జనం భూములపై జగన్‌ పెత్తనం

‘మీ ఆస్తికి సంబంధించిన సరిహద్దులు, కొలతలు, అంగుళాలతో సహా కచ్చితంగా నిర్ధారణ చేయాలా... వద్దా?’ అంటూ 2020 డిసెంబరులో భూముల రీసర్వేకు జగన్‌మోహన్‌ రెడ్డి కొబ్బరికాయ కొట్టారు. దేశంలో వందేళ్ల తరవాత చేపట్టిన మహాయజ్ఞమిది అంటూ మాటల మత్తుమందు చల్లుతూ సామాన్యుల గుండెల్లో గునపాలు దించేశారు.

Published : 03 May 2024 01:26 IST

‘మీ ఆస్తికి సంబంధించిన సరిహద్దులు, కొలతలు, అంగుళాలతో సహా కచ్చితంగా నిర్ధారణ చేయాలా... వద్దా?’ అంటూ 2020 డిసెంబరులో భూముల రీసర్వేకు జగన్‌మోహన్‌ రెడ్డి కొబ్బరికాయ కొట్టారు. దేశంలో వందేళ్ల తరవాత చేపట్టిన మహాయజ్ఞమిది అంటూ మాటల మత్తుమందు చల్లుతూ సామాన్యుల గుండెల్లో గునపాలు దించేశారు. ప్రకాశం జిల్లాలో ఒక దివ్యాంగుడికి 3.73 ఎకరాల పొలం ఉంది. రీసర్వే అనంతరం ఆ అభాగ్యుడికి 20 సెంట్ల స్థలమే చేతికొచ్చింది. మిగిలిన భూమి ఏమైపోయిందంటే- ఏమో! విష దరహాసాల వైకాపా అధినేతకే తెలియాలి. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలంలో 2.03 ఎకరాల సొంతదారుడికి కేవలం 0.03 సెంట్ల స్థలమున్నట్లు కొత్త పాసు పుస్తకమిచ్చింది జగన్‌ సర్కారు. ‘మాకు 4.95 ఎకరాల భూమి ఉంది... రీసర్వే తరవాత 2.80 ఎకరాలే పాసు పుస్తకంలోకి ఎక్కించారు’ అంటూ అనంతపురం జిల్లా కల్యాణదుర్గానికి చెందిన మహిళా రైతు ఒకరు కన్నీటి పర్యంతమయ్యారు. కర్నూలు, నంద్యాల జిల్లాల పరిధిలోనే 17వేల భూహక్కుల పత్రాలు తప్పుల తడకలుగా తయారయ్యాయంటే- జగన్‌ సర్కారు రాష్ట్రవ్యాప్తంగా ఎంతమంది ఆస్తిపాస్తులకు ఎసరుపెట్టిందో ఊహకైనా అందదు. ‘జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష’ పథకం కింద అత్యాధునిక సాంకేతికతతో భూములను సమగ్రంగా సర్వే చేస్తున్నామంటూ వైకాపా ప్రభుత్వం డప్పులు కొట్టుకుంది. మొన్న మార్చి నాటికి ఆరువేల పల్లెల్లో ఆ క్రతువు ముగిసినట్లు లెక్కలు వార్చింది. కానీ, చాలాచోట్ల పక్కాగా సర్వే చేయనేలేదు. భూయజమానులకు సమాచారం ఇవ్వకుండానే పరమ దుర్మార్గంగా పని కానిచ్చేశారు. ‘మా భూములు పోయాయి సారూ’ అంటూ ఏడుస్తున్న సామాన్యులను వారి ఖర్మకు వారిని వదిలేశారు. నమ్మి అధికారమిచ్చిన పాపానికి జనం భూములను వారికి కాకుండా చేసిన మహామాయావి జగన్‌!

తాతలు, తండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన భూములతో బొడ్డుపేగు బంధం ముడివడి ఉంటుంది. కుటుంబ ఆస్తులేమీ లేకపోయినా తినీతినకా చెమటోడ్చి సంపాదించుకున్న సొమ్ములతో స్థలాలు కొనుగోలు చేస్తారు మరికొంత మంది. బిడ్డల భవిష్యత్తుకు ఆధారాలవుతాయని వాటిని కంటికి రెప్పల్లా చూసుకుంటారు. ప్రజల ఆస్తిపాస్తులను పరిరక్షించాల్సిన ప్రభుత్వమే పిశాచమై మీద పడితే ఇక సామాన్యులకు దిక్కెవరు? కర్నూలు జిల్లా చిరుమాన్‌దొడ్డి గ్రామవాసి ఒకరు ఏడాది క్రితం ఎనిమిది లక్షల రూపాయలు పెట్టి 1.10 ఎకరాల భూమిని కొనుక్కున్నారు. రీసర్వే అనంతరం ఆయనకు అసలు భూమే లేదని తేల్చిపడేసింది జగన్‌ సర్కారీ యంత్రాంగం! ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తి ఒకరు పదేళ్ల క్రితం ఓ మహిళ నుంచి 1.91 ఎకరాల పొలం కొనుగోలు చేశారు. స్థలం అమ్మినామె కుమారుడికి వైకాపా నేతలతో గట్టి సంబంధాలు ఉండటంతో భూముల రీసర్వేను అడ్డుపెట్టుకుని కుట్రకు తెరతీశారు. తమ పేరిటే కొత్త పట్టాదారు పాసుపుస్తకాన్ని రప్పించుకున్నారు. ఇటువంటి అరాచకాలు ఎన్నింటికో మసిపూసేస్తున్న జగన్‌- ‘ప్రతి ఒక్కరికీ వారి భూములపై సంపూర్ణ హక్కులు కల్పించేందుకే రీసర్వే చేపట్టాం’ అంటూ తననుతాను నిర్లజ్జగా సమర్థించుకుంటున్నారు. ఎప్పుడూ ఎక్కడా చూడని విధంగా నలుగురు అయిదుగురు కలిపి జాయింట్‌ లాండ్‌ మొబైల్‌ మ్యాపింగ్‌ నంబర్లతో భూహక్కు పత్రాలు పంపిణీ చేసిన జగన్‌ సర్కారు- పచ్చని పల్లెసీమల్లో కొత్త వివాద కాష్ఠాలను రాజేసింది. కొలతల్లో మాయాజాలంతో భూవిస్తీర్ణాలను తెగ్గోసి, ఉమ్మడి కుటుంబాల్లో లేనిపోని గొడవలు పెట్టింది. అడ్డగోలు రీసర్వేతో అస్తవ్యస్తంగా తయారైన భూరికార్డుల ఆధారంగానే అత్యంత వివాదాస్పదమైన లాండ్‌ టైటిలింగ్‌ చట్టాన్ని అమలుచేయాలని వైకాపా సర్కారు తలపోసింది. ప్రజల స్థిరాస్తులను గుప్పిటపట్టే గూడుపుఠాణీతో ప్రజాశత్రువుగా అవతరించారు జగన్‌. ఆయన రూపంలో దాపురించిన పెనుపీడను వదిలించుకోవడం ఇప్పుడు రాష్ట్రానికి ప్రాణావసరం!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.