AP High Court: పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

మాచర్ల ఎమ్మెల్యే, వైకాపా అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్లపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

Published : 28 May 2024 12:40 IST

అమరావతి: మాచర్ల ఎమ్మెల్యే, వైకాపా అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్లపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జూన్‌ 6 వరకు ఆయనపై ఎలాంటి చర్యలు చేపట్టొద్దని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈవీఎం ధ్వంసం కేసులో జూన్‌ 6 వరకు పిన్నెల్లిని అరెస్ట్‌ చేయొద్దంటూ ఇప్పటికే ధర్మాసనం స్పష్టం చేసింది. మాచర్ల హింసలో పోలీసులు నమోదు చేసిన ఇతర కేసుల్లోనూ ఆ తేదీ వరకూ ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను జూన్‌ 6కు వాయిదా వేసింది. 

సోమవారం జరిగిన వాదనలిలా..

పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై నమోదైనవి తీవ్ర కేసులని, అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ముందస్తు బెయిలు ఇవ్వొద్దని ఫిర్యాదుదారులు నంబూరి శేషగిరిరావు, చెరుకూరి నాగశిరోమణి తరఫున సీనియర్‌ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు ఇంప్లీడ్‌ పిటిషన్‌ వేసి హైకోర్టులో సోమవారం వాదనలు వినిపించారు. పిటిషనర్‌ (పిన్నెల్లి) పూర్వ చరిత్రను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. పోలింగ్‌ రోజున అరాచకాలకు పాల్పడ్డారని, అలాంటి వ్యక్తిని లెక్కింపు రోజు కౌంటింగ్‌ కేంద్రానికి వెళ్లేలా అనుమతించడం శ్రేయస్కరం కాదని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈవీఎంను ధ్వంసం చేసిన కేసుకు, ప్రస్తుత కేసులు భిన్నమైనవని చెప్పారు. బెయిలిస్తే ఆయన సాక్షులను బెదిరించడం, సాక్ష్యాధారాలను తారుమారు చేయడం, నేరఘటనలను పునరావృతం చేస్తారని చెప్పారు. 

పోలీసుల తరఫున పీపీ వై.నాగిరెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఓట్ల లెక్కింపు రోజున పిన్నెల్లి నేరఘటనలను పునరావృతం చేసే అవకాశం ఉందన్నారు. ఎన్నికల రోజు ఈవీఎంను ధ్వంసం చేయడమే కాకుండా మరుసటి రోజు అనుచరులతో ర్యాలీ తీసి, ప్రతిపక్ష నేతలను బెదిరించారని గుర్తు చేశారు. పోలీసులను గాయపరిచి తీవ్ర నేరాలకు పాల్పడ్డారన్నారు. ఇప్పటి వరకు 9 కేసుల్లో పిన్నెల్లి నిందితుడిగా ఉన్నారని, పోలీసుల నిఘాకు అందుబాటులో ఉండకుండా కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారని చెప్పారు. ఇరువైపుల న్యాయవాదుల వాదనలు ముగిసిన నేపథ్యంలో హైకోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని