logo

గులాబీ శ్రేణుల్లో జోష్‌ నింపిన కేసీఆర్‌ రోడ్‌షో

మానుకోటలో జై తెలంగాణ నినాదాలు మరోసారి మిన్నంటాయి. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ ప్రాంతంలో అడుగుపెట్టగానే ఆనాడు పోరాటానికి స్ఫూర్తినిచ్చిన జై తెలంగాణ నినాదాలు దారి పొడవునా మార్మోగాయి.

Updated : 02 May 2024 06:26 IST

ప్రసంగిస్తున్న కేసీఆర్‌. చిత్రంలో ఎడమవైపు నుంచి జడ్పీ ఛైర్‌పర్సన్‌ బిందు, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు హరిప్రియ, శంకర్‌నాయక్‌, పెద్ది సుదర్శన్‌రెడ్డి, రెడ్యానాయక్‌, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి. మాజీ మంత్రి సత్యవతిరాథోడ్‌

మహబూబాబాద్‌, నెహ్రూసెంటర్‌, న్యూస్‌టుడే: మానుకోటలో జై తెలంగాణ నినాదాలు మరోసారి మిన్నంటాయి. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ ప్రాంతంలో అడుగుపెట్టగానే ఆనాడు పోరాటానికి స్ఫూర్తినిచ్చిన జై తెలంగాణ నినాదాలు దారి పొడవునా మార్మోగాయి. కొత్తగూడెం నుంచి బయలుదేరిన బస్సు యాత్ర బుధవారం రాత్రి మానుకోటకు చేరుకోగా గులాబీ నేతలు, కార్యకర్తలు కేసీఆర్‌కు ఘనస్వాగతం పలికారు. పట్టణంలోని ఇల్లందు రోడ్‌ నుంచి ప్రధాన రహదారి మీదుగా స్థానిక ఇందిరాగాంధీ కూడలికి చేరుకొని అక్కడ కార్నర్‌ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. ‘గౌరవ మాజీ మంత్రి రెడ్యానాయక్‌, మరో మాజీ మంత్రి సత్యవతిరాథోడ్‌, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, భారాస అభ్యర్థి మాలోత్‌ కవిత పేరును ప్రస్తావిస్తూ అలాగే మాజీ ఎమ్మెల్యేలు’ అంటూ.. ఆయన తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ‘ఎంతో ఆవేశపూరితంగా నేల ఈనిందా అన్నట్లు వచ్చిన అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు, అందరికీ నమస్కారం’ అంటూ కొనసాగించారు. మహబూబాబాద్‌పై ఎంతో ప్రేమతో గిరిజన ప్రాంతం అభివృద్ధి కావాలని జిల్లాగా ఏర్పాటు చేసుకున్నాం.. రాష్ట్ర ప్రభుత్వం ఈ జిల్లాను రద్దు చేస్తామంటుంది.. ఈ జిల్లా ఉండాల్నా పోవాల్నా అని అక్కడ హాజరైనవారిని ప్రశ్నించారు. జిల్లా ఉండాలంటే.. ఈ ముఖ్యమంత్రి మెడలు వంచాలంటే.. ఇక్కడ మాలోతు కవిత గెలవాలే అన్నారు. ఈ ఏరియాలో సాగునీళ్లు వచ్చేటివి కావన్నారు. కాంగ్రెస్‌ నలభైఏళ్ల పాలనలో ఎస్సారెస్పీ స్టేజీ-2 అని చెబితే ఎన్నడు కూడా నీళ్లు రాలే.. వెన్నవరం కెనాల్‌ వచ్చేవరకు కూడా రాలే. కాళేశ్వరం కట్టిన తర్వాత నేను చాలా కష్టపడి వెన్నవరం కాలువ తవ్వించిన తర్వాతనే మనకు నీళ్లు వస్తున్నాయనే విషయం మీకు తెలుసు అన్నారు. ఈ సంవత్సరం నీళ్లు రాలేదు.. కరెంట్‌ రాలేదు.. వీటి గురించి ఆలోచించాలన్నారు. కవిత బ్రహ్మాండమైన నాయకురాలు మచ్చలేని మనిషి, పార్లమెంట్‌ సభ్యురాలిగా మీ అందరి ఆదరాభిమానాలు పొంది గత ఐదేళ్లు బాగా పని చేశారన్నారు. ఈసారి కూడా ఆమెకు అవకాశం ఇస్తే పార్లమెంట్‌లో ఇతర సమస్యలతో పాటు తెలంగాణ హక్కులు కాపాడడానికి, తెలంగాణకు నిధులు రాబట్టడానికి, అస్థిత్వాన్ని రక్షించడానికి కవితను గెలిపించాలని కేసీఆర్‌ కోరారు.

కార్నర్‌ మీటింగ్‌కు భారీగా హాజరైన జనం

పర్యటన సాగింది ఇలా..

  • సాయంత్రం 6.40: మహబూబాబాద్‌ జిల్లా సరిహద్దులో ఉన్న బయ్యారానికి రాక
  • రాత్రి 7.10: కార్నర్‌ మీటింగ్‌ నిర్వహించే ఇందిరాగాంధీ కూడలికి చేరుకున్నారు.
  • 7.20 నుంచి 7.34 గంటలకు ప్రసంగం ముగిసింది.
  • 8.00: ఎంపీ, భారాస అభ్యర్థి మాలోత్‌ కవిత నివాసానికి చేరుకున్నారు. కొద్దిసేపు నాయకులతో సమీక్షించారు.
  • 8.50: ఎర్రవల్లి క్షేత్రానికి బయలుదేరారు.

బస్సుపై ఎంపీ కవితతో నృత్యం చేయిస్తున్న మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌

విశేషాలు..

  • బతుకమ్మలు, కోలాటాలు, బోనాలు, పోతురాజుల విన్యాసాలతో ప్రజలు కేసీఆర్‌కు స్వాగతం పలికారు.
  • దారి పొడవునా గులాబీ కాగితపు పూల వాన కురిపించారు.
  • కేసీఆర్‌ 14 నిమిషాలు ప్రసంగించారు.
  • కేసీఆర్‌ బస్సులో నుంచి పైకి రాగానే ఒక్కసారిగా కేరింతలు కొట్టారు.
  • మాజీ మంత్రి సత్యవతిరాథోడ్‌ తాను స్వయంగా తయారుచేసిన అరిసెలు, గారెలు కేసీఆర్‌కు బస్సులో అందజేశారు.
  • ఎంపీ కవిత, ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్‌, మాజీ ఎమ్మెల్యే హరిప్రియ సభ ముగిశాక బస్సుపై నృత్యం చేశారు.
  • మహబూబాబాద్‌లోని ఎంపీ కవిత నివాసానికి మొదటిసారి వచ్చిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కవిత మిత్రురాలు హరిత మంగళహారతి ఇచ్చి స్వాగతం పలికారు.

ప్రచార సరళిపై సమీక్ష

మహబూబాబాద్‌, న్యూస్‌టుడే: కార్నర్‌ మీటింగ్‌ ముగిసిన అనంతరం భారాస అభ్యర్థి, ఎంపీ మాలోత్‌ కవిత నివాస గృహానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేరుకున్నారు. ఎన్నికల ప్రచార సరళితో పాటు ఇతర అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో ఎంపీ, భారాస అభ్యర్థి మాలోత్‌ కవిత, మహబూబాబాద్‌ జడ్పీ అధ్యక్షురాలు ఆంగోత్‌ బిందు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ స్పీకర్‌ సిరికొండ మధుసూదనాచారి, ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్‌, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు రెడ్యానాయక్‌, బానోత్‌ శంకర్‌నాయక్‌, పెద్ది సుదర్శన్‌రెడ్డి, హరిప్రియ, రేగ కాంతారావు, భారాస సీనియర్‌ నాయకుడు మార్నేని వెంకన్న పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని