రభాకర్‌ లోపలికి వెళ్లేందుకు యత్నించడంతో గొడవ జరిగింది. సమీక్ష జరుగుతున్న సమయంలో కాంగ్రెస్‌ పార్టీలో కొత్త, పాత నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పాత వారిని బయట నిలబెట్టి ఇటీవల పార్టీలో చేరిన వారిని లోపలికి పంపిస్తున్నారని మరికొందరు కార్యకర్తలు బహిరంగంగానే విమర్శలు చేశారు. అనంతరం పార్టీ ముఖ్య నేతలకు డివిజన్‌ బాధ్యులకు జెండాలు, ప్రచార సామగ్రి అందించారు. సమావేశంలో కార్పొరేటర్‌ గుండేటి నరేందర్‌, పీసీసీ కార్యదర్శి మీసాల ప్రకాశ్‌, పీసీసీ సభ్యుడు నల్గొండ రమేశ్‌, సీనియర్‌ నేతలు ఎల్‌.శ్రీనివాస్‌, జన్ను రవి, గోరంట్ల రాజు, చిప్ప వెంకటేశ్వర్లు, నవీన్‌రాజ్‌, మహిళా నాయకురాళ్లు నారగోని స్వప్న, మంతెన సునీత, గిరిగిరి పుష్ప తదితరులు హాజరయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని