Supreme Court: పోస్టల్‌ బ్యాలెట్ల వ్యవహారం.. వైకాపాకు సుప్రీంలో ఎదురుదెబ్బ

వైకాపాకు మరో ఎదురుదెబ్బ తగలింది. పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Updated : 03 Jun 2024 12:51 IST

దిల్లీ: వైకాపాకు మరో ఎదురుదెబ్బ తగలింది. పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) నియమాలపై జోక్యం చేసుకోబోమన్న హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఉత్వర్వులపై వైకాపా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం.. ఆ పార్టీ పిటిషన్‌ను తోసిపుచ్చింది. 

పోస్టల్‌ బ్యాలెట్ల ఓటరు డిక్లరేషన్‌కు సంబంధించిన ‘ఫాం-13ఏ’ పై అటెస్టింగ్‌ అధికారి సంతకం ఉంటే చాలు, ఆయన పేరు, హోదా, అధికారిక ముద్ర (సీలు) లేకపోయినా ఆ ఓట్లు చెల్లుబాటవుతాయంటూ కేంద్ర ఎన్నికల సంఘం మే 30న జారీచేసిన ఉత్తర్వులపై వైకాపా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ ఆ పార్టీ ఆదివారం సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పీ దాఖలు చేసింది. ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేయాలని కోరుతూ ఆ పార్టీ దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌పై విచారించిన ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు అధికార పార్టీ వాదనలను తిరస్కరిస్తూ జూన్‌ 1న తీర్పు చెప్పింది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత అందులో జోక్యం చేసుకోవడానికి వీల్లేదని, పిటిషనర్‌కు ఏదైనా అభ్యంతరం ఉంటే ఎన్నికల పిటిషన్‌ దాఖలు చేసుకోవచ్చని స్వేచ్ఛనిస్తూ జస్టిస్‌ మండవ కిరణ్మయి, జస్టిస్‌ న్యాపతి విజయ్‌లతో కూడిన హైకోర్టు ధర్మాసనం తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ వైకాపా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. పోస్టల్‌ బ్యాలెట్ల వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఇదే అంశంపై విశాఖ తూర్పు తెదేపా ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు సుప్రీంకోర్టులో కేవియట్‌ దాఖలు చేశారు. ఈ కేసులో ఏదైనా ఉత్తర్వులు జారీచేసే ముందు కోర్టు తన వాదనలు కూడా వినాలని కోరుతూ ఆయన ఈ పిటిషన్‌ ఫైల్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని