logo

Chandrababu: గత పాలకుల అహంభావంతో పోలవరానికి తీవ్ర నష్టం: సీఎం చంద్రబాబు

Eenadu icon
By Andhra Pradesh Dist. Team Updated : 27 Mar 2025 16:56 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

పోలవరం: గత పాలకుల అహంభావం, తెలియనితనం, రాజకీయ వివక్షతో పోలవరం ప్రాజెక్టుకు నష్టం వాటిల్లిందని సీఎం చంద్రబాబు (Chandrababu) విమర్శించారు. గోదావరి జలాల్లో 2 వేల టీఎంసీలు సముద్రంలోకి వెళ్తున్నాయని, అందులో 400 టీఎంసీలను వాడుకుంటే ఏపీని కరవు రహితం చేయవచ్చని అన్నారు. దీని కోసం ప్రాజెక్టు కట్టాలని 1941లోనే ప్రణాళికలు సిద్ధమయ్యాయని, అప్పుడు కట్టలేక ధవళేశ్వరం బ్యారేజీ కట్టారని గుర్తు చేశారు. గురువారం పోలవరం ప్రాజెక్టును సందర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

‘‘విభజన చట్టంలో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా పెట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రెండు రాష్ట్రాలుగా ఏర్పడటానికి జూన్‌ 2 డెడ్‌లైన్‌గా ఉంది. ఏడు మండలాలు తెలంగాణలో ఉంటే ప్రాజెక్టు పూర్తికాదు. జూన్‌ 2 దాటితే రెండు రాష్ట్రాలు బిల్లును ఆమోదించాలి. ఆ ఏడు మండలాలను ఏపీకి ఇవ్వడం ప్రాజెక్టుకు దోహదమైంది. ప్రాజెక్టును పూర్తి చేయగలమనే ధీమాతో ముందుకెళ్లాం. పోలవరం ప్రాజెక్టును 73 శాతం పూర్తి చేశాం. పోలవరంపై 82 సార్లు వర్చువల్‌గా సమీక్షించాను. ప్రాజెక్టు ఆలస్యమవుతుందని పట్టిసీమ నిర్మాణం చేపట్టాం. ఎడమ ప్రధాన కాలువ పనులు కూడా వేగవంతం చేశాం. వైకాపా హయాంలో జరిగిన తప్పు.. చరిత్ర క్షమించరాని నేరం. జాతీయ ప్రాజెక్టు, ప్రజల ఆస్తిని నాశనం చేసే హక్కు ఎవరికీ లేదు.

గతంలో డయాఫ్రమ్‌ వాల్‌ దెబ్బతిన్న సంగతి కూడా ఎవరికీ తెలియదు. కాఫర్‌డ్యామ్‌ సకాలంలో పని చేసి ఉంటే ఇంత నష్టం జరిగేది కాదు. ఊహించని నష్టం జరిగింది. ఐదేళ్లు ఏమీ చేయలేని పరిస్థితి. పీపీఏ అథారిటీ, కేంద్ర ప్రభుత్వం ముందే చెప్పినా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు. ఒకసారి ఓట్లేసినందుకు రాష్ట్రానికి జీవనాడి లాంటి ప్రాజెక్టు దెబ్బతినే పరిస్థితి తీసుకొచ్చారు. పోలవరం విషయంలో నిపుణుల కమిటీ పరిశీలించింది. దెబ్బతిన్న డయాఫ్రమ్‌ వాల్‌ మళ్లీ నిర్మించాలని నిర్ణయించాం. రాజకీయ కక్షలతో రివర్స్‌ టెండర్ల పేరుతో ప్రాజెక్టుపై కక్ష తీర్చుకున్నారు. డయాఫ్రమ్‌వాల్‌ నిర్మాణానికి రూ.990 కోట్లు ఖర్చవుతోంది. 2020లో పూర్తి కావాల్సిన ప్రాజెక్టు 2027 డిసెంబర్‌కు పూర్తయ్యే పరిస్థితి ఏర్పడింది’’ అని చంద్రబాబు అన్నారు.

Tags :
Published : 27 Mar 2025 16:52 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు