logo

తీగలు కాటేస్తాయ్‌... ప్రాణాలు తీసేస్తాయ్‌!

విద్యుత్తు పంపిణీ సంస్థ ఎస్పీడీసీఎల్‌ ప్రమాదాల నియంత్రణలో నిర్లక్ష్యం వహిస్తోంది. విద్యుత్తు సరఫరా వ్యవస్థ నిర్వహణను పూర్తిగా గాలికొదిలేసింది. క్షేత్రస్థాయిలో అడుగడుగునా ప్రమాదాలు పొంచి ఉన్నా తన బాధ్యత కాదన్నట్లుగా వ్యవహరిస్తోంది. వినియోగదారులు,

Updated : 01 Jul 2022 05:57 IST
అస్తవ్యస్తంగా మారిన విద్యుత్తు వ్యవస్థ
నిర్వహణపై చేతులెత్తేసిన ఎస్పీడీసీఎల్‌
బలవుతున్న ప్రజలు, పశుపక్షాదులు
ఈనాడు డిజిటల్‌, కడప, న్యూస్‌టుడే బృందం

విద్యుత్తు పంపిణీ సంస్థ ఎస్పీడీసీఎల్‌ ప్రమాదాల నియంత్రణలో నిర్లక్ష్యం వహిస్తోంది. విద్యుత్తు సరఫరా వ్యవస్థ నిర్వహణను పూర్తిగా గాలికొదిలేసింది. క్షేత్రస్థాయిలో అడుగడుగునా ప్రమాదాలు పొంచి ఉన్నా తన బాధ్యత కాదన్నట్లుగా వ్యవహరిస్తోంది. వినియోగదారులు, రైతులు ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకోవడంలేదు. సిబ్బంది కొరతతో తరచూ ప్రమాదాలకు కారణమవుతోంది. ప్రజలతో పాటు పశుపక్షాదులు ప్రాణాలు కోల్పోతున్నాయి. గాయాలపాలైన వ్యక్తులు జీవితాంతం కష్టాలతో పోరాడాల్సి వస్తోంది. పొరుగున ఉన్న సత్యసాయి జిల్లాలో గురువారం ఉదయం జరిగిన విద్యుత్తు ప్రమాద దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలవరానికి గురిచేసింది.

మ్మడి కడప జిల్లాలో గత రెండేళ్లుగా తుపాన్లతో సుమారు 12 వేలకు పైగా విద్యుత్తు స్తంభాలు ప్రమాదకర స్థితిలో ఒరిగిపోయినట్లు గుర్తించినా ఇంతవరకు పునరుద్ధరించిన దాఖలాల్లేవు. ప్రధానంగా పంట పొలాల్లో స్తంభాలు, తీగలు రైతులను కలవరపెడుతున్నాయి. హై వోల్టేజీ డిస్ట్రిబ్యూషన్‌ సిస్టం (హెచ్‌వీడీఎస్‌) నియంత్రికలు ప్రతి రెండు వ్యవసాయ సర్వీసులకు ఒకటి వంతున అందుబాటులోకి వచ్చాయి. వీటికి హెచ్‌టీ లైన్ల ద్వారా విద్యుత్తు సరఫరా అవుతోంది. గతంలో పదుల సంఖ్యలో ఉన్న సర్వీసులను కలిపి ఒకచోట ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి ఎల్‌టీ లైను ద్వారా విద్యుత్తు సరఫరా జరిగేది. హెచ్‌టీ లైను అన్ని చోట్లకు విస్తరించడంతో ప్రమాదం మరింతగా పొంచి ఉన్న తరుణంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముంది. ఎస్పీడీసీఎల్‌లో క్షేత్రస్థాయి సిబ్బంది కొరతతో లైన్ల నిర్వహణపై నిఘా లేకుండాపోయింది. వేలాడుతున్న తీగలు, పాత లైన్లు, చెట్ల కొమ్మలు తగలడం, పరికరాలు పగిలిపోవడం, స్తంభాలు పాడైపోవడం తదితర సమస్యలు వెంటాడుతున్నాయి. ఏదైనా సమస్య వచ్చినా, స్తంభాలు మార్చాల్సి వచ్చినా, ఫిర్యాదు చేసినా స్పందించడంలేదు. ఒక వేళ సిబ్బంది వచ్చినా వినియోగదారులే నిర్వహణ ఖర్చులు భరించాల్సి వస్తోంది. ఆర్థిక ఇబ్బందులతో పరికరాల కొనుగోలు పూర్తిగా తగ్గుముఖం పట్టింది. లైన్ల నిర్వహణ లోపాలతో మనుషులు అందులోనూ ఎక్కువగా రైతులు మృత్యువాతపడుతున్నారు. చిన్నపాటి మరమ్మతులు ప్రజలే నిర్వహించుకునే ప్రయత్నంలో ప్రమాదాలకు గురవుతూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.


చిత్రంలో కనిపిస్తోంది రాయచోటి మండలం రెడ్డివారిపల్లె సమీపంలో పొలాలకు వెళ్లే మార్గంలో పూర్తిగా నేలకొరిగిన విద్యుత్తు స్థంభం. రాయచోటి నుంచి మాసాపేట మీదుగా వీరబల్లె మార్గంలో రెడ్డివారిపల్లె వద్ద ప్రధాన రహదారిలో నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. విద్యుత్తు స్తంభాలను సరిచేయాలని పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని రైతులు వాపోతున్నారు.


నిబంధనలు గుర్తు చేసుకుంటే...

* ఎల్‌టీ, హెచ్‌టీ లైన్లు కనిష్ఠంగా 19 అడుగుల ఎత్తులో ఉండాలి.

* వివిధ కట్టడాలు, వృక్షాల నుంచి కనీసం 4 అడుగుల దూరంలో ఏర్పాటు చేయాలి.

* నియంత్రికలను ఆరు అడుగుల ఎత్తులో అమర్చాలి.

* జనవాసాలు, రహదారుల వెంట ఉన్న నియంత్రికల చుట్టూ తప్పనిసరిగా కంచె ఏర్పాటు చేయాలి.

* వేలాడే తీగలను ఎప్పటికప్పుడు సరిచేయడం, తుప్పుపట్టిన, కాలం చెల్లిన స్తంభాలను మార్చడం వెంటనే చేపట్టాలి.


ఒంటిమిట్ట మండలం చింతరాజుపల్లె పంచాయతీలో విద్యుత్తు తీగలు వేలాడుతూ ప్రమాదకరంగా ఉన్నాయి. చాలామంది విద్యుత్తు నియంత్రిక, ప్రధాన లైను నుంచి కర్రలు ఏర్పాటు చేసుకొని వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్తు వినియోగిస్తున్నారు. కోమటిపల్లె రహదారిలో కర్రలపైనే విద్యుత్తు తీగలను ఏర్పాటు చేసుకున్న పరిస్థితిని చిత్రంలో చూడొచ్చు.


విద్యుత్తు తీగలు మెడకు చుట్టుకుని యువకుడి మృతి

పీలేరు గ్రామీణ: విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి చెందిన ఘటన గురువారం రాత్రి పీలేరు మండలంలో చోటు చేసుకుంది. ఎస్‌.ఐ. తిప్పేస్వామి కథనం మేరకు... పీలేరు పట్టణం ఎస్కేడీ నగర్‌కు చెందిన మోహన్‌కుమార్‌ (23) కావలిపల్లె పంచాయతీ ఒంటిల్లు గ్రామసమీపంలోని ఓ పెట్రోలు బంకులో పనిచేస్తున్నారు. గురువారం రాత్రి బంకు పక్కన ఖాళీ స్థలంలోకి వెళ్లగా వేలాడుతున్న విద్యుత్తు తీగలు మెడకు తగిలి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. చీకట్లో గమనించక పోవడంతో ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు న్నారు.


పెద్దముడియం మండలం జంగాలపల్లె-సుద్దపల్లె గ్రామాల రహదారి మధ్యలో విద్యుత్తు స్తంభం ఒరిగిపోయి ప్రమాదకరంగా మారింది. ఈ రహదారిలో నిత్యం వందల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుండడంతో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి.


బయటకొస్తే  భయం...

మాది వీధిలో 40 ఏళ్ల కిందట వేసిన విద్యుత్తు స్తంభాలే నేటికీ ఉన్నాయి. నడి వీధిలోకి విద్యుత్తు తీగలు వేలాడుతున్నాయి. కొత్త వారు రావాలంటే తీగలు చూసి భయపడుతున్నారు. వర్షం వస్తే ఇంటి నుంచి బయటకు రావాలంటే భయమేస్తోంది. ఎవరికి చెప్పినా సమస్య పరిష్కారం కావడంలేదు నెలవారీ బిల్లులు మాత్రం క్రమం తప్పకుండా వసూలు చేస్తున్నా సమస్యను మాత్రం పరిష్కరించడంలేదు.

-నసీబ్‌జాన్‌, సైదియాహాల్‌ వెనుకవీధి, రాయచోటి


భద్రతా చర్యలు తీసుకుంటాం

-చంద్రశేఖర్‌, ఎస్పీడీసీఎల్‌  జిల్లా ఇంజినీరింగ్‌ అధికారి

ప్రమాదకరంగా ఉన్న విద్యుత్తు తీగలు, స్తంభాలను పరిశీలించి దెబ్బతిన్న వాటిని తొలగిస్తాం. వీధుల్లో స్తంభాలు నాటేందుకు అవసరమైన స్థలాలిచ్చేందుకు ప్రజలు సహకరించడం లేదు. ప్రమాదకర ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి నివారణ చర్యలు చేపడతాం.


లైన్లపై అధ్యయనం చేస్తాం

-శోభా వాలంటైనా, ఎస్‌ఈ, ఎస్పీడీసీఎల్‌

ఉమ్మడి కడప జిల్లాలోని అన్ని లైన్లను అధ్యయనం చేస్తాం. ప్రమాదకరంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి నివారణ చర్యలు తీసుకుంటాం. పరికరాలు, స్తంభాలు పాడైపోయి ఉంటే వెంటనే మారుస్తాం. ప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని క్షేత్ర స్థాయి సిబ్బందిని ఆదేశించాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని