సమాఖ్య స్ఫూర్తికి పట్టం కట్టాలి!

సొంతంగా 370 లోక్‌సభ స్థానాల్లో కాషాయ జెండాను ఎగరేస్తామని, మిత్రపక్షాలతో కలిసి 400 సీట్లకు పైగా సాధిస్తామని సవాళ్లు విసిరిన భాజపా- గురికి బారెడు దూరంలో ఆగిపోయింది. 2019 సార్వత్రిక సమరంలో 37.7శాతం ఓట్లతో 303 సీట్లను కమలదళం కొల్లగొట్టింది. ఈసారి అంతకన్నా గట్టిగా అధికార ఉట్టిని కొట్టాలనుకున్న భాజపా అధిష్ఠానం ఆశలపై మొన్నటి ప్రజాతీర్పు నీళ్లు చల్లింది.

Published : 06 Jun 2024 00:32 IST

సొంతంగా 370 లోక్‌సభ స్థానాల్లో కాషాయ జెండాను ఎగరేస్తామని, మిత్రపక్షాలతో కలిసి 400 సీట్లకు పైగా సాధిస్తామని సవాళ్లు విసిరిన భాజపా- గురికి బారెడు దూరంలో ఆగిపోయింది. 2019 సార్వత్రిక సమరంలో 37.7శాతం ఓట్లతో 303 సీట్లను కమలదళం కొల్లగొట్టింది. ఈసారి అంతకన్నా గట్టిగా అధికార ఉట్టిని కొట్టాలనుకున్న భాజపా అధిష్ఠానం ఆశలపై మొన్నటి ప్రజాతీర్పు నీళ్లు చల్లింది. ఈ లోక్‌సభ ఫలితాలు మరీ అనూహ్యమైనవి కావు. గతంతో పోలిస్తే- ఉత్తర భారతంలో భాజపాకు ప్రజాదరణ తరిగిపోయిందని, 250 స్థానాలకు లోపే అది పరిమితం కావడం తథ్యమన్న వాదనలు ఎప్పటినుంచో వినవస్తున్నాయి. అందుకు తగినట్లే ఆ పార్టీ ఖాతాలో 240 సీట్లే జమయ్యాయి. గత రెండు సార్వత్రిక సమరాల్లో సొంతంగా మెజారిటీ మార్కును దాటిన కమలదళం- యావద్దేశాన్నీ ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలింది. ఇప్పుడు భాజపా బలాధిక్యత తెగ్గోసుకుపోవడంతో దశాబ్దం తరవాత హస్తినలో మళ్ళీ సంకీర్ణ సర్కారు కొలువుతీరనుంది. యూపీఏ పాలనపై వెల్లువెత్తిన జనాగ్రహం- 2014లో మోదీకి మొదటిసారి పట్టంకట్టింది. అవినీతి భూతాన్ని అంతం చేస్తానని, జనజీవనాన్ని మెరుగుపరుస్తానన్న మోదీ మాటలను అప్పట్లో దేశమంతా నమ్మింది. 2019 ఎన్నికలకు ముందు చోటుచేసుకున్న పుల్వామా ఉగ్రదాడి, తదనంతర పరిణామాలు దేశవాసులను ఉద్వేగానికి గురిచేశాయి. జాతీయ భద్రతకు బలమైన నాయకత్వం అవసరమన్న సందేశం దేశవ్యాప్తమైన దరిమిలా భాజపాకు ఆనాడు మరోసారి అఖండ విజయం దఖలుపడింది. ఎన్నికల ప్రచారంలో భావోద్వేగాలను ఎగదోసేందుకు భాజపా అధినాయకత్వం ప్రయత్నించినప్పటికీ, పదేళ్ల మోదీపాలనలోని మంచీచెడులే ఈసారి ఓటింగ్‌ సరళిని నిర్దేశించాయి!

కిందటి తడవ పలు రాష్ట్రాలు కమలదళానికి ఏకపక్షంగా జైకొట్టాయి. ఈసారి మోదీ ప్రభుత్వ స్వయంకృతాపరాధాలే భాజపాకు అశనిపాతాలయ్యాయి. మద్దతు ధరలకోసం రోడ్డెక్కిన రైతన్నలపై ప్రదర్శించిన దమననీతి- ఉత్తర్‌ప్రదేశ్, హరియాణా తదితర రాష్ట్రాల్లో కమలదళం గెలుపు అంచనాలను తారుమారు చేసింది. అప్పోసప్పో చేసి చదివించుకున్న పిల్లలకు ఉద్యోగాలు దొరకడం లేదన్న తల్లిదండ్రుల ధర్మాగ్రహం- ఉత్తరాదిలో భాజపాకు శాపమైంది. సైన్యంలో శాశ్వత నియామకాలకు మారుగా మోదీ ప్రభుత్వం తెచ్చిన అగ్నివీర్‌ పథకం- యువతలో ఆగ్రహావేశాలను రాజేసింది. దీనికితోడు ఉత్తర్‌ప్రదేశ్‌లో అఖిలేశ్‌యాదవ్‌ ‘పీడీఏ’ (పిఛ్‌డే- వెనుకబడిన వర్గాలు, దళితులు, అల్పసంఖ్యాకులు) వ్యూహం సత్ఫలితాలను సాధించి, కమల రథచక్రాల వేగానికి పగ్గాలు వేసింది. పశ్చిమ్‌బెంగాల్‌లో కాంగ్రెస్, కమ్యూనిస్టుల ఓట్లు పోయినసారి భాజపాకు భారీగా మళ్ళాయి. అందుకే అక్కడ అది 18 స్థానాలను చేజిక్కించుకోగలిగింది. ఈసారి అంతకంటే ఎక్కువే వస్తాయని భాజపా ఆశలమేడలు కట్టుకున్నప్పటికీ బెంగాలీలు మమతా దీదీకే ఓటేశారు. ఉత్తరాది రాష్ట్రాల్లో కోల్పోయే సీట్లను తూర్పుభారతంలో భర్తీ చేసుకోవాలన్న భాజపాకు ఒడిశా మాత్రమే అండగా నిలిచింది. కేరళలో బోణీకొట్టిన కమలదళం- తెలంగాణలో బలాన్ని రెట్టింపు చేసుకుంది. ఏపీలో తెలుగుదేశం, జనసేనతో జతకట్టి సీట్లు సాధించగలిగింది. కాంగ్రెస్‌ను పూర్తిగా తుడిచిపెట్టాలన్న భాజపా లక్ష్యం నెరవేరలేదు. 2019తో పోలిస్తే హస్తం పార్టీ మెరుగైన ఫలితాలను నమోదుచేయడం- భాజపా అధిష్ఠానానికి మింగుడుపడనిదే. 2019లో వారణాసి నియోజకవర్గం నుంచి 4.79 లక్షల ఓట్ల తేడాతో ప్రత్యర్థిపై ఘనవిజయం సాధించారు మోదీ. తాజా ఎన్నికల్లో ఆయన మెజారిటీ 1.52 లక్షలకు పడిపోవడానికి కారణాలేమిటో కమలదళం పునస్సమీక్ష చేసుకోవాల్సిందే!

నాలుగు దశాబ్దాల నాడు రెండంటే రెండు లోక్‌సభ స్థానాల్లో గెలిచిన భాజపా క్రమంగా త్రివిక్రమావతారం దాల్చింది. భారతీయ రాజకీయ చిత్రపటంలో తాను తప్ప మరే పార్టీ ఉండకూడదన్న భావనను ఒంటబట్టించుకుంది. మధ్యప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో ప్రతిపక్ష ప్రభుత్వాలను కూలదోసింది. శివసేన, ఎన్సీపీలను నిలువునా చీల్చడం వంటి గూడుపుఠాణీ రాజకీయాలకూ పాల్పడింది. వాటిని ఏవగించుకున్న మహారాష్ట్ర ఓటర్లు- ప్రతిపక్ష కూటమిని సమాదరించారు. అయోధ్య రామాలయ నిర్మాణంతో ఓట్ల పంట పండుతుందనుకున్న కమలనాథుల ఊహలూ దారుణంగా తప్పాయి. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే 370వ అధికరణ రద్దు గురించి భాజపా వర్గాలు ఘనంగా ప్రచారం చేసుకున్నాయి. కానీ, దాంతో తమకు ఒనగూడేది ఏముందని ఉత్తరాది ఓటర్లు ఎన్నికలకు ముందే నిలదీశారు. జీడీపీ మెరుపులపై మోదీ ప్రభుత్వం ప్రచారార్భాటానికి తెరతీసినా, ధరాఘాతాలతో జీవితాలు దుర్భరం కావడం- భాజపాపై సామాన్యుల ఆగ్రహానికి ఆజ్యంపోసింది. ఎన్నికల ప్రచారంలో అభివృద్ధి ఎజెండాకు పార్టీలు ప్రాధాన్యమిస్తేనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని మోదీ సెలవిచ్చారు. కానీ, ఆయనే అనేక సందర్భాల్లో విద్వేష వ్యాఖ్యలు చేయడం ఓటర్లకు రుచించలేదు. ఎన్నికలకు ముందు వరకు ‘వికసిత్‌ భారత్‌’పై మోతమోగించిన భాజపా- ఎన్నికల ప్రచారంలో దాని గురించి పెద్దగా మాట్లాడలేదు. ఎన్డీయేకు 400కు పైగా సీట్లు వస్తే, రాజ్యాంగాన్ని సవరించి రిజర్వేషన్లను ఎత్తేస్తారన్న ప్రతిపక్షాల ప్రచారం- దళితులు, బీసీలను భయాందోళనలకు గురిచేసింది. వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్ష నేతలు, ప్రభుత్వ విమర్శకులను వేధిస్తున్నారన్న జనాభిప్రాయమూ తాజా ఎన్నికల్లో భాజపాపై ప్రతికూల ప్రభావం చూపింది!

భాజపా వ్యతిరేక ఓట్లను చీలనివ్వమంటూ విపక్షాలు ఏకతాటిపైకి వచ్చినా, సీట్ల సర్దుబాటులో జరిగిన జాప్యం- ‘ఇండియా’ కూటమికి కొంతవరకు నష్టంచేసింది. ప్రతిపక్షాల ఐక్యతకోసం మొదట్లో రాళ్లెత్తిన నీతీశ్‌ ఆపై భాజపాతో కలిసిపోయారు. స్టాలిన్, మమత తమ తమ రాష్ట్రాల్లో గెలుపు రుచిని మరోసారి చవిచూసినా- ఆర్జేడీ తేజస్వీ యాదవ్, ఆప్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ తేలిపోయారు. రాహుల్‌ గాంధీ దేశవ్యాప్తంగా చేపట్టిన భారత్‌ జోడో, న్యాయ్‌ యాత్రలు కాంగ్రెస్‌కు కొత్త ఊపిరిపోశాయి. వెరసి- భారత ప్రజాస్వామం ఇంకెంతమాత్రం ఏకపక్షం కాకూడదని బలంగా కోరుకున్న ఓటర్ల విజ్ఞతకు తాజా ఫలితాలు అద్దంపడుతున్నాయి. భాజపాకు పాతమిత్రులైన చంద్రబాబు, నీతీశ్‌ స్వరాష్ట్రాల్లో సాధించిన విజయాలు- అధికార పీఠాన్ని అధిష్ఠించేందుకు ఎన్డీయేకు ఆలంబనలయ్యాయి. కమలదళం సంకీర్ణ ధర్మం పాటిస్తూ, ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరించాలి. ప్రాంతీయ ఆకాంక్షలను నెరవేరుస్తూ సమాఖ్య స్ఫూర్తికి పట్టం కట్టాలి. ఆంధ్రప్రదేశ్‌ విభజన చిక్కుముడులను పరిష్కరించి, నాడు పార్లమెంటు సాక్షిగా ఉభయ రాష్ట్రాలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి. ఏపీలో అమరావతి, పోలవరం నిర్మాణాలకు కేంద్రం వెన్నుదన్నుగా నిలవాలి. ఎన్డీయేలో కీలక భాగస్వామిగా తనకు దక్కిన సువర్ణావకాశాన్ని చంద్రబాబు సద్వినియోగం చేసుకుంటూ ప్రగతికి బాటలు పరవాలి. భాగస్వామ్యపక్షాలను సముచితంగా గౌరవిస్తూ, పాలనలో సమష్టి ఎజెండాకు భాజపా కట్టుబడటం- ఎన్డీయే సర్కారు మనుగడకు ప్రాణావసరం కానుంది. సమాఖ్య స్ఫూర్తికి పెద్దపీట వేస్తూ, రాష్ట్రాలను కలుపుకొని వెళ్లడంపై భాజపా రాజనీతిజ్ఞతను ప్రదర్శిస్తే- అది దేశానికే క్షేమదాయకమవుతుంది. ‘వికసిత భారత్‌’ స్వప్నమూ వీలైనంత వేగంగా సాకారమవుతుంది!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.