logo

ఎన్నికల వేళ.. ఇసుకాసురుల తెగింపు

ఎన్నికల వేళ ఇసుక ర్యాంపులు తెరుచుకుంటున్నాయి. కరుగోరుమిల్లి ర్యాంపు నుంచి ఆదివారం రవాణా మొదలైంది. గతంలో గ్రామస్థులు ర్యాంపునకు గండి కొట్టగా, నిర్వాహకులు దానిని మళ్లీ పూడ్చి బాట నిర్మించారు.

Published : 29 Apr 2024 03:05 IST

తవ్వకాలను అడ్డుకున్న గ్రామస్థులు

కరుగోరుమిల్లి తీరంలో ఇసుక రవాణాకు సిద్ధం చేసిన వాహనాలు

ఎన్నికల వేళ ఇసుక ర్యాంపులు తెరుచుకుంటున్నాయి. కరుగోరుమిల్లి ర్యాంపు నుంచి ఆదివారం రవాణా మొదలైంది. గతంలో గ్రామస్థులు ర్యాంపునకు గండి కొట్టగా, నిర్వాహకులు దానిని మళ్లీ పూడ్చి బాట నిర్మించారు. రెండు పొక్లెయిన్లను నదీ గర్భంలోకి తరలించారు. రవాణాకు అనుకూలంగా తీరంలో పెద్దపెద్ద ఇసుక గుట్టలు పెట్టారు. ఇసుక తరలింపును గ్రామస్థులు అడ్డుకుని మళ్లీ  అభ్యంతరం తెలిపారు.

ఆచంట, న్యూస్‌టుడే

ఆచంట నియోజకవర్గ పరిధిలోని కరుగోరుమిల్లిలో నెల కిందట ఇసుక ర్యాంపునకు అనుమతి వచ్చిందంటూ ఎగుమతులు ప్రారంభించారు. రెండు మూడు రోజులు పొక్లెయిన్లతో లారీల్లో లోడు చేసి తరలించారు. దీనిపై మాజీ మంత్రి పితాని స్పందిస్తూ అవి నకిలీ అనుమతులని ఆరోపించారు. ఇసుక అక్రమ దందా వెనుక వైకాపాతోపాటు స్థానిక ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఉన్నారని విమర్శించారు.  

అడ్డుకున్నా.. ఆగని రవాణా..

అధికార పార్టీ అండదండలు, అధికారుల ఉదాసీనతతో ఉగాది రోజు కరుగోరుమిల్లిలో అక్రమ దందాకు తెర తీశారు. ఆ రోజు తెల్లవారుజామున స్థానికులు రవాణా వాహనాలను అడ్డుకున్నారు. ఏడు ట్రాక్టర్లు, పొక్లెయిన్‌ నిలిపి వేశారు.  వాహనాలు వెళ్తున్న ర్యాంపునకు గండి కొట్టారు. పోలీసులు, రెవెన్యూ సిబ్బంది  ప్రాథమిక సమాచారం సేకరించారు. గ్రామస్థులు పట్టిచ్చిన పొక్లెయిన్లు, ట్రాక్టర్లు సీజ్‌ చేయలేదు. ఇసుక చోరులపై కేసులు నమోదు కాలేదు. తాజాగా అనుమతులు ఉన్నాయంటూ  ఆదివారం ర్యాంపు తెరిచారు.

కరుగోరుమిల్లి ర్యాంపులో  ఆదివారం ఉదయం ఇసుక నింపుకొని వస్తున్న లారీ

నిబంధనలు పాటించాల్సిందే..

జిల్లాలో అనుమతులు లేకుండా కొన్నిచోట్ల ఏడాదంతా ఇసుక అక్రమ దందా సాగింది. కరుగోరుమిల్లిలో తవ్వకాలకు ఎన్నికల కోడ్‌ రాకముందే అనుమతులు లభించాయని చెబుతూ కార్యకలాపాలు మొదలు పెట్టారు. లోడు వాహనాలతో ఏటిగట్టుకు, వంతెనలకు ముప్పు వాటిల్లకూడదనే  నిబంధనను తుంగలో తొక్కారు.యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేయకూడదు.. మీటరు కంటే ఎక్కువ లోతు తీయకూడదు.  ఈ ర్యాంపు గురించి ఆచంట తహసీల్దార్‌ ఐపీ శెట్టిని సంప్రదించగా ఇసుక ర్యాంపునకు అనుమతులు ఉన్నాయని తెలిపారు.  ఏడీ మైన్స్‌ ఇన్‌ఛార్జిని చరవాణిలో సంప్రదించగా స్పందించ లేదు.

దందా ఆగలేదు..

అనుమతులు లేకపోయినా జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జరుగుతూనే ఉంది. అక్రమార్కులు ట్రాక్టరు ఇసుకకు రూ.3500 వసూలు చేస్తున్నారు. ఒక్క కరుగోరుమిల్లి గ్రామంలోనే అక్రమ  రవాణా ద్వారా కోట్లాది రూపాయలు ఇసుకాసురులు జేబుల్లో వేసుకున్నారని ఆరోపణలున్నాయి. ఇంతకు ముందు నడిపూడి, సిద్ధాంతంలో కూడా అక్రమంగా తరలించుకుపోయారు. రెండు, మూడు సార్లు స్థానికులు అడ్డుకోవడంతో అక్కడ కూడా తాత్కాలికంగా రవాణా ఆగింది. నడిపూడిలో కూడా గ్రామస్థులు అడ్డుకోవడమే కాకుండా పంచాయతీలో తీర్మానం చేసి అధికారులకు ఫిర్యాదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని