logo

Ponguleti Srinivas: కార్పొరేట్‌ స్థాయిలో సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలు: మంత్రి పొంగులేటి

Eenadu icon
By Telangana Dist. Team Published : 02 Aug 2025 19:03 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

హైదరాబాద్‌: తెలంగాణలో సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలను పునర్‌వ్యవస్థీకరిస్తున్నట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. కార్పొరేట్‌ స్థాయిలో శాశ్వత భవనాలను నిర్మించాలని నిర్ణయించినట్లు తెలిపారు. నాలుగు జిల్లాల్లో 9 ఇంటిగ్రేటెడ్ స‌బ్ రిజిస్ట్రార్ భ‌వ‌నాలు నిర్మించనున్నట్టు చెప్పారు. త్వర‌లో గ‌చ్చిబౌలిలో భ‌వ‌న నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే స్లాట్ బుకింగ్ విధానాన్ని తీసుకొచ్చి ప్రజ‌ల‌కు మెరుగైన సేవ‌లు అందిస్తున్న స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ.. ప్రజలకు మరింత సమర్థంగా సేవలందించేందుకే మరో అడుగు ముందుకు వేస్తున్నట్లు వెల్లడించారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులతో సచివాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు.

‘‘ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా ప్రజ‌ల‌కు ఎలాంటి అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా, ప‌రిపాల‌న‌కు ఇబ్బంది లేకుండా సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల పునర్‌వ్యవస్థీకరణ, కొత్త భవనాల నిర్మాణం ఉండాలి. అంతిమంగా ప్రజ‌ల సంతృప్తే ప్రధాన‌ం అనే అంశాన్ని అధికారులు దృష్టిలో పెట్టుకోవాలి. ప్రస్తుతం రాష్ట్రంలో 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండగా వాటిలో 37 మాత్రమే సొంత భవనాల్లో ఉన్నాయి. మిగిలినవన్నీ అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితిని మార్చేందుకు అన్ని సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలను కార్పొరేట్ స్థాయిలో ఆధునిక సౌకర్యాలతో దశలవారీగా నిర్మించాల‌ని భావిస్తున్నాం. మొదటి విడ‌త‌లో ఔట‌ర్ రింగ్ రోడ్డు సమీపంలో 4 లేదా 5 స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల‌ను భ‌విష్యత్తు అవ‌స‌రాల‌ను అనుగుణంగా ఒకే చోట ఇంటిగ్రేట్‌ చేసేలా భవనాన్ని నిర్మించాల‌ని నిర్ణయించాం. ఆయా జిల్లాల కలెక్టర్లతో సమన్వయం చేసుకొని ఇందుకు అవసరమైన భూమిని గుర్తించాలి. ఇంటిగ్రేటెడ్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల వల్ల పనితీరు మెరుగుపడడమే కాకుండా పర్యవేక్షణ సులభమవుతుంది. అవినీతిని కూడా తగ్గించవచ్చు’’ అని పొంగులేటి అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు