TSRTC: టీఎస్‌ ఆర్టీసీకి జాతీయ స్థాయిలో అవార్డుల పంట

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TSRTC)కి జాతీయ స్థాయిలో అవార్డుల పంట పండింది.

Updated : 02 Mar 2024 17:24 IST

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC)కి జాతీయ స్థాయిలో అవార్డుల పంట పండింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన అసోసియేషన్‌ ఆఫ్‌ స్టేట్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్టు అండర్‌ టేకింగ్స్‌ (ఏఎస్‌ఆర్‌టీయూ) ఏటా అందించే ప్రతిష్ఠాత్మక ఐదు నేషనల్‌ బస్‌ ట్రాన్స్‌పోర్టు ఎక్స్‌లెన్స్‌ అవార్డులు టీఎస్‌ఆర్టీసీని వరించాయి.

2022-23లో రహదారి భద్రత, ఇంధన సామర్థ్య నిర్వహణ, సిబ్బంది సంక్షేమం, సాంకేతికత వినియోగం తదితర కేటగిరీల్లో ఈ  పురస్కారాలు దక్కాయి. రహదారి భద్రత, ఇంధన సామర్థ్య నిర్వహణలో ప్రథమ, అర్బన్‌ విభాగంలో ద్వితీయ బహుమతిని సంస్థ కైవసం చేసుకుంది. సిబ్బంది సంక్షేమం, ఉత్పత్తి కేటగిరీలో ప్రథమ, సాంకేతికత ద్వారా ప్రయాణికులకు మెరుగైన సేవలందించినందుకు మరో ప్రథమ బహుమతిని సొంతం చేసుకుంది. ఐదు అవార్డులను న్యూదిల్లీలో ఈ నెల 15న టీఎస్‌ఆర్టీసీ ఉన్నతాధికారులకు అందజేయనున్నట్టు ఏఎస్‌ఆర్‌టీయూ ప్రకటించింది.

జాతీయ స్థాయి అవార్డులు గెలుచుకోవడం పట్ల రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. సిబ్బంది నిబద్ధత, అంకితభావం, క్రమశిక్షణతో పనిచేయడం వల్లే సంస్థకు ఈ పురస్కారాలు దక్కాయన్నారు. అవార్డులు వచ్చేలా కృషి చేసిన అధికారులు, సిబ్బందిని అభినందించారు. టీఎస్‌ఆర్టీసీ దేశానికే రోల్‌ మోడల్‌గా నిలిచిందని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్‌ తెలిపారు. సంస్థ అభివృద్ధికి, ప్రయాణికులకు మెరుగైన సేవలందించేందుకు అధికారులు, సిబ్బంది చేస్తున్న కృషికి ఈ అవార్డులు నిదర్శనమని పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని