జీన్స్‌తో జీవం ఉట్టిపడే కళాఖండాలు!

కుక్క పిల్ల, అగ్గి పుల్ల, సబ్బు బిళ్ల.. కాదేది కవితకు అనర్హం అన్నారు మహా కవి శ్రీశ్రీ. అలాగే, ఏ వస్తువు కాదు కళకు అనర్హం అని నిరూపిస్తోంది టర్కీకి చెందిన డెనిజ్‌ సాడిచ్‌. జీన్స్‌ వస్త్రాలను చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి వాటితో అందమైన చిత్రాలను రూపొందిస్తూ

Updated : 15 Jan 2021 14:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కుక్క పిల్ల, అగ్గి పుల్ల, సబ్బు బిళ్ల.. కాదేది కవితకు అనర్హం అన్నారు మహాకవి శ్రీశ్రీ. అలాగే, ఏ వస్తువు కళకు అనర్హం కాదు అని నిరూపిస్తోంది టర్కీకి చెందిన డెనిజ్‌ సాడిచ్‌. జీన్స్‌ వస్త్రాలను చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి వాటితో అందమైన చిత్రాలను రూపొందిస్తూ ఔరా అనిపిస్తోంది. జీన్స్‌లో ఉండే రంగులు, షేడ్లను ఉపయోగించి డెనిజ్‌.. జీవం ఉట్టిపడే విధంగా మనుషుల, జంతువుల ముఖచిత్రాలను ఆవిష్కరిస్తోంది.

డెనిజ్‌ తండ్రి గ్లాస్‌ డిజైన్‌ చేయడంలో దిట్ట. ఆమె మామ వడ్రంగి పనిచేస్తూ కలపపై అద్భుతమైన కళాకృతులను చెక్కేవారు. అత్త టైలర్‌ కావడంతో రకరకాల డిజైన్లతో వస్త్రాలు కుట్టేవారు. తన కుటుంబసభ్యుల వృత్తి కళలతో ముడిపడి ఉండటంతో డెనిజ్‌ కూడా చిన్నతనం నుంచే కళలపై ఆసక్తి పెంచుకుంది. అందుకే మెర్సిన్‌ యూనివర్సిటీ నుంచి ఫైన్‌ ఆర్ట్స్‌లో డిగ్రీ పట్టా సాధించింది. ఆ తర్వాత ఇస్తాంబుల్‌లో వర్క్‌షాప్‌ ప్రారంభించి.. కాన్వాస్‌పై ఆయిల్‌ పెయింట్స్‌, ఆక్రిలిక్స్‌ పెయింట్స్..‌ ఇలా పెయింటింగ్‌లోని అన్ని రకాలను ప్రయత్నించింది. కానీ, అవేవి డెనిజ్‌కు సంతృప్తిని ఇవ్వలేదు. ఇంకా ఏదో కొత్తగా చేయాలని పరితపించింది.

అనేక ప్రయత్నాలు.. చివరికి విచిత్రాలు

కొత్తగా ఏదైనా చేయాలన్న తపనతోనే డెనిజ్‌ ‘రెడీ-రీమేడ్‌’ పేరుతో ఓ ప్రాజెక్టు మొదలుపెట్టింది. నిత్య జీవితంలో ఉపయోగించే వస్తువులతో చిత్రాలను రూపొందించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో క్యాసెట్‌ కవర్స్‌, నాణెలు, ఇతర వస్తువులతో చిత్రాలు రూపొందించింది. ఆ తర్వాతే తనకు అర్థమైంది. వీటిని ఉపయోగించి కళాకృతులను తయారు చేసేవాళ్లు చాలా మందే ఉన్నారు.. ఇవి కాకుండా మనుషులకు మరింత దగ్గరగా ఉండే వస్తువులను ఉపయోగించాలని ఆలోచించగా.. జీన్స్‌ సరైందని డెనిజ్‌ భావించింది. అలా జీన్స్‌తో చిత్రాలు వేయడం ఆరంభించింది.

క్యూ కట్టిన డెనిమ్‌ కంపెనీలు

మొదట్లో డెనిజ్‌ తన వద్ద ఉన్న పాత జీన్స్‌ ప్యాంట్లు, సెకండ్‌ హ్యాండ్‌లో కొనుగోలు చేసిన జీన్స్‌లను ఇందుకోసం ఉపయోగించింది. జీన్స్‌ను అవసరమైన ఆకృతిలో చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి చిత్రాలను రూపొందించింది. అంతేకాదు జీన్స్‌కు ఉండే జేబులు, గుండీలు కూడా ఈ కళాఖండంలో భాగవుతున్నాయి. జీన్స్‌తో రూపొందించిన ఈ చిత్రాలు చూసి పలు డెనిమ్ కంపెనీలు ఆశ్చర్యపోయాయి. ఇలాంటి చిత్రాలు రూపొందించడానికి అవసరమైన జీన్స్‌ వస్త్రాలను ఆమెకు ఇవ్వడానికి ఒప్పుకున్నాయి. దీంతో ఆమె మరింత ఉత్సాహంతో జీన్స్‌ చిత్రాలు చిత్రీకరిస్తోంది. మైఖేల్‌ జాక్సన్‌, మార్లిన్‌ మాన్రో, సింహాం ఇలా అనేక ముఖాలు ఎంతో ఆకట్టుకుంటున్నాయి. వాటిని మీరూ చూసేయండి..







Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని