ఏడుపు వల్ల కూడా లాభాలున్నాయ్‌!

బాధ.. నొప్పి.. సంతోషం ఏది ఎక్కువైనా కన్నీళ్లు బయటికొచ్చేస్తాయి. అలా ఎవరైనా కన్నీళ్లు పెట్టుకుంటే చిన్నపిల్లల్లా ఏడవటమేంటని ఎగతాళి చేస్తుంటారు. కానీ, ఆ ఏడుపు వల్ల కూడా ఎన్నో లాభాలున్నాయని

Published : 16 Oct 2020 12:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాధ.. నొప్పి.. సంతోషం ఏది ఎక్కువైనా కన్నీళ్లు వస్తాయి. అలా ఎవరైనా కన్నీళ్లు పెట్టుకుంటే చిన్న పిల్లల్లా ఏడవటమేంటని ఎగతాళి చేస్తుంటారు. కానీ, ఆ ఏడుపు వల్ల కూడా ఎన్నో లాభాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.

కన్నీళ్లలో ముఖ్యంగా మూడు రకాలు. ఒకటి బాసల్‌ టియర్స్‌ (శుభ్రం చేసే కన్నీరు). నిమిషానికి ఒకటి నుంచి రెండు మైక్రోలీటర్ల వరకు ఉత్పత్తి అవుతాయట. ఇవి కళ్లను తేమగా ఉంచడంతోపాటు ఇన్‌ఫెక్షన్ల నుంచి కాపాడతాయట. రెండోది రెఫ్లెక్స్‌ టియర్స్‌ (కలక కన్నీరు). ఉల్లిపాయలు కోసినప్పుడు, కళ్లకు పొరపాటున ఏదైనా తాకినప్పుడు, దుమ్మూధూళి పడ్డప్పుడు కన్నీళ్లు వస్తాయి. ఇవి కళ్లలో పడ్డ దుమ్ము బయటకు వచ్చేందుకు, కళ్ల మంటను తగ్గించడానికి ఉపయోగపడతాయి. ఇక ఎమోషనల్‌ టియర్స్‌ (భావోద్వేగ కన్నీరు). ఎక్కువగా భావోద్వేగాలకు గురైనప్పుడు కళ్ల నుంచి నీరు ఉబికి వస్తుంటుంది. వీటి వల్ల మనిషికి ఒత్తిడి తగ్గుతుందట.

మనిషికి ఎక్కువ సంతోషం వచ్చినా, బాధ కలిగినా, భయపడ్డా, ఒత్తిడి పెరిగినా ఏడ్చేస్తారు. యేలె యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధనలో కన్నీళ్లు మనిషి భావోద్వేగాలను సమతుల్యం చేస్తాయని తేలింది. ఏడవటం వల్ల మానసిక ఒత్తిళ్లు తగ్గి మనసు కుదుట పడుతుందని పరిశోధకులు పేర్కొన్నారు. ఎక్కువసేపు ఏడవటం వల్ల శరీరంలో ఆక్సిటోసిన్‌, ఎండోజెనస్‌ ఒపియడ్స్‌ విడుదలవుతాయి. ఇవి శారీరకంగా, మానసికంగా ప్రశాంతతను కలిగిస్తాయి. దీంతో కాస్త చల్లబడి మౌనంగా ఉండిపోతారు. 

పిల్లలు ఏడుస్తుంటే కొన్నిసార్లు ఏడవనీ అని తల్లిదండ్రులు ఊరుకుంటారు. ఎందుకంటే ఏడ్చి ఏడ్చి నిద్రకు ఉపక్రమించినప్పుడు ఆ నిద్ర ఎంతో ప్రశాంతంగా ఉంటుందట. ఎక్కువ సేపు నిద్రపోగలరట. ఓ సర్వే ప్రకారం ఏడ్చి పడుకున్న వారికి మంచి నిద్ర పట్టడంతోపాటు లేచినప్పుడు మానసిక ఉల్లాసం కలుగుతుందట. అంతేకాదు కన్నీటిలో ఐసోజిమ్‌ అనే ఎంజైమ్‌ ఉంటుంది. దీనికి యాంటిమైక్రోబయల్‌ లక్షణాలు ఉన్నాయి. దీంతో కళ్లలోకి బ్యాక్టీరియా చేరితే ఐసోజిమ్‌ వాటితో పోరాడి కళ్లకు హాని జరగక్కుండా చూసుకుంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని