logo

ఇంటింటికీ ప్రచార వాహనం....

వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంటింటికీ రేషన్‌ పేరిట వైకాపా నాయకులు, అనుచరులకు ఎండీయూ వాహనాలను కట్టబెట్టిన విషయం తెలిసిందే.

Published : 29 Apr 2024 02:53 IST

ఎండీయూ ఆపరేటర్లలో అధికార పార్టీవారే అధికం

సరకుల పంపిణీ (పాత చిత్రం)

తణుకు గ్రామీణం, న్యూస్‌టుడే : వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంటింటికీ రేషన్‌ పేరిట వైకాపా నాయకులు, అనుచరులకు ఎండీయూ వాహనాలను కట్టబెట్టిన విషయం తెలిసిందే. అయితే వీరంతా ఎన్నికల సమయంలో ప్రచార కార్యకర్తలుగా కీలకంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. నియోజకవర్గంలో తణుకు పట్టణం, ఇరగవరం, అత్తిలి మండలాలకు సంబంధించి 51 గ్రామాలకు 55 ఎండీయూ వాహనాలు   కార్డుదారులకు ప్రతి నెలా నిత్యావసరాలు అందిస్తున్నారు.  

ఇప్పటికీ పార్టీ రంగులే...

ఈ వాహనాలపై ముఖ్యమంత్రి జగన్‌ చిత్రంతోపాటు వైకాపా ప్రభుత్వం అందిస్తున్న నవరత్నాలు పథకాల లోగో ముద్రించారు. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినా వీటిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.  

వారందరూ వీర విధేయులు

ప్రారంభంలో వైకాపా ప్రజాప్రతినిధులు సిఫార్సు చేసినవారికే వాహనాలు కేటాయించేవారు.  వీరు అధికార పార్టీకి వీర విధేయులన్నది బహిరంగా రహస్యం. వీరిలో తటస్థులు కొందరు రెండేళ్ల కిందట ప్రభుత్వ నుంచి వాహన రాయితీ సక్రమంగా అందకపోవడతో వాహనాలు  వదిలేశారు.  

ఇదీ పరిస్థితి..

ఇంటికే సరకులు వస్తే అంతకంటే ఆనందం ఏముందని అంతా సంబరపడ్డారు. కానీ వీధి చివరకో, పక్క వీధిలోకో వెళ్తే కానీ సరకులు అందని పరిస్థితి నెలకొంది. ఇది చాలదన్నట్లు  అధిక శాతం అధికార పార్టీ కార్యకర్తలకే ఎండీయూ వాహనాలు మంజూరు చేశారు.  

రాష్ట్రంలో మే 13న సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఏప్రిల్‌నెల సరకులు అందించిన ఎండీయూ ఆపరేటర్లు మే మొదటి వారంలోనూ నిత్యావసరాలు పంపిణీ చేస్తారు. అంటే వారి పరిధిలోని ప్రతి లబ్ధిదారుతో మాట్లాడే వీలుంది. దీంతో వీరు ఓటర్లను ప్రభావితం చేస్తారని ప్రతిపక్ష నాయకులు విమర్శిస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని