కలి చరిత్ర

నిప్పును కనిపెట్టడం- నాగరికతకు ఓంకారం. చక్రం రూపొందడం- పారిశ్రామిక ప్రగతికి శ్రీకారం. అంతర్జాలాదుల ఆవిష్కరణం- నవయుగానికి సాకారం. ‘యంత్రాలను తిప్పినం... ఉత్పత్తులు పెంచినం’ అంటూ విప్లవకవి చెరబండరాజు ఆలపించింది- నిశ్చయంగా వైతాళిక గీతమే.

Updated : 31 Mar 2024 01:31 IST

నిప్పును కనిపెట్టడం- నాగరికతకు ఓంకారం. చక్రం రూపొందడం- పారిశ్రామిక ప్రగతికి శ్రీకారం. అంతర్జాలాదుల ఆవిష్కరణం- నవయుగానికి సాకారం. ‘యంత్రాలను తిప్పినం... ఉత్పత్తులు పెంచినం’ అంటూ విప్లవకవి చెరబండరాజు ఆలపించింది- నిశ్చయంగా వైతాళిక గీతమే. ‘రాత్రి అంతా నేను చీకటిని చిలికితే తూర్పున పడింది వెలుగువెన్న’ అని ప్రసిద్ధకవి పతంజలి శాస్త్రి చెప్పినట్లు- ఎందరో మహానుభావులు మానవ అభ్యుదయానికి చిరకాలం తమ బతుకులను ముడుపు కడితే ఈ అద్భుతం సంభవించింది. ఇంతటి ప్రగతి సాధ్యమైంది. ‘నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను’ అన్న మహాకవి తరహా పూనికతో అహోరాత్రాలు అదేపనిగా పాటుపడితేనే- ఈ స్వప్నం సాకారమైంది. ఈ వైభవం ఆవిష్కారమైంది. సృష్టికి ప్రతిసృష్టి చేసిన విశ్వామిత్రుడి వృత్తాంతాన్ని రామాయణం వర్ణించింది. సురగంగను నింగి నుంచి నేలకు దింపిన భగీరథుడి బ్రహ్మ యత్నాన్ని భారతం వివరించింది. విశ్వామిత్ర సృష్టి, భగీరథ ప్రయత్నాలనేవి ప్రతిభకు, శ్రమకు గీటురాళ్లుగా లోకం సంభావించింది. వాటిని నానుడులుగా మార్చింది. వాస్తవానికి ఆధునిక శాస్త్రవేత్తల అపారకృషీ అంతటిదే. నేటి ఈ నిరుపమాన శాస్త్ర పురోగతికి అధునాతన సాధన సంపత్తికి వాటి ఆవిష్కృతికి కారణమైన మూలపురుషులను సైతం మనం మహర్షులుగానే పరిగణించాలి. ‘అద్భుతములు సృష్టి చేసిరి అవనీస్థలిలో’ అంటూ అంజలించాలి. వారి స్ఫూర్తితో లోకకల్యాణ కాంక్షను త్యాగనిరతిని ఆదర్శంగా స్వీకరించి ముందుకు సాగాలి. ఏ కాలంలోనైనా మహర్షుల ఆశయం- మానవ వికాసమే తప్ప విధ్వంసం కాదు. వారి తపన, తపస్సులు ప్రజల కడుపులు నింపాలనేగాని, మనిషి ఆబను తీర్చాలని కాదు. ప్రస్తుతం జరుగుతున్నది దానికి పూర్తిగా విరుద్ధం. నడుస్తున్నది ప్రకృతికి మనిషికి మధ్య యుద్ధం. మనిషి అత్యాశ అందుకు కారణం!

నేల నిప్పు గాలి నీరు నింగి... అనేవి పంచభూతాలు. ‘మనిషి దేహం- పాంచభౌతికం’ అంది శాస్త్రం. ‘పంచభూతాల సమాహారమే ఈ ప్రకృతి’ అంది ప్రాచీన సాహిత్యం. మనిషి ఈ పరమ సత్యాన్ని విస్మరించాడు. పంచభూతాల్లో దేన్నీ సజావుగా, సహజంగా మననీయడంలేదు. ‘మనిషి ఎక్కడున్నా విచ్ఛిన్నమే! అడుగిడిన ప్రతిచోటా పర్యావరణ విధ్వంసమే’ అని ‘మనిషి-ప్రకృతి’ గ్రంథంలో పెర్కిన్స్‌ మార్ష్‌ మానవ ప్రవృత్తిని తీవ్రంగా నిరసించాడు. మనం పట్టించుకోవడంలేదు. ‘అడవులు నరికేశాం... కొండలు తరిగేశాం... చెట్లను కూల్చేశాం... తాపం పెంచేశాం...’ అనేది ఇప్పటి మన అభ్యుదయ గీతం. నేటి యథార్థ స్థితిని ప్రముఖ కవి జొన్నవిత్తుల మాటల్లో చెప్పాలంటే- ‘విజ్ఞాన వేదాంత విద్యా వివేకాలు వెలియైన బలియైన కలి చరిత్ర... మతులు కల్గియు లేనట్టి మన చరిత్ర- కఠిన కాలుష్యభూతాల హఠ చరిత్ర’ ఇది పచ్చినిజం. తినే తిండి తాగే నీరు పీల్చే గాలి... కాదేదీ నేడు కాలుష్యానికి దూరం! ‘ముఖ్యంగా చిన్నారులను కాలుష్యభూతం తీవ్రంగా వేధిస్తోంది’ అంటున్నారు ‘లిటిల్‌స్టార్స్‌’ శిశు వైద్య నిపుణులు. వివిధ శ్వాసకోశ వ్యాధుల ఫలితంగా పిల్లలు నిద్రలేమితోపాటు పలు అనారోగ్య సమస్యలకు లోనవుతున్నారని వారి పరిశోధనలో తేలింది. తన స్వార్థంకోసం భవిష్యత్తును మనిషి తాకట్టు పెట్టాడని, రాబోయే తరాలకు తీరని ద్రోహం చేశాడని దాని అర్థం. వివరించబోతే- గుండె బరువవుతుంది, చెరువవుతుంది, మనశ్శాంతి కరవవుతుంది. ఇప్పటికైనా మేలుకోకుంటే ఉనికి సర్వనాశనమవుతుంది. నిజం చెప్పాలంటే- నేటి మనిషి బాగా డబ్బున్న బిచ్చగాడు... పంచభూతాలను అంగడి సరకులుగా మార్చిన బేహారి... ‘పెక్కుభంగుల్‌ వివేక భ్రష్ట సంపాతముల్‌’ అన్న భర్తృహరి మాటను నిజం చేసిన, అతితెలివి ఒలకబోస్తున్న అవివేకి!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.