logo

Hydra NOC: హైడ్రాలో దరఖాస్తు విధానంతో తిప్పలు.. ఎన్వోసీ కావాలంటే కాళ్లరగాల్సిందే!

Eenadu icon
By Telangana Dist. Team Updated : 18 Nov 2024 08:40 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఈనాడు- హైదరాబాద్‌ 

వాణిజ్య భవనాలను ఎన్వోసీ(నిరభ్యంతర పత్రం) కష్టాలు వెంటాడుతున్నాయి. ఒకప్పుడు జీహెచ్‌ఎంసీలో అగ్నిమాపక విభాగం ఉండేది. 15మీటర్ల ఎత్తు వరకుండే భవనాలకు ఎన్వోసీల జారీ అక్కడే జరిగేది. హైడ్రా ఏర్పాటుతో.. జీహెచ్‌ఎంసీలోని ఈవీడీఎం(ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌) విభాగం అందులోకి వెళ్లింది. ప్రస్తుతం హైడ్రానే ఈ ధ్రువీకరణ ఇస్తోంది.  

దరఖాస్తు చేయడం నుంచే..

నిర్మాణ అనుమతి దరఖాస్తులన్నీ కొన్నేళ్లుగా ఆన్‌లైన్‌ ద్వారానే జరుగుతున్నాయి. జీహెచ్‌ఎంసీ(GHMC), హెచ్‌ఎండీఏ, డీటీసీపీ అధికారులు ఆన్‌లైన్‌లో సరిచూసుకుని, నిర్మాణ అనుమతులు, నివాసయోగ్య పత్రాలు అందజేస్తున్నారు. హైడ్రా (Hydra) వద్ద ఎన్వోసీ కోసం దరఖాస్తు చేసే ప్రక్రియ క్లిష్టతరంగా ఉందంటున్నారు. కార్యాలయానికి వెళ్లి రిసెప్షన్‌లో అభ్యర్థిస్తే.. అక్కడుండే సిబ్బంది అధికారులకు ఫోన్‌ చేసి, వారు అనుమతించాకే దరఖాస్తుదారులకు పత్రాలు ఇస్తారు. బ్యాంకులో చలానా కట్టి, పత్రాల్లో వివరాలన్నీ నింపి మళ్లీ అదే సిబ్బందికి దరఖాస్తు అందజేయాలి. దాన్ని హైడ్రా కమిషనర్‌ పరిశీలించాక.. ఈ-ఆఫీసులో దస్త్రం సంబంధిత అధికారులకు వెళ్తుంది. ఈ ప్రక్రియలో అడుగడుగునా జాప్యంతో, నెలల పాటు ఎన్వోసీలు జారీ కావట్లేదని పలువురు వాపోతున్నారు. భౌతికంగా దరఖాస్తు విధానం, జాప్యం అవకతవకలకు తావిస్తోందన్న ఆరోపణలున్నాయి. 

వారికి ఎన్వోసీలే ఇవ్వట్లేదు..

మూడు, నాలుగు అంతస్తుల భవనాలను నిర్మించేప్పుడు చాలామంది ఇంటి కేటగిరీలో అనుమతి తీసుకుంటారు. నిర్మాణం పూర్తయ్యాక ఆస్పత్రులు, పాఠశాలలు, హాస్టళ్లు, కళాశాలలు, రెస్టారెంట్లు, ఇతరత్రా వ్యాపారకేంద్రాలు ఏర్పాటుచేస్తారు. ఇలాంటి భవనాలు.. వినియోగం మారగానే ఫైర్‌ ఎన్వోసీ కోసం హైడ్రాను సంప్రదిస్తున్నారు. అలాంటి వాటికి ఇచ్చేందుకు నిబంధనలు అంగీకరించవని దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు. ఇటీవల అగ్ని ప్రమాదానికి గురైన రూబి హోటల్, డెక్కన్‌మాల్‌ ఆ కోవలేనివే కావడం గమనార్హం.


ఒకరికే అన్నింటి పరిధి..

చిన్న, పెద్ద అనే తేడా లేకుండా.. అన్ని రకాల ఎన్వోసీల జారీ అధికారాన్ని రాష్ట్ర అగ్నిమాపక శాఖకు అప్పగించాలని, లేదంటే అనుమతి ఇచ్చే సంస్థల పరిధిలో ఆ శాఖ అధికారులను నియమించి.. ఒకే దరఖాస్తు ద్వారా అన్ని అనుమతులు వచ్చేలా విధానాన్ని మార్చాలని నిర్మాణదారులు డిమాండ్‌ చేస్తున్నారు. 

Tags :
Published : 18 Nov 2024 08:32 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు