జగన్‌ బులెట్లకు ఐటీ బలి!

వినాశకాలం దాపురించినప్పుడు విపరీత బుద్ధులు పుడతాయన్న నానుడి వైకాపా ఏలుబడిలో రివర్స్‌ అయింది. జగన్‌ విపరీత బుద్ధుల కారణంగానే రాష్ట్రానికి అయిదేళ్లుగా వినాశకాలం దాపురించింది.

Published : 17 Apr 2024 01:24 IST

వినాశకాలం దాపురించినప్పుడు విపరీత బుద్ధులు పుడతాయన్న నానుడి వైకాపా ఏలుబడిలో రివర్స్‌ అయింది. జగన్‌ విపరీత బుద్ధుల కారణంగానే రాష్ట్రానికి అయిదేళ్లుగా వినాశకాలం దాపురించింది. దేశ జీడీపీలో 55 శాతం వాటా సేవల రంగానిదే. తెలంగాణ ప్రగతికి చుక్కానిగా ఎదిగిన ఐటీని ఏపీలోనూ సువ్యవస్థితం చేసి సత్వర అభివృద్ధికి బాటలు వేయాలన్న చంద్రబాబు సంకల్పం బుడిబుడి అడుగుల దశ దాటుతున్న వేళ వైకాపా అధికారానికి వచ్చింది. ప్రాథమికంగా లక్ష ఉద్యోగాల కల్పన, 200 కోట్ల డాలర్ల పెట్టుబడులు లక్ష్యంగా తెదేపా హయాములో సాగిన విధాన రచన- 2018లో ఐటీ స్టార్టప్స్‌ ర్యాంకింగ్స్‌లో ఏపీని ప్రథమ స్థానంలో నిలబెట్టింది. చంద్రబాబు చేసిన మంచిని కసిగా తుంచేయడమే పనిగా పెట్టుకున్న జగన్‌- పాత విధానానికి పాతరేసి, కొత్త పాలసీని గొప్పగా ఆవిష్కరించారు. ఏపీ ఐటీ పాలసీ 2021-24లో సకల సౌకర్యాలు, మౌలిక సదుపాయాలతో రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో కాన్సెప్ట్‌ సిటీలు అభివృద్ధి చేస్తామన్నారు. మానవ వనరుల లభ్యత, నివాస ప్రాంతాల పురోగతికి ప్రతిజ్ఞ చేసినా- ఒక్కచోట అయినా కాన్సెప్ట్‌ సిటీ సిద్ధమైందా, అంటే- లేదు! విశాఖపట్నంలో ఐటీ పరిశోధనా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసి యువతను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామన్న వాగ్దానానికీ అతీగతీ లేదు. ఐటీ పాలసీలో పేర్కొన్న ఇంటిగ్రేటెడ్‌ టెక్నాలజీ పార్కు కాగితాల్లోనే ముణగదీసుకొంది. ఏపీలో యాక్సిలరేటెడ్‌ స్టార్టప్స్‌ పథకంతో అంకుర సంస్థల ప్రోత్సాహం, రూ.100 కోట్లతో ‘ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్‌’ నిధి, ఔత్సాహికులకు శిక్షణ వంటివన్నీ జగన్‌ పుణ్యమా అని నిద్రపోతున్నాయి. ఫలితంగా దేశ ఐటీ మానవ వనరుల్లో 10శాతంగా ఉన్న రాష్ట్ర యువజనం బతుకు తెరువుకోసం హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు లేదా విదేశాలకు వలస వెళుతున్నారు. బహుళజాతి కార్పొరేషన్లకు దీటుగా దేశదేశాల్లో పాగా వేస్తున్న భారత టెక్‌ దిగ్గజాలు- జగన్‌ పాలనకు వెరచి ఏపీకి మొహం చాటేయడం రాష్ట్రానికే నగుబాటు!

దశాబ్దాల క్రితం ఎటూ పాలుపోని దశలో ఉన్న సింగపూర్‌ను లీ క్వాన్‌ యూ దార్శనిక నాయకత్వం నేడు ధనిక రాజ్యాల వరసలో నిలబెట్టింది. చంద్రబాబు సింగపూర్‌ నమూనాను అవహేళన చేసిన జగన్‌ జమానా రాష్ట్రాన్ని ఇప్పుడు అక్షరాలా కుక్కలు చింపిన విస్తరి చేసేసింది. దేశవ్యాప్తంగా ఐటీ రంగం  ప్రత్యక్షంగా 50 లక్షల మందికి, పరోక్షంగా అంతకు నాలుగింతలు ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. భారతీయ ఐటీ పరిశ్రమ రాబడి రూ.21 లక్షల కోట్లు దాటిపోగా, తెలంగాణ నుంచి ఎగుమతులు సుమారు రూ.2.5 లక్షల కోట్లు! అదే ఏపీ నుంచి రూ.1200 కోట్లకు పరిమితం కావడం- జగన్‌ దుష్పరిపాలన పర్యవసానం. రూ.70 వేల కోట్లతో అయిదు గిగావాట్ల డేటా సెంటర్‌ ఏర్పాటుకు తెదేపా ప్రభుత్వం అదానీ సంస్థతో ఒప్పందం చేసుకోగా, దాన్ని తోసిపుచ్చిన జగన్‌ సర్కారు- రూ.21,844 కోట్లతో మూడు మెగావాట్ల డేటా సెంటర్‌ కోసం అదే సంస్థతో ఎంఓయూ కుదుర్చుకొంది. విశాఖలో 50 సంస్థలు ప్రత్యక్షంగా, మరో 80 వర్చువల్‌గా కార్యకలాపాలు సాగిస్తున్న స్టార్టప్‌ విలేజిని మూసేయించిన ఈ ప్రభుత్వం అక్కడి భవనాల్ని నిరుపయోగం చేసింది. గత ప్రభుత్వం అమలుచేసిన డిజిగ్నేటెడ్‌ టెక్నాలజీ పార్క్‌ పాలసీ ప్రకారం కల్పించిన రాయితీల్ని జగన్‌ నిలిపేశారు. ఫలితంగా చిన్న మధ్యతరహా సంస్థలు మూతపడ్డాయి. విద్యుత్‌ పీపీఏలు, పరిశ్రమలకు భూముల కేటాయింపుపై సమీక్షల పేరిట సాగిన సర్కారీ ఉగ్రవాదం, బడా ఐటీ సంస్థల్లో భయ విహ్వల వాతావరణం సృష్టించింది. ఒక్క ఏడాదిలోనే ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ రూ.57 వేల కోట్ల వృద్ధి సాధించగా, అది చేరుకోవడానికే మరో మూడు దశాబ్దాలు పట్టేంతగా ఇక్కడి వాతావరణాన్ని జగన్‌ ప్రభుత్వం కుళ్ళబొడిచింది. ఒక్క ఐటీకే ముగ్గురు సలహాదారుల్ని పెట్టి తన భృత్యులకు ప్రజాధనం ధారపోస్తున్న జగన్‌, ఏటా లక్షల మంది ఉద్యోగార్థుల ఉపాధికి గండికొట్టారు. విధ్వంసం తప్ప వికాసానికి అర్థం కూడా తెలియని పాలకుడి పీడ రాష్ట్రానికి ఇంకెన్నాళ్లు?

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.