Machilipatnam: జీతాలు పెంచుతూ సీఎం జగన్‌ బటన్‌ నొక్కాలి.. లేదా మేం నొక్కే బటన్‌తో..: అంగన్వాడీ కార్యకర్తలు

వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేస్తూ ఏపీలో అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన సమ్మె ఉద్ధృతంగా కొనసాగుతోంది.

Published : 01 Jan 2024 16:20 IST

మచిలీపట్నం: వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేస్తూ ఏపీలో అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన సమ్మె 21వ రోజు ఉద్ధృతంగా కొనసాగుతోంది. ముఖ్యమంత్రి జగన్ తమ వేతనాలు పెంచేలా బటన్ నొక్కాలని.. లేనిపక్షంలో మరో మూడు నెలల్లో తాము నొక్కే బటన్‌తో రాష్ట్రంలో వైకాపా అడ్రస్ లేకుండా పోతుందని అంగన్వాడీ కార్యకర్తలు వ్యాఖ్యానించారు. మచిలీపట్నంలో నిరసన వ్యక్తం చేసిన అంగన్వాడీలు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నూతన సంవత్సరం సందర్భంగా కార్మికులు తమ సమ్మె శిబిరంలోనే కేక్ కట్ చేసి నిరసన వ్యక్తం చేశారు.

‘‘కొత్త సంవత్సరంలో ఇళ్లల్లో ఉండాల్సిన మమ్మల్ని ముఖ్యమంత్రి జగన్ ఇలా నడి రోడ్డు మీద కూర్చోబెట్టారు. మేము ఇంతలా అవస్థలు పడుతుంటే ఆయనకు మాపై కనికరం కలగడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 1.10 లక్షల మంది కార్యకర్తలు సమ్మెలో ఉంటే.. ఇంత నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారు. ఎన్నికల్లో ఓట్ల కోసం హామీలు ఇచ్చింది మీరు కాదా? మీ మాటలను నమ్మి ఓట్లు వేస్తే.. ఇలా అన్యాయం చేస్తారా? ప్రభుత్వం స్పందించి మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకూ సమ్మె కొనసాగిస్తాం’’ అని అంగన్వాడీ కార్యకర్తలు తెలిపారు.

ఫోన్లు మా కోసం ఇచ్చారా?: అంగన్వాడీ సంఘాల ప్రతినిధులు

అంగన్వాడీల సమస్యలు పరిష్కరించామంటూ రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు ప్రకటనలు చేస్తోందని అంగన్వాడీ సంఘాల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘చర్చలు అంటూనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వం తీరు ఇలాగే కొనసాగితే మేము కూడా వచ్చే ఎన్నికల్లో ప్రత్యామ్నాయం చూసుకుంటాం. మాకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పడం అబద్ధం.  అంగన్వాడీ కేంద్రాలకు అద్దెలు, ఫోన్లు మా కోసం ఇచ్చారా? ఫోన్లతో మాకు పని భారం మరింత పెరిగింది. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో వేతనాలు పెంచారు. గ్రాట్యుటీ కూడా చాలా రాష్ట్రాల్లో అమలవుతోంది. మాపట్ల ప్రభుత్వ వైఖరితో మానసిక ఆవేదన పెరిగింది. బుధవారం నుంచి పోరాటం ఉద్ధృతం చేస్తాం’’ అని ప్రతినిధులు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని