War: ‘చురు’ యుద్ధంలో వెండి ఫిరంగి గుండ్లు 

రాజుల కాలంలో ఎన్నో యుద్ధాలు జరిగాయి. వాటిలో గెలిచిన రాజులు.. ఓడిన రాజ్యాన్ని స్వాధీనం చేసుకునేవారు. అందుకే ఎవరైనా దండెత్తి వస్తే, ఏ రాజైనా చివరి నిమిషం వరకు తన రాజ్యాన్ని కాపాడుకోవాలనే ప్రయత్నించేవారు

Published : 11 Nov 2021 11:13 IST

(Photo: tourism-rajasthan.com)

ఇంటర్నెట్‌ డెస్క్‌: రాజుల కాలంలో ఎన్నో యుద్ధాలు జరిగాయి. వాటిలో గెలిచిన రాజులు.. ఓడిన రాజ్యాన్ని స్వాధీనం చేసుకునేవారు. అందుకే ఎవరైనా దండెత్తి వస్తే, ఏ రాజైనా చివరి నిమిషం వరకు తన రాజ్యాన్ని కాపాడుకోవాలనే ప్రయత్నించేవారు. ఈ క్రమంలోనే యుద్ధాల్లో సైనికులు ఇనుము, రాగి, ఇత్తడితో చేసిన ఫిరంగి గుండ్లను ప్రయోగించారని చరిత్రలో చదివాం.. సినిమాల్లో చూశాం. కానీ, ఓ రాజు ఫిరంగుల కోసం ఇనుప గుండ్లకు బదులు వెండి గుండ్లను ఉపయోగించాడట. ఆశ్చర్యంగా ఉంది కదా..! అయితే ఆ కథేంటో తెలుసుకుందాం!

రాజస్థాన్‌లోని చురు జిల్లాలో ఉన్న చురు కోటను 1694లో ఠాకూర్‌ కుశాల్‌ సింగ్‌ అనే చక్రవర్తి నిర్మించాడు. అప్పటి చురు రాజ్యంలోకి శత్రువులెవరూ ప్రవేశించకుండా రాజ్యానికి ముందుభాగంలో ఈ కోటను శత్రుదుర్భేద్యంగా తీర్చిదిద్దాడు. ఆయన మరణానంతరం అతడి వారసులు రాజ్యాన్ని పరిపాలిస్తూ వచ్చారు. అయితే, వెండి ఫిరంగి గుండ్ల ఘటన 1814లో చోటుచేసుకుంది. అప్పుడు చురు రాజ్యానికి ఠాకూర్‌ శివాజీ సింగ్‌ చక్రవర్తి. ఆ ఏడాది ఆగస్టులో పొరుగున ఉన్న బికనేర్‌ రాజ్యాన్ని పరిపాలిస్తున్న సూరత్‌ సింగ్‌.. చురు కోటపై దండెత్తి వచ్చాడు. దీంతో ఇరు రాజ్యాల మధ్య భీకర యుద్ధం జరిగింది. చురు రాజ్యంలోని యువకులు సైతం యుద్ధంలో పాల్గొని ప్రభుభక్తిని చాటుకున్నారు. 

అయితే, కొన్ని రోజులకు చురు సైనికుల వద్ద ఆయుధాలు నిండుకున్నాయి. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉండగా.. చక్రవర్తికి ఓ ఆలోచన వచ్చింది. రాజ్యాన్ని కాపాడుకోవాలంటే యుద్ధంలో గెలవాల్సిందేనని, ఇందుకోసం ఆయుధాలు కావాలంటే ప్రజలు తమ బంగారు, వెండి ఆభరణాలు ఇవ్వాలని పిలుపునిచ్చాడు. దీంతో ప్రజలంతా ఏకతాటిపై నిలబడి తమ వద్ద ఉన్న ఆభరణాలను దానం చేశారు. అలా సేకరించిన వెండి ఆభరణాలను కరిగించి ఫిరంగు గుండ్లు తయారు చేయాలని శివాజీ సింగ్‌ సైనికులను ఆదేశించాడు. ఒకవైపు వెండి ఫిరంగి గుండ్లను తయారు చేస్తూ.. మరోవైపు వాటిని శత్రుసైన్యంపైకి ప్రయోగించారు. చివరికి ఈ యుద్ధంలో శివాజీ సింగ్‌ చక్రవర్తే విజయం సాధించి.. తన రాజ్యాన్ని కాపాడుకోగలిగాడు. చరిత్రలో ఏ రాజూ ఇలా వెండి ఫిరంగి గుండ్లను ఉపయోగించలేదని చరిత్రకారులు చెబుతున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని