logo

Uttam Kumar Reddy: ప్రాధాన్యతా క్రమంలో ప్రాజెక్టులు పూర్తి చేస్తాం: మంత్రి ఉత్తమ్‌

Eenadu icon
By Telangana Dist. Team Published : 17 Jul 2024 18:51 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

హైదరాబాద్‌: ఈ ఏడాది రూ.10 వేల నుంచి రూ.11వేల కోట్లు వెచ్చించి కొత్తగా 6.5లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తామని తెలంగాణ భారీ నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఎర్రమంజిల్‌ జలసౌధలో అధికారులతో ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రతిష్టాత్మక పాలమూరు-రంగారెడ్డి, నెట్టెంపాడు, బీమా, నారాయణపేట-కొడంగల్‌ ప్రాజెక్టుల నిర్మాణం, పురోగతిపై విస్తృతంగా చర్చించారు. గుత్తేదారులు సకాలంలో పనులు చేస్తున్నారా? లేదా? అని అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలం నేపథ్యంలో పనుల్లో వేగం పెంచాలని సూచించారు. ప్రాధాన్యతల వారీగా పాలమూరు-రంగారెడ్డి, కొడంగల్‌, అచ్చంపేట, పాలెంవాగు, మత్తడివాడు, ఎస్‌ఆర్‌ఎస్‌పీ-2, చిన్న కాళేశ్వరం, శ్రీపాద, లోయర్‌ పెన్‌గంగ  ప్రాజెక్టుల నిర్మాణం మార్చి వరకు పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్‌ ప్రకటించారు.  

ఇటీవల మహబూబ్‌నగర్‌లో జరిగిన ఉమ్మడి జిల్లా నీటిపారుదల ప్రాజెక్టుల సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీల అమలు కోసం కోయల్‌సాగర్‌, కల్వకుర్తి వంటి ఎత్తిపోతల పథకాల నిర్మాణం, ఇతర ప్రాజెక్టుల నిర్మాణం 100శాతం పూర్తి చేయడంపై ఈ సమీక్షలో చర్చించినట్లు తెలిపారు. ఈ మేరకు ఇంటీరియం బడ్జెట్‌ కింద రూ.28వేల కోట్లు కేటాయించాలని ఆర్థిక శాఖను కోరాలని నిర్ణయించినట్లు చెప్పారు. వీటిలో రూ.18వేల కోట్లు గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీ చెల్లించడంతోపాటు మరో రూ.2వేల కోట్ల ఉద్యోగుల వేతనాలు, పింఛన్లకు పోగా.. రూ. 8వేల కోట్లు కొత్త ప్రాజెక్టుల పనుల కోసం కేటాయింపు చేస్తామని స్పష్టం చేశారు. నీటి పారుదల శాఖలో తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీరందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఇరిగేషన్‌ శాఖలో పదోన్నతులు, బదిలీలు త్వరలోనే చేపడతామని ఉత్తమ్‌ చెప్పారు.

ఈనెల 20న నీటిపారుదశాఖ సలహాదారు, ముఖ్య కార్యదర్శి, నిపుణుల కమిటీ సభ్యులు, ఈఎన్‌సీ దిల్లీకి వెళ్లి నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ ఛైర్మన్‌తో సమావేశమవుతామని తెలిపారు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు దృష్ట్యా వరదలు రాని నేపథ్యంలో ఎన్‌డీఎస్‌ఏ సిఫారసు మేరకు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్‌లపై తీసుకున్న చర్యలు, పెండింగ్‌ అంశాలు, ఆనకట్టల భద్రతపై చర్చిస్తామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని