భారత్‌లో ఆటోడ్రైవర్‌ ఇప్పుడు స్విట్జర్లాండ్‌లో యూట్యూబర్‌

మనిషి జీవితం ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతుందో తెలియదు. పట్టుదలకు అదృష్టం తోడైతే వ్యక్తి ఎదుగుదల ఎంతగా ఉంటుందో చెప్పడానికి రంజిత్‌ సింగ్‌ జీవితం ఉదాహరణగా నిలుస్తుంది. చదువు మధ్యలో ఆపేసి ఆటో డ్రైవర్‌గా జీవితం ప్రారంభించిన రంజిత్‌ సింగ్‌ ఇప్పుడు.. స్విట్జర్లాండ్‌లో పాపులర్‌ యూట్యూబర్‌గా పేరు సంపాదించాడు.

Published : 15 Jun 2021 01:12 IST


(Photo: nriaffairs)

ఇంటర్నెట్‌ డెస్క్‌: మనిషి జీవితం ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతుందో తెలియదు. పట్టుదలకు అదృష్టం తోడైతే వ్యక్తి ఎదుగుదల ఎంతగా ఉంటుందో చెప్పడానికి రంజిత్‌ సింగ్‌ జీవితం ఉదాహరణగా నిలుస్తుంది. చదువు మధ్యలో ఆపేసి ఆటో డ్రైవర్‌గా జీవితం ప్రారంభించిన రంజిత్‌ సింగ్‌ ఇప్పుడు.. స్విట్జర్లాండ్‌లో పాపులర్‌ యూట్యూబర్‌గా పేరు సంపాదించాడు.

రాజస్థాన్‌కు చెందిన రంజిత్‌ సింగ్‌ పేదరికం కారణంగా పెద్దగా చదువుకోలేకపోయాడు. పదో తరగతి ఫెయిల్‌ కావడం, కుటుంబ పరిస్థితులు బాగోలేకపోవడంతో 16 ఏళ్ల వయసులోనే ఆటో డ్రైవర్‌గా మారాడు. జైపూర్‌లో చాలా మంది ఆటో డ్రైవర్లు విదేశీ భాషలు నేర్చుకొని విదేశాల నుంచి వచ్చే సందర్శకులకు గైడ్‌గానూ వ్యవహరిస్తుంటారు. అయితే, రంజిత్‌కు విదేశీ భాషలు రాకపోవడంతో ఇతర ఆటో డ్రైవర్లకన్నా ఆదాయంలో వెనుకబడిపోయేవాడు. అలాగే, చామన ఛాయ రంగులో ఉండే రంజిత్‌ను విదేశీ పర్యటకులు అవహేళన చేసేవారు.

భాషలు నేర్చుకొని బిజినెస్‌ ప్రారంభించి

అయితే, చదువులో వెనుకబడినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని రంజిత్‌ తపన పడేవాడు. అందుకే పట్టుదలతో ఇంగ్లిష్‌, ఫ్రెంచ్‌, స్పానిష్‌ భాషలు నేర్చుకున్నాడు. ఆటో డ్రైవింగ్‌తోపాటు సొంతంగా టూరిస్ట్ బిజినెస్‌ ప్రారంభించాడు. రంజిత్‌ మాట తీరు, మర్యాద చూసి విదేశీయులు అతడి వద్దకు వెళ్లేవారు. దీంతో అతడి బిజినెస్‌ మూడు పువ్వులు.. ఆరు కాయలుగా సాగింది. 

ప్రియురాలి రూపంలో వచ్చిన అదృష్టం

రంజిత్‌ పట్టుదల టూరిస్ట్‌ బిజినెస్‌ను ప్రారంభించేలా చేస్తే.. అతడి ప్రేమ మరో దేశంలో స్థిరపడేలా చేసింది. రంజిత్‌ టూరిస్ట్‌గా ఉన్న సమయంలో ఫ్రాన్స్‌ నుంచి ఓ యువతి రాజస్థాన్‌ను సందర్శించేందుకు వచ్చింది. అదే సమయంలో రంజిత్‌తో ప్రేమలో పడింది. తిరిగి ఫ్రాన్స్‌ వెళ్లాక కూడా వారి ప్రేమ కొనసాగింది. వారి ప్రేమ బంధం మరింత బలపడటంతో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

వీరి ప్రేమకు వీసా అడ్డుపడింది

తన ప్రేయసిని కలిసేందుకు ఫ్రాన్స్‌కు వెళ్లాలనుకున్న రంజిత్‌కు వీసా రూపంలో అడ్డంకులు ఏర్పడ్డాయి. పలుమార్లు వీసాకు దరఖాస్తు చేయగా.. ఫ్రాన్స్‌ ఎంబసీ నిరాకరించింది. దీంతో అతడి ప్రేయసే భారత్‌కు వచ్చి వీసా సమస్యను పరిష్కరించి తనతోపాటు తీసుకెళ్లింది. 2014లో వీరిద్దరూ ఒక్కటయ్యారు. ఆ తర్వాత లాంగ్‌ టర్మ్‌ వీసాకు దరఖాస్తు చేశాడు. ప్రస్తుతం రంజిత్ దంపతులకు ఇద్దరు పిల్లలు. 

యూట్యూబర్‌గా పాపులారిటీ.. జెనివాలో నివాసం

ఫ్రాన్స్‌కు వెళ్లిన రంజిత్‌కు అక్కడ ఆహారం రుచించలేదు. అక్కడి ఆహారపు అలవాట్లు నచ్చకపోవడంతో సొంతంగా వండుకోవడం మొదలుపెట్టాడు. వంటచేస్తున్న వీడియోలను సరదాగా యూట్యూబ్‌లో పెట్టేవాడు. కొన్నాళ్లకు స్విట్జర్లాండ్‌లోని జెనివాలో స్థిరపడ్డాడు. అక్కడ కూడా రంజిత్ వంటలు చేస్తూ.. నేర్పిస్తూ చేసిన వీడియోలు మంచి వ్యూస్‌ సంపాదించడంతో అతడి వ్లాగ్‌ పాపులర్‌ అయింది. త్వరలో అక్కడ ఓ భారతీయ రెస్టారంట్‌ కూడా ప్రారంభించాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని