Aarudra-Vizag: జగన్‌ మాట కంటే మంత్రి గన్‌మెన్‌ మాటే చెల్లుతోంది: ఆరుద్ర ఆవేదన

సీఎం జగన్‌ తమకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరుతూ కాకినాడ జిల్లాకు చెందిన మహిళ ఆరుద్ర నిరాహార దీక్షకు దిగారు.

Updated : 19 Jun 2023 16:43 IST

విశాఖ: సీఎం జగన్‌ తమకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరుతూ కాకినాడ జిల్లాకు చెందిన మహిళ ఆరుద్ర నిరాహార దీక్షకు దిగారు. విశాఖలోని జీవీఎంసీ కార్యాలయం వద్ద ఆమె దీక్షకు కూర్చొన్నారు. ఆమెకు దివ్యాంగుల హక్కుల పోరాట సమితి మద్దతు పలికింది. 

ఈ సందర్భంగా ఆరుద్ర మాట్లాడుతూ దివ్యాంగురాలైన తన కుమార్తె సాయిచంద్రకు వైద్యసహాయం అందించాలని కోరారు. పోలీసుల తీరు వల్లే తన బిడ్డకు ఈ దుస్థితి పట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సీఎం జగన్‌ మాట కంటే మంత్రి దాడిశెట్టి రాజా గన్‌మెన్‌ మాటే చెల్లుతోందని ఆమె విమర్శించారు. డీఎస్పీ మురళీకృష్ణ, మంత్రి దాడిశెట్టి రాజా గన్‌మెన్‌లను పోలీసుశాఖ సస్పెండ్‌ చేయాలని ఆరుద్ర డిమాండ్‌ చేశారు. పోలీసుల నుంచి తనకు రక్షణ కల్పించాలని ఆమె కోరారు.

ఆరుద్ర పోరాటం.. నేపథ్యమిదీ..

రాజులపూడి ఆరుద్రది కాకినాడ రూరల్‌ పరిధిలోని రాయుడుపాలేం. కదల్లేని స్థితిలో ఉన్న కుమార్తె సాయిలక్ష్మీచంద్ర శస్త్రచికిత్స కోసం కొన్నేళ్లుగా ఆమె సాయం కోరుతున్నారు. సొంత ఇల్లు అమ్మి వైద్యం చేయిద్దామనుకుంటే మంత్రి దన్నుతో ఇద్దరు కానిస్టేబుళ్లు అడ్డుపడుతున్నారని ఆమె ఆరోపిస్తున్నారు. తన గోడు చెప్పాలని గతేడాది నవంబరు 2న సీఎం క్యాంపు కార్యాలయానికి ఆరుద్ర వెళ్లారు. ముఖ్యమంత్రిని కలిసి సమస్యను వివరించడానికి ప్రయత్నిస్తే కుదరదని పోలీసులు అడ్డుకున్నారు. తర్వాత ఆమె మనస్తాపానికి గురై ఎడమచేతి మణికట్టు కోసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లడం అప్పట్లో సంచలనం రేపింది.

ఆరుద్ర తన కుమార్తెతో ఇటీవల కాకినాడ జిల్లా కలెక్టర్‌ కార్యాలయానికి వెళ్లి గోడు తెలిపారు. అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో.. ఈ నెల 7న కలెక్టరేట్‌ వద్ద కుమార్తెతో సహా నిరవధిక దీక్షకు దిగారు. ఆరోజు అర్ధరాత్రి దాటాక దీక్షను భగ్నం చేసిన పోలీసులు.. తల్లీకుమార్తెలను కాకినాడ జీజీహెచ్‌కి తరలించారు. చికిత్సకు వారు సహకరించకపోవడంతో బలవంతపు వైద్యసేవలకు ప్రయత్నించారు. ఒత్తిడి చేస్తే గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని ఆరుద్ర హెచ్చరించారు. సోమవారం సాయంత్రం జీజీహెచ్‌లోని వార్డు వద్ద పోలీసులు భారీగా ఉండటంతో ఆరుద్ర.. ‘వెంటనే ఐసీయూ వద్దకు రండి.. పోలీసులు, ఆసుపత్రి సిబ్బంది పాపను ఏం చేస్తారోనని భయంగా ఉంది’ అంటూ మీడియాకు తెలిపారు. అక్కడికి వెళ్లిన మీడియా ప్రతినిధులనూ పోలీసులు అడ్డుకున్నారు. అర్ధరాత్రి దాటాక విశాఖలోని మానసిక వైద్యశాలకు ఆరుద్ర, ఆమె కుమార్తెను తరలించారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని