logo

MLC Kavitha: రాష్ట్రానికి నష్టం జరుగుతుంటే ‘తెలంగాణ జాగృతి’ ఊరుకోదు: కవిత

Eenadu icon
By Telangana Dist. Team Published : 26 Jul 2025 16:28 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

కుత్బుల్లాపూర్‌: తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘లీడర్‌’ శిక్షణ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కొత్త నాయకత్వాన్ని పెంపొందించాలనుకుంటున్నట్లు చెప్పారు. కాలానుగుణంగా తెలంగాణ జాగృతి తన పంథాను మార్చుకుందని అన్నారు. మన సంప్రదాయాలు, కట్టుబాట్లపై అవగాహన కల్పించుకోవడమే లీడర్‌ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని చెప్పారు. ‘‘ఎప్పుడూ కొత్తగా ఉంటేనే  సంస్థలు బతుకుతాయి. తల్లి గర్భంలో నుంచి ఎవరూ నాయకత్వ లక్షణాలతో పుట్టరు. నేర్చుకుంటూ, మార్చుకుంటూ ముందుకెళ్లేవాడే నాయకుడవుతాడు తప్ప.. మూస పద్ధతిలో కొనసాగేవాడు నాయకుడు కాలేడు.

సామాజిక స్పృహ కలిగిన రాష్ట్రాల్లో తెలంగాణ 11 స్థానంలో ఉందని ఓ సర్వేలో తేలింది. తోటివారి గోప్యతకు, మర్యాదకు భంగం వాటిల్లకుండా పదునైన విమర్శలు చేయడం నేర్చుకోండి. పక్కవాడిని తిడుతున్నారంటే కంటెంట్ లేనట్లు అర్థం. మహాత్మాగాంధీ ఎప్పుడూ ఎమ్మెల్యేగానో, ఎంపీగానో లేరు. కానీ, ఇప్పటికీ ఆయన్ని గుర్తు చేసుకుంటాం. తెలంగాణ జాగృతి నుంచి గాంధీగిరీకి కొత్త భాష్యం చెప్పాల్సిన అవసరం ఉంది. సాంస్కృతిక నేపథ్యం లేకుండా ఏ జాతీ మనుగడ సాధించలేదు. సాంస్కృతిక నేపథ్యం లేని జాతి.. పునాది లేకుండా కట్టిన బిల్డింగ్‌ లాంటిది. తెలంగాణ జాతికి అద్భుతమైన నేపథ్యం ఉంది. దానిని పరిరక్షించేందుకే  ‘జాగృతి’ పని చేస్తుంది.

తెలంగాణ ఉద్యమ కాలంలో యాసను అవహేళన చేసిన ఓ వ్యక్తికి నంది అవార్డు ఇవ్వడాన్ని నిరసించిన ఒకే ఒక సంస్థ తెలంగాణ జాగృతి. నమ్మిన సిద్ధాంతం కోసం ఎంత పెద్ద వ్యక్తులైనా, ఎంత పెద్ద సమస్య అయినా ఎదురొడ్డి నిలిచిన సంస్థ ఇది. తెలంగాణ రాకముందు రాష్ట్రం కోసం పని చేశాం. వచ్చిన తర్వాత ప్రజల అభివృద్ధి కోసం పని చేశాం. రాష్ట్రానికి నష్టం జరుగుతుంటే తెలంగాణ జాగృతి ఊరకోబోదు’’ అని కవిత అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని