Barrelakka: వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్‌ చెబుతోన్న నెటిజన్లు..

సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Updated : 29 Mar 2024 10:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన బర్రెలక్క అలియాస్‌ కర్నె శిరీష(Karne Sirisha) వివాహం వేడుకగా జరిగింది. తన సమీప బంధువు వెంకటేశ్‌తో ఆమె ఏడడుగులు వేశారు. నాగర్‌ కర్నూల్‌జిల్లా పెద్దకొత్తపల్లి మండల కేంద్రం పీఎంఆర్‌ గార్డెన్‌ వీరి వివాహానికి వేదికైంది. ఈ వేడుకకు కుటుంబసభ్యులు, స్నేహితులతో పాటు పలువురు ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. శిరీష తన ప్రీ వెడ్డింగ్‌, పెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకోగా అవి వైరల్‌గా మారాయి. నెటిజన్లు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

డిగ్రీ చదివినా ఉద్యోగం రావడం లేదని, అందుకే బర్రెలు కాస్తూ బతుకుతున్నానంటూ పెట్టిన వీడియోతో శిరీష ఫేమస్‌ అయ్యారు. దీంతో ఆమె బర్రెలక్కగా (Barrelakka) గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత సామాజిక మాధ్యమాల వేదికగా నిరుద్యోగ సమస్యపై తన గొంతు వినిపించారు. గతేడాది జరిగిన  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నాగర్‌ కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేసి అందరి దృష్టినీ ఆకర్షించారు. ఆ సమయంలో ఆమెకు నిరుద్యోగ యువత నుంచి భారీగా మద్దతు వచ్చింది. పలువురు ప్రముఖులు ఆర్థిక సాయం చేయడంతో పాటు ప్రశంసలు కురిపించారు. ఆ ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ ఫాలోయింగ్‌ మాత్రం భారీగా పెరిగింది. ప్రస్తుతం ఆమెను యూట్యూబ్‌లో 4.83లక్షల మంది, ఇన్‌స్టాగ్రామ్‌లో 7.83లక్షల మంది, ఫేస్‌బుక్‌లో 1.42 లక్షల మంది అనుసరిస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని