మహిళలపై దారుణ దాష్టీకాలు

అసమానతలూ దుర్విచక్షణలతో నిండిన సాంఘిక వ్యవస్థ మనది. వ్యక్తుల ప్రాథమిక హక్కులను హరించడం దాని దుర్లక్షణం. అటువంటి వ్యవస్థను సంస్కరించుకొన్నప్పుడే మన స్వాతంత్య్రం సార్థకమవుతుందని రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ ఏనాడో ఉద్ఘాటించారు. కాలగతిలో ఏడున్నర దశాబ్దాలు దొర్లిపోయాయి కానీ- బాబాసాహెబ్‌ ఆశించిన ‘స్వేచ్ఛాభారతం’ ఇంతవరకు ఆవిష్కృతం కాలేదు.

Published : 07 Dec 2023 00:03 IST

అసమానతలూ దుర్విచక్షణలతో నిండిన సాంఘిక వ్యవస్థ మనది. వ్యక్తుల ప్రాథమిక హక్కులను హరించడం దాని దుర్లక్షణం. అటువంటి వ్యవస్థను సంస్కరించుకొన్నప్పుడే మన స్వాతంత్య్రం సార్థకమవుతుందని రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ ఏనాడో ఉద్ఘాటించారు. కాలగతిలో ఏడున్నర దశాబ్దాలు దొర్లిపోయాయి కానీ- బాబాసాహెబ్‌ ఆశించిన ‘స్వేచ్ఛాభారతం’ ఇంతవరకు ఆవిష్కృతం కాలేదు. సరికదా, లింగపరమైన దుర్విచక్షణలకు పాలుపోసే పితృస్వామిక భావజాలం దేశీయంగా వెర్రితలలు వేస్తోంది. పోనుపోను మృగాళ్ల కోరలకు అది మరింతగా పదునుపెడుతోంది. ఇంటా బయటా మరెక్కడా మహిళలకు భద్రత అన్నదే లేకుండా చేస్తోంది. జాతీయ నేర గణాంక సంస్థ(ఎన్‌సీఆర్‌బీ) లెక్కల మేరకు- 2012లో దేశవ్యాప్తంగా స్త్రీలపై 2.44లక్షల అకృత్యాలు చోటుచేసుకున్నాయి. ఎన్‌సీఆర్‌బీ తాజా నివేదిక ప్రకారం- 2022లో ఆసేతుహిమాచలం మహిళలపై 4.45లక్షల నేరాలు జరిగాయి. అంటే- నిరుడు గంటకు సుమారు 51మంది భారతీయ వనితలు ఏదో ఒక అఘాయిత్యానికి గురయ్యారు. ఆ అభాగినుల్లో ఎక్కువ మంది గృహహింస పీడితులు. అపహరణలూ అత్యాచారాలవంటి దారుణ అకృత్యాలకు బాధితులైనవారూ గణనీయంగా ఉన్నారు. స్త్రీలపై దాష్టీకాలకు ఆలవాలాలుగా యూపీ, రాజస్థాన్‌, మహారాష్ట్ర, పశ్చిమ్‌ బెంగాల్‌, మధ్యప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌ పరువుమాశాయి. జగన్‌ ఏలుబడిలోని ఏపీ- అతివల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన కేసుల పరంగా దేశంలోనే మొదటిస్థానంలో నిలిచి తరగని దుష్కీర్తిని మూటగట్టుకుంది. మహిళల గౌరవమర్యాదలకు భంగకరమైన పనులు కూడదన్న రాజ్యాంగ ప్రమాణానికి పాతరేసే దుస్థితి ఇది. స్త్రీలను దేవతా స్వరూపాలుగా భావించే భారతీయ సంస్కృతికి అత్యంత అప్రతిష్ఠాకరమిది!

స్త్రీల అభ్యున్నతే భారతావని ప్రగతికి దారిదీపం కాగలదని ప్రధాని మోదీ కొద్దిరోజుల క్రితం ఆకాంక్షించారు. ఆ మేరకు ఆర్థిక కార్యకలాపాల్లో అతివల భాగస్వామ్యం ఇనుమడించాలంటే- దేశీయంగా సురక్షిత వాతావరణం నెలకొనాలి. కానీ, పనిప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధ చట్టం అమలులో తీవ్రస్థాయి లోపాలు మేట వేశాయని సుప్రీంకోర్టే ఇటీవల ఆందోళన వ్యక్తంచేసింది. భారతీయ యువ ఉద్యోగినుల్లో సగం మందికి పైగా వికృత వేధింపులను ఎదుర్కొంటున్నారని ‘విక్కీ’ (ఉమెన్స్‌ ఇండియన్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ) సర్వే లోగడ వెలుగులోకి తెచ్చింది. పర్యవసానాల మీద భయంతో బాధితురాళ్లలో అత్యధికులు ఫిర్యాదులు చేయలేకపోతున్నారు. కార్యాలయాల్లో కీచకుల పీడ భరించలేక ఎందరో మహిళలు ఉద్యోగాలకు దూరమవుతున్నారు. ఎక్కడికక్కడ పోగుపడిన నరరూప రాక్షసులు  పసిపిల్లలపైనా ఘోర కృత్యాలకు తెగబడుతున్నారు. మైనర్ల సంరక్షణకు ఉద్దేశించిన ‘పోక్సో’ చట్టం కోరల్లేని పామవుతోంది. ఈ ఏడాది జనవరి నాటికి దాని కింద నమోదైన 2.43 లక్షల కేసులు అపరిష్కృతంగా మూలుగుతున్నాయి. ఎన్‌సీఆర్‌బీ నివేదిక మేరకు దేశవ్యాప్తంగా మహిళలపై నేరాలకు సంబంధించి 6.50 లక్షల కేసులు పోలీసు దర్యాప్తు దశలోనే మగ్గిపోతున్నాయి. మరో 21.84 లక్షల కేసులు కోర్టుల్లో పెండింగ్‌లో పడిఉన్నాయి. విచారణలు సకాలంలో పూర్తయ్యి నేరగాళ్లకు శిక్షలు పడే పరిస్థితి కొరవడటం- మహిళల జీవితాలను దినదినగండంగా మారుస్తోంది. ఆ దారుణావస్థను పరిమార్చేందుకు తగిన వ్యవస్థాగత చర్యలు తీసుకోవడంతోపాటు నవతరంలో నైతిక విలువలు ప్రోదిచేసే విద్యకు ప్రభుత్వాలు ప్రాధాన్యమివ్వాలి. మహిళా సాధికారతకు బాటలుపరుస్తూ- ‘అభద్ర భారతావని’ అన్న అపప్రథను చెదరకొట్టాలి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.