‘ట్విటర్‌ పే చర్చా..’ ఆనంద్‌ మహీంద్రా, శశి థరూర్‌ మధ్య ఆసక్తికర సంభాషణ!

కాంగ్రెస్‌ ఎంపీ శశి థరూర్‌ను ట్యాగ్‌ చేస్తూ పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహీంద్రా చేసిన ట్వీట్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఇంతకీ మహీంద్రా ఎందుకు థరూర్‌ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. 

Published : 28 Jan 2023 01:23 IST

దిల్లీ: ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహీంద్రా, కాంగ్రెస్‌ సీనియర్ నేత శశి థరూర్‌ ఇద్దరూ సామాజిక మాధ్యమాల్లో ఎంతో చురుగ్గా ఉంటారు. ఆసక్తికర అంశాలకు సంబంధించిన వీడియోలను ఎప్పటికప్పుడు ఆనంద్ మహీంద్రా ట్విటర్‌లో షేర్‌ చేస్తుంటారు. మరోవైపు శశి థరూర్‌ సైతం తన ఆంగ్ల పరిజ్ఞానంతో కొత్త పదాలను పరిచయం చేస్తూ ట్వీట్లు చేస్తుంటారు. తాజాగా ఈ ఇద్దరి మధ్య ట్విటర్‌ వేదికగా ఆసక్తికర చర్చ జరిగింది. ఇందుకు కారణం  ఓ పాత వీడియో. 

1957లో భారత్‌, బ్రిటన్‌, పాకిస్థాన్‌, ఫిలిప్పీన్స్‌ దేశాలకు చెందిన పాఠశాల విద్యార్థులు ‘పక్షపాతం’ (Prejudice) అనే అంశంపై ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొంటారు. అందులో వ్యాఖ్యాత భారత్‌, బ్రిటన్‌తో ఎంతో స్నేహంగా ఉండేదని అంటారు. ఆ సమయంలో భారత్‌ తరపున పాల్గొంటున్న విద్యార్థి పద్మనాభ గోపీనాథ్‌ కలుగజేసుకుని, పక్షపాత ధోరణి, పంచాయితీ వ్యవస్థ గురించి చెబుతూ.. బ్రిటన్‌ 200 ఏళ్లపాటు భారత్‌ను ఏ విధంగా దోచుకుందో వివరిస్తారు. 

ఈ వీడియోను ఆనంద్‌ మహీంద్రా ట్విటర్‌లో పోస్ట్ చేస్తూ ‘‘సోషల్‌ మీడియాలో ఈ వీడియో వైరల్‌ అవుతోంది. 57లో భారత్‌ దేశాన్ని గొప్పగా నిలిపేందుకు ఆ విద్యార్థి మాట్లాడటం చూస్తుంటే ఎంతో అద్భుతంగా అనిపిస్తోంది. శశిథరూర్‌.. మీరు కూడా ఈ వీడియో చూసి ఉంటారని అనుకుంటున్నా. అందులో భారత్‌ తరఫున పాల్గొన్న గోపీనాథ్‌ గురించి కూడా మీకు తెలిసే ఉంటుంది’’ అని శశి థరూర్‌ను ట్యాగ్ చేస్తూ ట్వీట్‌ చేశారు. 

ఈ ట్వీట్‌పై థరూర్ స్పందిస్తూ.. ‘‘ఆ సమయంలోనే నేను పుట్టాను. భారత్‌ తరపున ఆ విద్యార్థి చాలా గొప్పగా వాదించాడు. ప్రస్తుతం అతను పదవీ విరమణ చేసి, ఎలాంటి గుర్తింపు లేకుండా విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు’’ అని థరూర్‌ ట్వీట్ చేశారు. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణను చూసిన నెటిజన్లు వీడియోలో మాట్లాడిన భారత్ విద్యార్థి గురించి వెతకడం ప్రారంభించారు. కొందరు పద్మనాభ గోపీనాథ్‌ తర్వాతి కాలంలో ఐఎఫ్‌ఎస్‌ అధికారి అయ్యాడని కామెంట్‌ చేస్తున్నారు. మరికొందరు 18 ఏళ్ల వయస్సుల్లో వివిధ అంశాలపై గోపీనాథ్‌కు ఉన్న జ్ఞానం, పరిపక్వత, మాట్లాడే విధానాన్ని మెచ్చుకుంటూ కామెంట్లు చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని