బ్యాంకాక్‌.. అసలు పేరు పలికితే ఆయాసమే!

బ్యాంకాక్‌.. థాయ్‌లాండ్‌ దేశ రాజధాని. నిత్యం పర్యటకులతో కిటకిటలాడే అందమైన నగరం. ఈ నగరం పేరు పలకడానికి కూడా చక్కగా, చాలా రిచ్‌గా అనిపిస్తుంటుంది కదా..! కానీ, బ్యాంకాక్‌ అసలు పేరు తెలిస్తే.. వామ్మో ఇదేం పేరు? చదవాలంటేనే ఆయాసం వస్తుందని

Published : 29 Mar 2021 01:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బ్యాంకాక్‌.. థాయ్‌లాండ్‌ దేశ రాజధాని. నిత్యం పర్యాటకులతో కిటకిటలాడే అందమైన నగరం. ఈ నగరం పేరు పలకడానికి కూడా చక్కగా, చాలా రిచ్‌గా అనిపిస్తుంటుంది కదా..! కానీ, బ్యాంకాక్‌ అసలు పేరు తెలిస్తే.. వామ్మో ఇదేం పేరు? చదవాలంటేనే ఆయాసం వస్తుందని గాబరా పడతారు. ఇంతకీ అసలు పేరు ఏంటంటే.. ‘క్రుంగ్‌ థెప్‌ మహా నాఖోన్‌ అమోన్‌ రతన కోసిన్‌ మహింత్రయుత్తయ మహ దిలోక్‌ పోప్‌ నప్ప రాట్‌ రటచా థాని బురి రోమ్‌ ఉడొమ్‌ రటాచ నివెట్‌ మహా సతాన్‌ అమోన్‌ ఫిమన్‌ అవటాన్‌ సట్‌హిట్‌ సఖ తాట్టియా విట్సనుకమ్‌ ప్రసిట్‌’’. పాలి, సంస్కృత భాషల్లోని పదాలతో ఈ పేరు పెట్టారు. దీనికి అర్థం ‘దేవదూతల నగరం, అమరత్వం పొందిన నగరం, తొమ్మిది రత్నాల అద్భుతమైన నగరం, చక్రవర్తి సింహాసనం, రాజభవంతుల నగరం, మానవరూపంలో అవతరించిన దేవతల ఇల్లు, ఇంద్రుడి ఆదేశాలతో విశ్వకర్మ నిర్మించిన నగరం’’. కింగ్‌ మాంగ్‌కుట్‌ మహారాజు బ్యాంకాక్‌కు పెట్టిన పేరు ఇది.

15వ శతాబ్దంలోనే ఆయుత్తయ రాజులు పల్లెటూరుగా ఉన్న బ్యాంకాక్‌ను నగరంగా అభివృద్ధి పర్చేందుకు శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి వివిధ రాజులు ఈ ప్రాంతాన్నే ప్రధాన నగరంగా చేసుకొని పాలిస్తూ వచ్చారు. అలా 1782లో కింగ్‌ రామ I బ్యాంకాక్‌ను రాజధానిగా మార్చుకున్నాడు. ఆయన హయాంలో ఈ ప్రాంతాన్ని ‘క్రుంగ్‌ థెప్‌ తవరవాడి సి ఆయుత్తయ’, ‘క్రుంగ్‌ థెప్‌ మహా నిఖోన్‌ సి ఆయుత్తయ’ అని పిలిచేవారు. అయితే, 1833లో బ్యాంకాక్‌ పేరును సియా-యుతియాగా పిలవడం ప్రారంభించారు. అంతర్జాతీయ ఒప్పందాల్లోనూ దీన్ని అలాగే పేర్కొన్నారు. కాగా, 1850ల్లో కింగ్‌ మాంగ్‌కుట్‌ బ్యాంకాక్‌కు పైన పేర్కొన్నట్లుగా ‘‘క్రుంగ్‌ థెప్‌........ ప్రసిట్‌’’ అనే పొడవైన పేరును పెట్టారు. అత్యంత పొడవు పేరు కలిగిన నగరంగా బ్యాంకాక్‌ గిన్నిస్‌ బుక్‌లోనూ చోటు సంపాదించుకుంది. ప్రస్తుతం బాహ్య ప్రపంచం ఈ నగరాన్ని బ్యాంకాక్‌ అని పిలుస్తున్నా.. స్థానికులు మాత్రం ఆ పొడవు పేరును కుదించి ‘క్రుంగ్‌ థెప్‌ మహా నిఖోన్‌’ లేదా ‘క్రుంగ్‌ థెప్‌’ అని పిలుచుకుంటారు. ఇదండీ.. బ్యాంకాక్‌ పొడవు పేరు వెనుకున్న పెద్ద కథ..!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని