logo

ఆదుకోమంటే బాదేశారు

పన్నుల బాదుడుతో రవాణా రంగాన్ని జగన్‌ ప్రభుత్వం కుదేలు చేసింది. ఫలితంగా ఈ రంగంపై ఆధారపడిన లక్షల మంది ఉపాధిపై తీవ్ర ప్రభావం పడింది.

Published : 29 Apr 2024 03:11 IST

జగన్‌ సర్కారులో..రవాణా రంగం కుదేలు
త్రైమాసిక, గ్రీన్‌ ట్యాక్స్‌లు భారీగా పెంపు
పాలకొల్లు పట్టణం, ఏలూరు వన్‌టౌన్‌, న్యూస్‌టుడే

పాలకొల్లు స్టాండ్‌లో లారీలు

పన్నుల బాదుడుతో రవాణా రంగాన్ని జగన్‌ ప్రభుత్వం కుదేలు చేసింది. ఫలితంగా ఈ రంగంపై ఆధారపడిన లక్షల మంది ఉపాధిపై తీవ్ర ప్రభావం పడింది. తమను ఆదుకోవాలని వాహన యజమానులు ప్రభుత్వాన్ని ఎంత వేడుకున్నా పట్టించుకోలేదు. ఇప్పటికే తీవ్ర సంక్షోభంలో ఉన్న రవాణా రంగాన్ని ఆదుకోవాల్సింది పోయి అధిక పన్నులు వసూలు చేయడం సరికాదని లారీ డ్రైవర్లు, యాజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తెదేపా ప్రభుత్వ హయాంలో లారీ యజమానులు కట్టే హరిత పన్ను రూ.300ను జగన్‌ ప్రభుత్వం పది రెట్లు పెంచేసింది. సరకు రవాణా లారీలకు ఏడేళ్ల తర్వాత మాత్రమే గ్రీన్‌ ట్యాక్స్‌ చెల్లించాలి. కాలం చెల్లుతున్న వాహనాల సంఖ్య తగ్గించేందుకు కేంద్రం ఈ పన్ను విధించే వెసులుబాటు రాష్ట్రాలకు కల్పించింది. దీన్ని ఆసరాగా తీసుకున్న జగన్‌ సర్కారు గత ప్రభుత్వ హయాంలో కట్టే గ్రీన్‌ ట్యాక్స్‌ రూ.200ని అమాంతం రూ.26,800కి పెంచేసింది. త్రైమాసిక పన్ను కూడా 20 నుంచి 30 శాతానికి పెంచేసింది. అదే పొరుగు రాష్ట్రాల్లో గ్రీన్‌ ట్యాక్స్‌ కర్ణాటకలో రూ.200, తెలంగాణాలో రూ.500, తమిళనాడులో రూ.500 వసూలు చేస్తున్నాయి.

రూ.6 కోట్ల అదనపు భారం

ఉమ్మడి జిల్లా రైతులు వరితో పాటు ఉద్యాన పంటలు ఎక్కువగా పండిస్తుంటారు. చేపల ఉత్పత్తులూ ఇక్కడి నుంచి ఎక్కువగా ఇతర ప్రాంతాలు, రాష్ట్రాలకు రవాణా అవుతుంటాయి. గత ఏడాది జగన్‌ ప్రభుత్వం త్రైమాసిక పన్ను 20 నుంచి 30 శాతం వరకు పెంచింది. తద్వారా ఈ రెండేళ్లలో ప్రభుత్వానికి రూ.59 కోట్ల ఆదాయం వచ్చింది. పన్నుల పెంపుతో జిల్లాలోని అన్ని రకాల రవాణా వాహనాలపై ఏటా దాదాపు రూ.6 కోట్ల మేర అదనపు భారం పడుతుందని అంచనా. దీనికితోడు దేశంలో అన్ని రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలోనే డీజిల్‌ ధరలు అధికంగా ఉండటంతో గగ్గోలు పెడుతున్నారు.

ఎంత చెల్లించాలంటే..

  • 7 - 10 ఏళ్ల మధ్య వాహనాలకు ఓ త్రైమాసిక పన్ను విలువలో సగం చెల్లించాలి. అంటే లారీని బట్టి రూ.2,485 నుంచి రూ.6,715 మధ్య చెల్లించాల్సి ఉంటుంది.
  • 10 - 12 ఏళ్లలోపు ఉన్న వాహనాలకు త్రైమాసిక పన్ను చెల్లించాలి. ఈ లెక్కన రూ.4,970 - రూ.13,430 వరకు కట్టాలి.
  • 12 ఏళ్లు దాటిన వాటికి రెండో త్రైమాసిక పన్నును హరిత పన్నుగా చెల్లించాలి. అంటే రూ.9,940 - రూ.26,860 మేర చెల్లించాలి.  

ఒకప్పుడు యజమానిని

గత ప్రభుత్వ కాలంలో లారీకి యజమానిని. వైకాపా ప్రభుత్వం డ్రైవర్‌గా మార్చింది. అధిక పన్నులు కారణంగా లారీ నడపలేక అపరాధరుసుంలు కట్టలేక, సరైన పనులు లేక ఉన్న ఒక్కలారీని అమ్మేశా. వేరొకరి దగ్గర డ్రైవర్‌గా పనిచేస్తున్నాను. అది కూడా నెలలో 10 నుంచి 15 రోజులు మాత్రమే పని ఉంటుంది.

బి.యోహనరావు, డ్రైవర్‌, పాలకొల్లు.


లారీలు తుప్పు పడుతున్నాయి

పనులు లేక లారీలు స్టాండ్‌లో నిలపడంతో తుప్పు పడుతున్నాయి. బ్యాటరీలు కూడా డిశ్చార్జ్‌ అవుతున్నాయి. చిన్నపాటి కిరాయికి కూడా ఆటో డ్రైవర్ల మాదిరిగా పోటీపడి వ్యవహరించాల్సి వస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక్కోలారీకి నెలకు రూ.10వేలు ఎదురు పెట్టుబడి పెడుతున్నాం. దీనికితోడు ఉత్పత్తులు, కిరాయిలు కూడా తగ్గాయి. రైల్వే వ్యాగిన్లు వచ్చినప్పుడు మాత్రమే లారీలకు పని ఉంటుంది. ఆ తరువాత స్టాండ్‌లోనే నిలిపి ఉంచాల్సిన పరిస్థితి నెలకుంది.

దుగ్గిన రాము, లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, పాలకొల్లు .

ఉమ్మడి జిల్లాలో రవాణా వాహనాల సంఖ్య : 40 వేలు

ఆధారపడిన కుటుంబాలు (ప్రత్యక్షంగా, పరోక్షంగా): 4.50 లక్షలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని