logo

కాలయాపన చేసి అప్పుల్లో ముంచారు

సొంతింటి కల సాకారమే లక్ష్యంగా తెదేపా ప్రభుత్వం పక్కా ఇళ్లు మంజూరు చేసింది. ఈ లబ్ధిదారులకు నేటికీ బిల్లులు చెల్లించకుండా వైకాపా ప్రభుత్వం కాలయాపన చేస్తోంది.

Published : 28 Apr 2024 04:50 IST

 గత ప్రభుత్వ హయాంలోని  ఇళ్ల లబ్ధిదారులకు మొండిచేయి
 ఇప్పటికీ మంజూరు కాని బిల్లులు 

ఉంగుటూరు, ముదినేపల్లి, న్యూస్‌టుడే: సొంతింటి కల సాకారమే లక్ష్యంగా తెదేపా ప్రభుత్వం పక్కా ఇళ్లు మంజూరు చేసింది. ఈ లబ్ధిదారులకు నేటికీ బిల్లులు చెల్లించకుండా వైకాపా ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. వారిని అప్పులపాల్జేస్తోంది.  తెదేపా ప్రభుత్వం ఎన్టీఆర్‌ గ్రామీణ గృహ నిర్మాణ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.1.50 లక్షలు, కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో రూ.2 లక్షలు చొప్పున మంజూరు చేసింది. ఎస్సీ, ఎస్టీలకు అదనంగా చెల్లించింది. 2018, 2019లో మంజూరైన గృహాలకు లబ్ధిదారులు నిర్మాణాలు చేపట్టారు. చాలా వరకు అప్పట్లోనే పూర్తి కాగా మరి కొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. 2019 ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడం, ప్రభుత్వం మారడంతో నిర్మాణాల పురోగతి మందగించింది. 2019 మార్చి నెలాఖరు వరకు బిల్లులు మంజూరు కాగా ఆ తర్వాత నుంచి చెల్లింపులు నిలిపేశారు. ఇంకెంత అన్నారు.. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఇళ్లకు 2020లో చెల్లిస్తామని ప్రకటించింది. దీంతో ఆలస్యమైన సొమ్ములు చెల్లిస్తారనే ఆశతో అప్పులు చేసి నిర్మాణాలు పూర్తి చేశారు. అయిదేళ్లు గడిచినా బకాయిలు మంజూరు కాలేదు. దీంతో అప్పులకు వడ్డీలు చెల్లిస్తూ చాలా మంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.84 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది.


ఎన్నిసార్లు తిరిగినా ఇవ్వలేదు.

గత తెదేపా ప్రభుత్వంలో ఇల్లు మంజూరు కాగా..నిర్మాణం ప్రారంభించాం. సగం బిల్లు జమైంది. ఇంకా రూ.90వేలు రావాల్సి ఉంది.  ప్రస్తుత వైకాపా ప్రభుత్వం వాటిని ఇవ్వలేదు. పథకం ఏ ప్రభుత్వం మంజూరు చేసినా.. అమలు చేయాల్సి ఉన్నా కావాలని అర్ధంతరంగా నిలుపుదల చేసి మమ్మల్ని ముంచేశారు. ఎన్నిసార్లు అధికారులు చుట్టూ తిరిగినా ఇవ్వలేదు. అప్పులు చేసి నానా తిప్పలు పడి నిర్మించుకున్నాం.

-తందూరి శ్రీలక్ష్మి, గురజ


కాళ్లు అరిగేలా తిరిగా

తెదేపా హయాంలో నిర్మాణం ప్రారంభించాం. సగంపైనే   పూర్తి చేశాం. ఈలోగా ఎన్నికలు వచ్చాయి. ఆ తర్వాత మా బిల్లులు చేయలేదు.పైగా పథకం వివరాలు రాస్తే బిల్లులు వేస్తామంటూ ఎదురు రూ.2 వేలు తీసుకుని బోర్డు రాశారు. అయినా ఇప్పటి వరకు రావాల్సిన రూ.90 వేలు ఇవ్వలేదు. కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ తిరిగినా మమ్మల్ని పట్టించుకోలేదు.

-వీరిశెట్టి నాగమణి, ముదినేపల్లి


ఒక రూపాయి జమైంది..

2018లో నాకున్న సొంత స్థలంలో ఇంటి నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకోవడంతో మంజూరైంది. సుమారు రూ.1.50 లక్షల రుణం వస్తుందని చెప్పడంతో నిర్మాణం ప్రారంభించా. అనంతరం ప్రభుత్వం మారింది. ఎప్పటికైనా రుణం మంజూరు చేస్తుందన్న నమ్మకంతో మధ్యలోనే వదిలేయలేక అప్పు చేసి నిర్మాణం పూర్తి చేశా. 2019లో వచ్చిన వైకాపా ప్రభుత్వం 2020 నాటికి బిల్లులన్నీ చెల్లిస్తామని ప్రకటించింది. ఆనంద పడ్డా. ఒక రూపాయి వేశారు. ఇప్పటికీ బిల్లులు చెల్లించలేదు. నిర్మాణం కోసం చేసిన అప్పులు ఇప్పటికీ తీరుస్తూనే ఉన్నా.  

- కోరాడ పాపాయమ్మ, ఉంగుటూరు

2019 సాధారణ ఎన్నికల నాటికి ఉమ్మడి పశ్చిమలో గణాంకాలు ఇలా..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని