logo

రూ.80 లక్షలతో నిర్మించారు.. నిరుపయోగంగా మిగిల్చారు

ఆకివీడు మండలం పెద కాపవరంలో మంగళవారం కలెక్టర్‌ ప్రశాంతి పర్యటించారు. తొలుత ఉన్నత పాఠశాలను పరిశీలించారు.

Published : 01 Feb 2023 05:18 IST

భవనం గురించి కలెక్టర్‌కు వివరిస్తున్న ఎంపీపీ, సర్పంచి

పెదకాపవరం(ఆకివీడు), న్యూస్‌టుడే: ఆకివీడు మండలం పెద కాపవరంలో మంగళవారం కలెక్టర్‌ ప్రశాంతి పర్యటించారు. తొలుత ఉన్నత పాఠశాలను పరిశీలించారు. అనంతరం గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో వైద్యులు లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై సిబ్బందిని కలెక్టర్‌ ప్రశ్నించారు. వైద్యురాలు సెలవులో ఉన్నారని సిబ్బంది చెప్పారు. సెలవులో ఉంటే ఇన్‌ఛార్జి వైద్యులు ఉండాలి కదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ కఠారి జయలక్ష్మి, సర్పంచి ఊసల బేబీస్నేతు తదితరులు గ్రామంలోని ఉన్నత పాఠశాల సమీపంలో సుమారు 8 ఏళ్ల క్రితం రూ.80 లక్షలతో నిర్మించిన బాల సదనం(బాలికల వసతి గృహం) భవనాన్ని కలెక్టర్‌కు చూపించారు. చివరి దశ నిర్మాణ పనులు మిగిలిపోవడంతో ఇప్పటికీ వినియోగంలోకి రాలేదని, మిగిలిన పనులు పూర్తి చేయించాలని కలెక్టర్‌ను కోరారు. సంబంధిత అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటానని హామీఇచ్చారు. పలువురు మహిళలు కలెక్టర్‌ను కలిసి ఇళ్ల స్థలాలు కేటాయించారు కానీ స్వాధీనం చేయలేదని చెప్పారు. దీనిపై తహశీల్దార్‌ వెంకటేశ్వరరావును వివరాలు అడిగారు. పూర్తిస్థాయిలో సర్వే చేసి, వివాదాలు ఉంటే పరిష్కరించి లబ్ధిదారులను స్థలాలు ఇవ్వాలని ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని